ETV Bharat / city

కొవిడ్‌పై యుద్ధంలో మనం గెలవాలి: సీఎం జగన్

author img

By

Published : Apr 14, 2021, 5:42 AM IST

ప్లవ నామ సంవత్సరంలో కొవిడ్‌పై యుద్ధంలో మనమంతా గెలవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. వర్షాలు బాగా కురిసి, రైతులందరికీ మంచి జరిగి, ప్రతి ఇల్లూ సుభిక్షంగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అని తెలిపారు.

సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్​ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి
సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్​ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి

ప్లవ నామ సంవత్సరంలో కొవిడ్‌పై యుద్ధంలో మనమంతా గెలవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ‘ప్లవ అంటేనే చీకట్లో నుంచి బయటకు పయనించే నావ అని అర్థం. అందుకే ఈ ఏడాది రాష్ట్రానికి బాగుంటుందని ఆశిస్తున్నా. వర్షాలు బాగా కురిసి, రైతులందరికీ మంచి జరిగి, ప్రతి ఇల్లూ సుభిక్షంగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరాయ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. అందులో...

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

‘రాష్ట్రంలో ఈ సంవత్సరం ధన, ధాన్య సమృద్ధి బాగా చేకూరుతుంది. వరుణుడి అనుగ్రహం బాగుంది. ప్లవనామ సంవత్సర సహజ లక్షణం కారణంగా మేఘాలు అన్ని ప్రాంతాలపైనా ఆవహించి, బాగా వర్షించడంతో అన్నిప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయి. పాల ఉత్పత్తులు పెరిగి, కొత్త వ్యాపారాలు పెరుగుతాయి. వ్యవసాయం బాగుంటే సహజంగానే వ్యాపారాభివృద్ధి ఉంటుంది.

నిరుటికంటే మెరుగైన ఆర్థిక విధానాలు కొనసాగుతాయి. అందరూ వ్యక్తిగతంగానూ ఆర్థికంగా బలపడతారు. మంత్రి బుధుడి స్థానంలో ఉన్నారు. గురు, శుక్రుడి అనుకూల ఫలితాలతో రైతులు, ప్రజలు సుఖంగా ఉంటారు. రాజు, సేనాధిపతి కుజుడై ఉన్నారు. దాంతో మంత్రిమండలి చక్కటి ఆలోచనలు చేసి, వాటిని అమలులో కృతకృత్యులవుతారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత జాతకరీత్యానూ గురువు అనుకూలంగా ఉన్నారు.

సంక్షేమ పథకాల అమలుపై సీఎం స్వయంగా బాధ్యత తీసుకుని, ప్రజల మన్ననలు పొందుతారు. విద్యా విధానంలోనూ కొత్త మార్పులు వస్తాయి. వైద్యపరంగా కరోనాను జయించే ప్రయత్నంలో సఫలీకృతమయ్యేలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సమస్యలను దాటుకుంటూ లాభదాయక మార్గాల్లో పయనిస్తూ విజయాలను సాధిస్తారు’ అని వివరించారు. విశాఖ శారదాపీఠం వారు పంపిన శేషవస్త్రాలను ముఖ్యమంత్రికి సోమయాజులు సమర్పించారు. తర్వాత ఉగాది పచ్చడినీ అందజేశారు. అనంతరం సోమయాజులను ముఖ్యమంత్రి సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్‌, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ వాణీమోహన్‌ పాల్గొన్నారు.
* రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల దేవాలయాల నుంచి వచ్చిన ప్రధాన, ఉప ప్రధాన అర్చకులను పట్టువస్త్రాలతో ముఖ్యమంత్రి సన్మానించారు.
* వ్యవసాయ పంచాంగాన్ని వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి విష్ణువర్ధన్‌రెడ్డి, మరో ప్రతినిధి డాక్టర్‌ వెంకట రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.
* ఈనెల నుంచి వచ్చే ఏడాది మార్చి ఆఖరు వరకు ఏడాదిపాటు ఏ నెలలో ఏయే పథకాల కింద సంబంధిత లబ్ధిదారులకు సాయమందిస్తారనే సమాచారంతో కూడిన వార్షిక క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు.
* వైకాపా కేంద్ర కార్యాలయంలో ఉగాది ప్రత్యేక పూజలు చేశారు. వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రంజాన్ ప్రారంభం: ముస్లిం సోదరులకు సీఎం జగన్ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.