Cinema bigwigs Meet CM Jagan: సీఎం జగన్ నిర్ణయం తమను ఎంతో సంతోషపరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. టికెట్ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాల ఐదో షోకు అనుమతించడం శుభపరిణామమని చెప్పారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడిందని కొనియాడారు. హైదరాబాద్ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్ చెప్పారని చిరంజీవి తెలిపారు. దానికి తమ వంతు సహకారం ఉంటుందని చెప్పామన్నారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని.. సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలిపారు.
ఇంకా ఎవరెవరు ఏమన్నారో వారి మాటల్లోనే...
ఈ నెల మూడో వారంలోగా ఉత్తర్వులు
సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన అనిశ్చిత వాతావరణానికి శుభం కార్డు పడింది. దీనిపై కమిటీ తుది ముసాయిదా నివేదిక న్యాయబద్ధంగా ఉంది. సీఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఈ నెల మూడో వారంలోగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తెలుగు సినిమాను, తెలుగుతనాన్ని కాపాడే దిశలో జగన్ ఉన్నారు. ఆయన పరిశ్రమ వైపు చల్లని చూపు చూడాలి. ప్రేక్షకులకు, పరిశ్రమకు లాభదాయకంగా, ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం తీసుకున్న నిర్ణయం సంతృప్తి కలిగించింది. చిన్న సినిమాలు రోజుకు అయిదు షోలు ప్రదర్శించుకునేందుకు ఆమోదం తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఇచ్చే వెసులుబాట్లపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీలోనూ పరిశ్రమ అభివృద్ధి చెందాలని, విశాఖపట్నంలో చిత్రీకరణలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలు చూశాక మాకు సంతృప్తి కలిగింది. - చిరంజీవి
సమస్యలకు పరిష్కారం..
సినీ పరిశ్రమకు ఇవాళ చాలా శుభపరిణామమని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్న మహేశ్.. ఆరు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమ గందరగోళంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఐదారు నెలలుగా గందరగోళ పరిస్థితి ఉందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. అందరి ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు వస్తున్నాయన్న ఆయన.. చిరంజీవి చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు.
సినీ పరిశ్రమకు ఇవాళ చాలా శుభపరిణామం. సీఎం జగన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆరు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమ గందరగోళంగా ఉంది. ముఖ్యమంత్రి చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. - మహేశ్‌బాబు, సినీనటుడు
ఓర్పుగా విన్నారు
సినిమా పరిశ్రమ కష్టాలన్నీ సీఎంకు తెలుసు. ఎంతో ఓర్పుతో అందరి అభిప్రాయాలు విన్నారు. పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అగాథం ఉందనే భ్రమ ఇప్పటివరకూ ఉండేది. అది తొలగిపోయింది. ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో చిరంజీవి ఇంత పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకొచ్చారు. ఆయన పరిశ్రమ పెద్ద అన్న విషయాన్ని ఆయన చర్యలే నిరూపించాయి. - ఎస్.ఎస్.రాజమౌళి
సానుకూలంగా చర్చలు
చర్చలు చాలా సానుకూలంగా జరిగాయి. అయిదారు నెలల నుంచి గందరగోళ స్థితిలో ఉన్నాం. - ప్రభాస్
ఐసీయూలో రోగిలా చిన్న సినిమా పరిస్థితి
తెలుగు రాష్ట్రాల్లో సగటు సినిమా మనుగడే కష్టమైపోయింది. ఐసీయూలో రోగిలా చిన్న సినిమా పరిస్థితి తయారైపోయింది. భారీ సినిమాలు విడుదలైనప్పుడు అన్ని థియేటర్లలోనూ వాటినే ప్రదర్శిస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకట్లేదు. అడుక్కునే పరిస్థితి వచ్చింది. దాన్ని రక్షించాలని ముఖ్యమంత్రికి విన్నవించాం. తగిన చర్యలు తీసుకుంటామని, పరిశ్రమలోనూ అంతర్గతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నంది అవార్డులపైనా ప్రభుత్వం దృష్టిసారించాలి. ప్రభుత్వం ఇకపై చర్చలకు పిలిచేటప్పుడు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్‌నూ ఆహ్వానించాలి. - ఆర్.నారాయణ మూర్తి
పరిశ్రమకు మేలు చేస్తే గుండెల్లో నిలిచిపోతారు
గతంలో సినిమాలు 50, 100 రోజులు ఆడేవి. పరిశ్రమలో వేలమంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. పరిశ్రమకు మంచిచేస్తే వారి గుండెల్లో మీరు నిలిచిపోతారు. - అలీ
చిన్న సినిమాలకు తోడుగా నిలబడండి
చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదు. దానివల్ల సినిమా చచ్చిపోయింది. వాటికి మీరు తోడుగా నిలబడండి. కేరళలో చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. మీరు ఏదైనా చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చేస్తారు. - పోసాని కృష్ణమురళి
అందరూ సంతృప్తి చెందేలా సీఎం సమాధానం
'చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్‌బాబు, పోసాని కృష్ణ మురళి తదితరులు మాట్లాడిన ప్రతి ఒక్క అంశాన్నీ ముఖ్యమంత్రి విన్నారు. వారు సంతృప్తి చెందేలా సమాధానం చెప్పారు. చిన్న సినిమాలకు స్థానం ఉండేలా చూడాలని, పండగల సీజన్, పెద్ద సినిమాల విడుదల సందర్భాల్లోనూ చిన్న సినిమాల విడుదలకు అవకాశమిచ్చేలా చూడాలని పరిశ్రమ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. విశాఖపట్నంలోనూ పెద్ద ఎత్తున షూటింగులు చేయాలని కోరారు. ఆ దిశగా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రూపొందిస్తామని, దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం వారితో చెప్పారు. మేము ఫిల్మ్‌ఛాంబర్‌ను విస్మరించలేదు. టికెట్ల రేట్ల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన కమిటీలో సభ్యులుగా వారినే నియమించాం. ఆ కమిటీ ప్రతిపాదనల్నే ఈ రోజు చర్చించాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చిరంజీవి అవిరళ కృషి చేశారు అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.
ఇదీ చదవండి