ETV Bharat / city

'తెదేపా నేతలపై పరువునష్టం దావా'

author img

By

Published : Jun 12, 2020, 3:50 AM IST

Updated : Jun 12, 2020, 6:36 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల అంశం కోర్టుల్లో తేలాకే ముందుకెళ్తామని సీఎం జగన్ అన్నారు. మంత్రివర్గ భేటీలో పలు కీలకాంశాలపై చర్చించిన ఆయన... ప్రభుత్వ స్థలాల వేలం వేసే సమయంలో ఇబ్బందుల పరిష్కారానికి ఓ కమిటీ వేస్తున్నామని చెప్పారు. సరస్వతీ పవర్స్‌కు అనుమతి వంటి విషయాలపై అడ్డగోలుగా విమర్శలు చేసేవారిపై ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

cm jagan
cm jagan

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఫైబర్‌నెట్‌, అప్పట్లో కార్డుదారులకు ఇచ్చిన చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫాలపై సీబీఐ విచారణ జరిపించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సమావేశంలో ఈ అంశాలపై సుమారు అరగంటపాటు చర్చ జరిగింది. ఉప సంఘం నివేదిక గురించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరించారు.

ఫైబర్‌నెట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో వాటిని ఎలా ఉల్లంఘించారనేదీ అంశాల వారీగా మంత్రి వివరించారు. ‘ఫైబర్‌గ్రిడ్‌ పాలకమండలిని ఏర్పాటు చేసి, చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ అనే వ్యక్తిని ఎండీగా నియమించారని.... ఆ వ్యక్తి గతంలో ఈవీఎం ట్యాంపరింగ్‌ విషయంలో పట్టుబడ్డారని మంత్రి బుగ్గన తెలిపారు. లోకేశ్‌ సన్నిహితుటైన టెరా సాఫ్ట్‌ సంస్థకు ఫైబర్‌నెట్‌ టెండరు ఇచ్చారని... కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే సుమారు 1,400 కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభించారని మంత్రి తెలిపారు. పారా పవర్‌సాఫ్ట్‌ అనే సంస్థ అర్హత పొందినా పరిగణనలోకి తీసుకోలేదని... నిర్వహణ బాధ్యతను కూడా టెరాసాఫ్ట్‌ సంస్థకు సంబంధించిన జెమిని కంపెనీకి అప్పగించారని మంత్రి బుగ్గన మంత్రిమండలి భేటీలో వివరించారు. 380 కోట్ల రూపాయల విలువైన సెట్‌టాప్‌ బాక్సుల సరఫరా విషయంలోనూ టెరాసాఫ్ట్‌ కంపెనీ సంబంధించిన మూడు కంపెనీలకు టెండరు ఖరారు చేశారని... ఎల్‌-1గా నిలిచిన కొరియన్‌ కంపెనీని పక్కనపెట్టేశారని మంత్రి బుగ్గన వివరించారు.

చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా సరకుల సరఫరా టెండర్లలోనూ అక్రమాలు జరిగాయని మంత్రి బుగ్గన భేటీలో వివరించారు. ఒక ప్రైవేట్‌ పోర్టల్‌ ద్వారా చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా సరకుల సరఫరా టెండర్లు ఖరారు చేశారని... కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఉన్నా పట్టించుకోలేదని అన్నారు. అర్హతలు కొందరికే అనుకూలంగా ఉండేలా మార్గదర్శకాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచారని... శనగలను 24 శాతం, గోధుమపిండిని 25 శాతం అధిక ధరకు కొన్నారని వివరించారు. నెయ్యి విషయంలో ఒకటి రెండు కంపెనీలకు అనుకూలంగా చేశారని మంత్రి బుగ్గన తెలిపారు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నపుడు మంత్రులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.

స్వరణకారులకు సాయం
మంత్రివర్గ సమావేశంలో జగనన్న తోడు పై 20 నిమిషాలకు పైగా చర్చ సాగింది. ఈ పథకంలో చిరువ్యాపారులకు సున్నా వడ్డీకి 10 వేలు ఇస్తున్నట్లే స్వర్ణకారులకూ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి ఒకరు అడిగారు. దీనికి సీఎం జగన్ స్పందిస్తూ ... వారికి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, సాయం అందించే ఆలోచన ఉందని.. ఆ మేరకు హామీ కూడా ఇచ్చాం కదా అన్నారు. వేర్వేరు కులాల వారు స్వర్ణకార పని చేస్తున్నందున కులం కాకుండా వృత్తి ప్రాతిపదికగా తీసుకోవాలని ఒకరిద్దరు ప్రతిపాదించగా జగన్‌ సమ్మతించారు. సమావేశం ముగిశాక సీఎం లేవబోతుండగా.. ఒకరిద్దరు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల అంశం లేవనెత్తారు. న్యాయస్థానంలో ఉంది కదా... వాటన్నింటినీ చూసుకుని ఎన్నికల విషయం చూద్దాం అని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. విశాఖపట్నంలో గుర్తించిన స్థలం వేలం ప్రస్తావన వచ్చినప్పుడు.. అక్కడ చాలా ఏళ్లుగా నివసిస్తున్నవారికి న్యాయం చేయాలని ఒక మంత్రి కోరారు. ఇలాంటి స్థలాల విషయం చూసేందుకు కమిటీ వేస్తున్నామని... వారికెలాంటి ఇబ్బంది రాకుండా కమిటీ పరిశీలిస్తుందని సీఎం జగన్ చెప్పారు.

తెదేపా వారిపై పరువు నష్టం దావా
మంత్రివర్గ ఎజెండా అంశాలు పూర్తయ్యాక, ముఖ్యమంత్రి జగన్‌ కలుగజేసుకుని ‘ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారని... సరస్వతీ పవర్స్‌కు సున్నపురాయి తవ్వకం లీజు పెంపు విషయంలోనూ ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లీజు పెంపుకు అనుమతి ఇవ్వకుండా ఆపారని... ఆ కంపెనీ కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే సరస్వతీ పవర్స్‌కు లీజు పెంచితే దానిపైనా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని... వాళ్లపై సంబంధిత శాఖే పరువు నష్టం దావా వేస్తుందని సీఎం జగన్ అన్నారు.

ఇదీ చదవండి:

'అవినీతిని కప్పిపుచ్చేందుకే సీబీ'ఐ'.. ఏడాదంతా కుంభకోణాలే..!'

Last Updated : Jun 12, 2020, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.