ETV Bharat / city

'ప్రకృతి సాగుకు పాధ్యాన్యమివ్వాలి.. ఆ రైతులకు రివార్డులివ్వాలి'

author img

By

Published : Apr 26, 2022, 5:29 AM IST

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై సోమవారం నీతి ఆయోగ్‌ నిర్వహించిన జాతీయ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విధానంపై వివరాలు అందించడంతోపాటు కేంద్రానికి పలు సూచనలు చేశారు. అధిక విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ఇవ్వాలని కోరారు.

cm jagan
cm jagan

అధిక విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 90% వాటా భరించాలని కోరారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై సోమవారం నీతి ఆయోగ్‌ నిర్వహించిన జాతీయ సదస్సులో వర్చువల్‌ ద్వారా పాల్గొన్న సీఎం.. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విధానంపై వివరాలు అందించడంతోపాటు కేంద్రానికి పలు సూచనలు చేశారు. ‘ప్రకృతి వ్యవసాయం చేసే రైతును.. దేశానికి గొప్ప సేవకుడిగా భావించాలి. వారి కారణంగా.. రసాయన ఎరువులపై రాయితీ భారం తగ్గుతుంది. ఇలాంటి రైతులకు రివార్డులు ఇచ్చే విధానం తీసుకురావాలి’ అని సూచించారు. ‘ప్రకృతి వ్యవసాయంపై మూడేళ్లుగా రాష్ట్రంలో సానుకూల పరిస్థితి ఉంది. పెట్టుబడి ఖర్చులను తగ్గించడంతోపాటు, దిగుబడులూ సరాసరిగా ఉంటున్నాయని.. వరదలు, కరవు, చీడపీడలను తట్టుకుంటున్నాయని వెల్లడవుతోంది. జీవ వైవిధ్యంతోపాటు మంచి పౌష్టికాహారం లభిస్తోంది’ అని వివరించారు. ‘ప్రకృతి సాగు విధానాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలను రూపొందించాలి. వ్యవస్థీకృత పరిశోధనలు సాగాలి. ఈ రకమైన ఉత్పత్తుల వినియోగం ద్వారా ప్రజల్లో వచ్చే ఆరోగ్య మార్పులను పరిశీలించాలి. ఫలితాలను ప్రజల ముందుంచాలి’ అని సీఎం సూచించారు. ప్రకృతి వ్యవసాయం దిశగా రైతుల్ని మళ్లించేందుకు అయ్యే వ్యయం కంటే.. రసాయన ఎరువుల రాయితీ కోసం చేసే ఖర్చు చాలా ఎక్కువని చెప్పారు.

నిధులిచ్చేందుకు ముందుకొచ్చిన జర్మనీ
ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో భారీ ఎత్తున చేపట్టేందుకు అవసరమైన నిధులిచ్చేందుకు జర్మనీ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ప్రాజెక్టుకు అనుమతులు చివరిదశలో ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. అయిదేళ్లలో 20 మిలియన్‌ యూరోల ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని వివరించారు. ఇందులో భాగంగా ఇండో జర్మనీ గ్లోబల్‌ అకాడమీ ఆన్‌ ఆగ్రో ఎకాలజీ రీసెర్చి అండ్‌ లెర్నింగ్‌ సంస్థను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అనుసరించేలా ఈ సంస్థ పనిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం దీనికి భూములు, భవనాలను సమకూరుస్తుందని వివరించారు. రాష్ట్రంలోని మొత్తం సాగు భూమిలో 5 శాతం మేర ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. రసాయన ఎరువులు, పురుగుమందుల్ని వదిలి సహజ, ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లేందుకు మూడు నుంచి అయిదేళ్లు పడుతుందని వివరించారు. ఈ సమయంలో రైతుల సుస్థిర జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ‘రైతు భరోసా కేంద్రాల సాయంతో.. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఉత్తమ విధానాలు అనుసరించే రైతుల్ని కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్లుగా నియమిస్తున్నాం. వీరి ద్వారా మిగతా రైతులకు శిక్షణ ఇప్పిస్తున్నాం’ అని వివరించారు.

ఇదీ చదవండి: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో.. సీఎం జగన్‌ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.