ETV Bharat / city

ONLINE CLASSES: ఆన్‌లైన్‌ తరగతుల వేళ.. పెరుగుతున్న దృష్టి లోపాలు

author img

By

Published : Jul 4, 2021, 12:28 PM IST

child suffering with eye problems
child suffering with eye problems

కరోనాతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. అంతా ఆన్​లైన్ మయమైంది. స్మార్ట్​ఫోన్​లో పాఠాలు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజుకు గంట, రెండు గంటలు ఆటలాడితేనే చిన్నారుల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందనే అందోళన తల్లిదండ్రుల్లో ఉండేది. ప్రస్తుతం రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటలు తరగతులు కొనసాగుతున్నాయి. దీంతో దృష్టి లోపం.. కళ్లకు సంబంధించిన పలు సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి.

రోజుకు ఒకటి రెండు గంటలు స్మార్ట్‌ఫోన్‌లో ఆటలాడితేనే చిన్నారుల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందనే ఆందోళన గతంలో ఉండేది. కానీ.. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకూ అంతా స్మార్ట్‌ఫోన్లలోనే పాఠాలు వినాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలకుపైగా ఆన్‌లైన్‌లో తరగతులు కొనసాగుతున్నాయి. దీంతో దృష్టి లోపం సహా కళ్లకు సంబంధించిన పలు సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. గత ఏడాది నిర్వహించిన ఆన్‌లైన్‌ తరగతుల వల్ల చాలామంది విద్యార్థుల దృష్టి లోపం మరింత పెరిగిందని కంటి వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌ తరగతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కళ్లపై ఒత్తిడి తగ్గించడంతో పాటు దృష్టి సమస్యలు రాకుండా విద్యార్థులను కాపాడొచ్చని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్‌ కోలా విజయశేఖర్‌ సూచించారు.

ఫోన్‌ కాంతి ఇలా..

మొబైల్‌ ఫోన్‌లో ఉండే కాంతి కూడా కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది పిల్లలు కాంతి ఎక్కువగా పెడుతుంటారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మొబైల్‌లో ఇచ్చే బ్లూ లైన్‌ను దాటి ఎరుపు గీత వచ్చే వరకు లైటింగ్‌ను పెటకూడదు. బ్లూ లైన్‌ కూడా చివరి వరకు రాకుండా.. సగం వరకు పెడితే సరిపోతుంది. కాంతి మరీ ఎక్కువగా.. మరీ తక్కువగా లేకుండా కళ్లకు ఆహ్లాదంగా ఉండే పరిధిలో పెట్టుకోవాలి. మొబైల్‌ను బయట సూర్యరశ్మి పడే ప్రాంతంలో పెట్టకూడదు. దానివల్ల మొబైల్‌ సరిగా కనిపించక.. కంటిపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది.

ఈ ఆహారం తప్పనిసరి..

ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతుల వల్ల కంటిపైనే ఎక్కువ పని పడుతోంది. అందుకే.. కంటికి ఆరోగ్యం పెంచే ఆహారం ఈ సమయంలో చాలా అవసరం. ప్రధానంగా ఆకు కూరలు నిత్యం తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. పాలు, గుడ్లు, నట్స్‌, క్యారెట్​, బీన్స్‌ వంటివి విద్యార్థులకు ఇవ్వాలి. నారింజ సహా సిట్రస్‌ అధికంగా ఉండే పండ్లు, రసాలు తాగించాలి. చేపలు కూడా మంచివే. జంక్‌, ఫాస్ట్‌ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి.

కాపాడే కవచాలు..

యాంటీ గ్లేర్‌, యాంటీ రిఫ్లెక్టివ్‌ అద్దాలు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ సమయం కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లను చూసేవారికి వీటితో రక్షణ ఉంటుంది. అధిక కాంతి కళ్లపై పడకుండా మధ్యలో ఈ కళ్లద్దాలు ఆపుతాయి.చాలామందికి కళ్లు మంటలు వస్తున్నా.. ఇంకా స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. పూర్తిగా చూపు పోయేందుకు కూడా అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కళ్లు మంటలు పుట్టడం, నీరుకారడం జరిగితే.. కాసేపు విరామం ఇవ్వాలి. లేదంటే కళ్లు మూసుకుని చెవులతో పాఠాలు వినాలి. చల్లటి నీటితో కళ్లను కడుక్కోవాలి. రాత్రి నిద్రపోయే సమయంలో కాసేపు కళ్లపై తడిగుడ్డ ఉంచుకోవాలి.

చిన్నపాటి కసరత్తులు..

రెండు అరచేతులు రుద్దుకుని వేడెక్కిన తర్వాత కళ్లపై కాసేపు ఉంచాలి. అలాగే.. కంటిని అన్ని వైపులా తిప్పేలా చేయాలి. కంటికి సంబంధించిన ఈ కసరత్తులు ఎలా చేయాలనేది.. యూట్యూబ్‌, గూగుల్‌లో ఉన్నాయి. వాటిని చూసి.. చిన్నారులతో చేయించొచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి చూస్తూ కూర్చోకూడదు. దీనివల్లే డ్రై ఐ, ఎర్రబారడం, కళ్లలో మంట, చూపు మందగించడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌ పాఠాలు వినే విద్యార్థులు ఖచ్చితంగా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కనీసం రెండు నిమిషాల విరామం ఇవ్వాలి. ఆ విరామంలో చూపును స్మార్ట్‌ఫోన్‌ నుంచి పక్కకు మరల్చాలి. తడి గుడ్డను కంటిపై ఒక నిమిషం ఉంచుకోవాలి.

కంటికి స్మార్ట్‌ఫోన్‌కు ఖచ్చితంగా 25 అంగుళాల దూరం ఉండాలి. 40 అంగుళాల దూరం దాటి కూడా ఉంచకూడదు. అప్పుడే కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. గంటల తరబడి ఆన్‌లైన్‌లో పాఠాలు వినాల్సి ఉండడంతో.. నేరుగా కళ్లపై కాంతి పడేలా కాకుండా.. కాస్త పక్కగా ఫోన్‌ను ఉంచాలి. కంటి చూపు ఉండే ఎత్తుకు నాలుగు నుంచి ఐదు అంగుళాల కిందకి ఫోన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

ప్రస్తుతం చిన్నారులకు స్మార్ట్‌ఫోన్లతో తప్పక గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా తరగతుల మధ్యలో కొద్దిగా విరామం ఇవ్వడం, చిన్నారులతో మధ్యలో కొన్ని నిమిషాలు కళ్లు మూయించి ఉంచడం వంటివి చేయించాలి. ఎందుకంటే.. ఆన్‌లైన్‌ తరగతుల వల్ల.. గత ఏడాది -2 దృష్టిలోపం ఉన్న విద్యార్థులు కొద్ది నెలల్లోనే -4కు వెళ్లిపోవడం నేను చూశాను. ఇలాంటి కేసులు బాగా పెరిగాయి. అందుకే.. మంచి ఆహారం ఇవ్వడం, కళ్లకు సంబంధించిన ప్రాథమిక జాగ్రత్తలు పాటించడం చేయాలి. కళ్లు ఎర్రబారడం, నీళ్లు కారడం, డ్రైగా మారడం, ఇరిటేషన్‌గా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.- డాక్టర్‌ కోలా విజయశేఖర్‌, కంటి వైద్యనిపుణులు

ఇదీ చదవండి: alluri jayanthi: చిన్నప్పటి చిట్టిబాబే.. తర్వాత అల్లూరి సీతారామరాజు అయ్యాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.