ETV Bharat / city

CYBER CRIME: 'కౌన్​ బనేగా కరోడ్​ పతి కాల్'​ అంటూ..రూ.8 లక్షలు కాజేశారు

author img

By

Published : Jul 25, 2021, 10:15 AM IST

Cyber crime
సైబర్​ క్రైం

క్యాన్సర్​తో పోరాడుతున్న తల్లిని బతికించుకోవాలనుకుంది. తల్లి చికిత్సకు.. తన సంపాదనలో దాచుకుంది కొంత.. మరికొంత అప్పుచేసి సగం డబ్బు పోగుచేసింది. మిగిలిన నగదు కోసం ఏం చేయాలో తెలియని స్థితిలో ఓ ఫోన్​ కాల్ వచ్చింది. ఆ కాల్.. తనకు రూ.25 లక్షలు ఆఫర్ చేసింది. కానీ.. ఆ 25 లక్షల రూపాయలు పొందేందుకు ప్రయత్నించి.. ఆమె దాదాపు 8 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఇంతకీ ఆ కాల్ చేసింది ఎవరు? రూ.25 లక్షలు ఎందుకు ఇస్తామన్నారు? ఆమె రూ.8 లక్షలు ఎలా కోల్పోయింది?

తల్లి క్యాన్సర్‌తో పోరాడుతోంది. వైద్యం చేయించాలన్నది కుమార్తె కోరిక. ఈలోగా ఓ ఫోన్‌ వచ్చింది. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో మీరు విజేతగా నిలిచారు. రూ.25 లక్షలు గెలుచుకున్నారని చెప్పడంతో తల్లికి వైద్యం చేయిద్దామనుకుంది. వల విసిరింది సైబర్‌ నేరగాళ్ల(Cyber Crime)ని తెలుసుకోలేక రూ.8 లక్షలు కోల్పోయింది.

కౌన్ బనేగా కరోడ్​పతి ప్రైజ్ మనీ..

హైదరాబాద్​ జీడిమెట్ల ఠాణా పరిధి చింతల్‌కు చెందిన మహిళకు ఈనెల 9న ఓ ఫోన్‌ వచ్చింది. విజయ్‌కుమార్‌ను మాట్లాడుతున్నానని, ‘కౌన్‌ బనే గా కరోడ్‌పతి’లో రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నారని చెప్పాడు. ఖాతా నంబరు చెప్పమన్నాడు. స్నేహితుల ఖాతా నంబరు ఇచ్చింది. ప్రాసెసింగ్‌ ఫీజు రూ.2 లక్షలు చెల్లించాలనడంతో మీ సేవా కేంద్రం నుంచి వారు చెప్పిన ఖాతాకు పంపింది. 15న మరో వ్యక్తి వాట్సాప్‌కాల్‌ చేసి.. తాను సునీల్‌మెహతా అని, కౌన్‌ బనేగా కరోడ్‌పతికి విచారణ అధికారిని అన్నాడు. కరెన్సీ మార్పు కోసం రూ.75 వేలు చెల్లించాలని చెప్పడంతో చెల్లించింది. 16న మకొకరు ఫోను చేసి.. రూ.25 వేలు చెల్లించాలనడంతో పంపించింది.

అలా గ్రహించింది..

17న సునీల్‌ మెహతా మళ్లీ ఫోన్‌ చేసి.. ప్రైజ్‌ మనీ పంపించాం. ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు ఆపేశారు. సెటిల్‌మెంట్‌ చేసుకోమని చెప్పాడు. రెండు బ్యాంకు ఖాతాలను పంపించి.. రూ.1.25 లక్షలు చెల్లించాలని సూచించడంతో ఆ మొత్తం పంపించింది. ఇలా వివిధ కారణాలు చెబుతూ 18న రూ.1.30 లక్షలు, 21న మరికొంత నగదు రాబట్టుకొన్నారు. 13 రోజుల పాటు సాగిన సంభాషణలో బాధితురాలు విడతల వారీగా రూ.8,18,000 చెల్లించింది. మళ్లీ ఫోను చేసి నగదు కావాలని అడుగుతుండటంతో మోసపోయినట్లు గ్రహించి జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోజుకో రూట్..

రోజురోజుకు సైబర్ నేరగాళ్ల(Cyber Crime) ఆగడాలు పెరిగిపోతున్నాయి. వారి ఆగడాలు అడ్డుకునేందుకు పోలీసులు వివిధ పంథాలు అనుసరిస్తున్నా.. రోజుకో రూట్ మారుస్తున్న కేటుగాళ్లు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అమాయకులకు వల వేసి వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు.

యువతే ఎక్కువ..

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ కేటుగాళ్ల(Cyber Crime) వలకు చిక్కకుండా జాగ్రత్తపడాలని పోలీసులు సూచిస్తున్నా.. చాలా మంది అమాయకులు వారి మాయలో పడి మోసపోతున్నారు. ఇలా మోసపోయేవారిలో ఎక్కువ మంది యువత, చదువుకున్న వాళ్లే ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి: భరత్​పూర్ దొంగల సైబర్ వల.. చిక్కితే విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.