ETV Bharat / city

తుళ్లూరులో రైతులను ప్రశ్నించిన సీఐడీ అధికారులు

author img

By

Published : Mar 25, 2021, 5:09 PM IST

Updated : Mar 26, 2021, 6:00 AM IST

cid investigated tulluru farmers
తుళ్లూరులో రైతులను ప్రశ్నించిన సీఐడీ అధికారులు

అమరావతి అసైన్డ్ భూములపై.. తుళ్లూరులో రైతులను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని రాజధానికి చెందిన రాయపూడి, ఉద్దండరాయునిపాలెం కర్షకుల వద్ద వివరాలు నమోదు చేశారు.

గుంటూరు జిల్లాలోని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణ నేడు తుళ్లూరులో కొనసాగింది. రాజధాని ప్రాంతానికి చెందిన రాయపూడి, ఉద్దండరాయునిపాలెం రైతులను.. సీఐడీ అధికారులు స్థానిక పోలీస్​స్టేషన్​లో ప్రశ్నించారు. ఇప్పటికే రైతుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో.. రాజధానికి చెందిన మిగతా ప్రాంతాలలోనూ సీఐడీ వివరాలు సేకరిస్తోంది.

అసైన్డ్‌, లంక భూములను రాజధాని కోసం ప్రభుత్వం లాగేసుకుంటుందని, అందుకే ముందుగానే వాటిని తాము అమ్మిపెడతామంటూ కొంతమంది దళారులు చెబితే వారికి ఇచ్చేసి.. తాము నష్టపోయామని రాయపూడి, తాళ్లయపాలెం గ్రామాల రైతులు ఆరోపించారు. సీఐడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.

'నాకు సొంతంగా 16 సెంట్ల పట్టాభూమి, మా అన్నదమ్ములతో కలిపి ఉమ్మడిగా 1.40 ఎకరాల లంక భూమి ఉన్నాయి. పట్టా భూమి సీఆర్‌డీఏకే ఇచ్చేశాను. అందుకు ప్రతిగా 150, 60 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన రెండు ప్లాట్లు ఇచ్చారు. 150 గజాల ప్లాటును అమ్మేసి ఆ డబ్బులను పిల్లలకు పంచాను. లంక భూములను ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని చెప్పి దళారులు రూ.6 లక్షలకు మా భూమిని అమ్మించారు. రాయపూడికి చెందిన దళారీ చక్రవర్తి మాతో భూమి అమ్మించాడు. మంగళగిరికి చెందిన ఒక రెడ్డి కొనుక్కొన్నారు. తర్వాత మేము రూ.6 కోట్ల విలువైన భూమిని నష్టపోయినట్లు తెలిసింది.'- పోగుల వెంకటేశ్వరరావు, రైతు, రాయపూడి

'అసైన్డ్‌ భూములను రాజధాని కోసం ప్రభుత్వం లాగేసుకుంటుందని కొంతమంది దళారులు ప్రచారం చేశారు. దాంతో నాకున్న రెండున్నర ఎకరాల భూమిని రూ.45 లక్షలకు అమ్మేశాను. ఎవరూ బెదిరించలేదు. ఉద్దండరాయునిపాలేనికి చెందిన ఓ దళారీ నన్ను రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఈ భూములకు వచ్చే ప్లాట్లతో మీకు సంబంధం లేదని చెప్పి, వాటిని తీసుకున్నారు. నాతో ఒప్పందం రాయించుకున్నారు. మా పేరుమీద ప్లాట్లు వచ్చాయో, రాలేదో కూడా తెలీదు.'- మిక్కిలి బుజ్జిబాబు, రైతు, తాళ్లాయపాలెం

'ఎకరం రూ.13 లక్షలకు నాకున్న డీకే పట్టాభూమి 35 సెంట్లు (రికార్డుల్లో 75 సెంట్లు ఉంటుంది) అమ్మేశాను. తర్వాత కొద్దిరోజులకే రేట్లు పెరిగాయన్నారు. రూ.60 లక్షలు, రూ.70 లక్షలకు కూడా ఎకరం అమ్మారు. నేను నష్టపోయాను.' -కంభంపాటి యలమంద, రైతు, రాయపూడి.

ఇదీ చదవండి:

భారత్​ బంద్​కు అమరావతి ఐకాస మద్దతు: బొప్పరాజు

Last Updated :Mar 26, 2021, 6:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.