ETV Bharat / city

CHANDRABABU: ప్రజలు తిరగబడితే పారిపోతారు.. ఖబడ్దార్: చంద్రబాబు

author img

By

Published : Nov 4, 2021, 2:02 PM IST

Updated : Nov 4, 2021, 2:21 PM IST

దీపావళి రోజున ఎన్నికల నామినేషన్లు పెట్టడం హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటమేనని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 16 సూచనలతో పార్టీ నేతలకు చంద్రబాబు లేఖ విడుదల చేశారు. ఎన్నికలు పకడ్బందీగా జరిగితే వైకాపా గెలవలేదని చంద్రబాబు అన్నారు.

chadra babu
chadra babu

చంద్రబాబు

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) నేటి నుంచే ప్రారంభించడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. హిందువులు దీపావళి పండగ చేసుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. దీన్నిబట్టి సీఎం ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇతర మతాల పండగలు ఉంటే ఎన్నికల ప్రక్రియ చేపట్టేవారా? అని నిలదీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందా..లేదా అని ప్రశ్నించారు.

‘‘ఫలానా తేదీలోపు ఎన్నికలు జరగాలని కేబినెట్‌ సమావేశంలో సీఎం చెబితే.. దానికి తానా తందానా అన్న రీతిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీపావళి అయ్యాక ప్రక్రియ మొదలు పెడితే కొంపలు కూలిపోతాయా? ఎందుకు వెంటనే పెట్టాల్సి వచ్చింది. దీనికి సమాధానం చెప్పగలరా?ఒక మతం మనోభావాలు దెబ్బతీసే విధంగా.. కనీసం దీపావళి జరుపుకోనీయకుండా అదేరోజున నామినేషన్లు వేసేలా చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’’ - చంద్రబాబు

డిజిటల్ పద్ధతిలో నామినేషన్లు స్వీకరించాలి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించారని దుయ్యబట్టారు. డిజిటల్ పద్ధతిలో నామినేషన్లు స్వీకరించే ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 16 సూచనలతో పార్టీ నేతలకు చంద్రబాబు లేఖ విడుదల చేశారు. జాగ్రత్తలతో నామినేషన్లు వేయాలని పార్టీ నేతలకు సూచించారు.

చిన్నతప్పు చేసినా నామినేషన్లు చెల్లకుండా చేసే ప్రమాదం ఉందని.. నామినేషన్ల దాఖలు సమయంలో న్యాయవాదుల సలహాలు తీసుకోవాలన్నారు. బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే రికార్డు చేయాలని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

'ఎన్నికలు పకడ్బందీగా జరిగితే వైకాపా గెలవలేదు. డబ్బులు కూడా కొంతమేర పని చేస్తాయని అనేక సంఘటనలు రుజువు చేశాయి. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యవహరించారు' - చంద్రబాబు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు..

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా అధికారులను నియమించుకున్నారని చంద్రబాబు అన్నారు. పెద్దిరెడ్డి అనుచరుడిని కుప్పంలో నియమించారని చంద్రబాబు ఫొటోలు ప్రదర్శించారు. గురజాల సంఘటనలపై చంద్రబాబు వీడియోలు ప్రదర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఫిర్యాదులు ఉన్న అధికారిని ఎలా నియమిస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.

'పుంగనూరు ఎన్నికల ప్రక్రియలో అడ్జగోలుగా వ్యవహరించారు. అడ్డగోలుగా వ్యవహరించిన ఎన్నికల అధికారిని లోకేశ్‌వర్మను కుప్పంకు బదిలీ చేశారు. లోకేశ్‌వర్మ అనే అధికారి పెద్దిరెడ్డి చెంచా. వెలుగు కో-ఆర్డినేటర్లతో ఎన్నికల అధికారి ఎలా మాట్లాడతారు? లోకేశ్‌వర్మపై చర్యలు తీసుకోవడానికి ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా? కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో చేద్దామని ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం. అక్రమాలకు అధికారులు సహకరిస్తే ప్రజల్లో దోషులుగా నిలబెడతాం. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎన్నికల విధుల్లో వేస్తారా? అవినీతి అధికారుల అంతం ప్రారంభమవుతుంది.' - చంద్రబాబు

హైకోర్టు ఆదేశాలు అమలు చేయట్లేదు..

ఎన్నికల నిర్వహణలో హైకోర్టు ఆదేశాలు అమలు చేయట్లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాల మున్సిపాల్టీలో నామినేషన్ పత్రాలు లాక్కెళ్లినా పట్టించుకోలేదన్నారు. చట్టాన్ని వేరేవాళ్లకు అప్పజెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నేత బెదిరిస్తారా అని ప్రశ్నించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వమని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

పారిపోతారు.. ఖబడ్దార్

'ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్.. పారిపోతారు.. ఖబడ్దార్. సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తే తగిన బుద్ధి చెబుతాం. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలి. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలు. తెదేపా కార్యకర్తలు వీరోచితంగా పోరాడాలి. ఎన్నికలయ్యే వరకూ నేను ఇక్కడే ఉంటా. అవసరమైతే ఎన్నికల కమిషనర్ వద్దకు, క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడతా.'- చంద్రబాబు

డీజీపీ సమాధానం చెప్పాలి..

గంజాయి సాగుపై ఆరోపణలు చేస్తే ఆధారాలు అడుగుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. గంజాయి సాగుపై పొరుగు రాష్ట్రాల పోలీసులు ఆధారాలిస్తే ఏం చేశారని నిలదీశారు. డీజీపీ మీరు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. తెదేపాది తప్పయితే క్షమాపణ చెబుతామన్నారు. రాష్ట్రంలో పెట్రోల్‌పై పన్ను ఎందుకు తగ్గించరని చంద్రబాబు అన్నారు. దేశంలో అత్యధికంగా పెట్రోల్‌ ధర మన రాష్ట్రంలోనే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Amaravathi farmers: మహా పాదయాత్రకు అపూర్వ మద్దతు.. ఇవాళ 11 కి.మీ

Last Updated : Nov 4, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.