ETV Bharat / city

Telangana Budget: తెలంగాణ వార్షిక పద్దు​పై కసరత్తు... ఆ కేటాయింపులకే ప్రాధాన్యం...!

author img

By

Published : Feb 19, 2022, 11:00 AM IST

budget meetings
తెలంగాణ బడ్జెట్​

Telangana Budget 2022-23: వచ్చే ఏడాదికి ప్రవేశపెట్టనున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్.. రెండున్నర లక్షల కోట్ల మార్కును దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంత రాబడులపై విశ్వాసంతో పూర్తి ఆశావహకంగా.. మరోమారు భారీ బడ్జెట్ దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. యథావిధిగా సంక్షేమం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేయనున్నారు. దళిత బంధు పథకానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఉండనుంది.

Telangana Budget 2022-23: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ వార్షిక బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. అన్ని శాఖలతో సంప్రదింపులు పూర్తి చేసిన ఆర్థికశాఖ.. ప్రతిపాదనలను పరిశీలించింది. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా.. ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి రూ.2 లక్షలా 30 వేల కోట్ల భారీ బడ్జెట్​ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మార్చి వరకు ప్రభుత్వం చేసే వ్యయం లక్షా 80 వేల కోట్లు దాటుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వానికి రాబడి బాగానే ఉంది. సొంత ఆదాయం అంచనాలను పూర్తి స్థాయిలో చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Telangana Budget Session : స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,500 కోట్లు అంచనా వేయగా.. ఇప్పటికే రూ.10,500 కోట్లు వచ్చాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల రాబడి రూ.15 వేల కోట్లు దాటవచ్చని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్ అంచనాలు అధిగమించవచ్చని అధికారులు అంటున్నారు. వాణిజ్య పన్నుల రాబడి బడ్జెట్ అంచనాలను అధిగమించనుంది. జీఎస్టీ, అమ్మకం పన్ను పెరుగుదల బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సొంత పన్నుల ఆదాయం మంచిగా ఉండటం సహా ఇతర మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

32 వేల కోట్ల అంచనా..

Telangana Budget Sessions : భూముల విక్రయం ద్వారా ఈ ఏడాది రూ.20 వేల కోట్లు అంచనా వేస్తే.. ఇప్పటి వరకు 5 వేల కోట్ల లోపు మాత్రమే వచ్చింది. ఐతే భూముల అమ్మకానికి ఉన్న అడ్డంకులు ఇటీవలే తొలగిపోవడంతో.. వేలం ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇప్పటికి విక్రయించిన భూములకు రికార్డు ధర రావడం, స్థిరాస్తి రంగం జోరుతో భూముల విక్రయం ద్వారా భారీ రాబడిని ఆశిస్తున్నారు. కేంద్ర పనుల్లో వాటా, గ్రాంట్ల కింద 2022-23లో రాష్ట్రానికి రూ.32 వేల కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు.

రానున్న ఏడాదికి 2 లక్షల 50 కోట్ల బడ్జెట్..

Telangana Budget 2022-23 : జీఎస్​డీపీ వృద్ధి రేటు వల్ల ఎఫ్​ఆర్​బీఎమ్​ పరిమితికి లోబడి తీసుకునే రుణం మొత్తం పెరగనుంది. 2021-22లో రుణం అంచనా రూ.45,559 కోట్లు కాగా.. రానున్న ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తం ఇంకా పెరగనుంది. వాటన్నింటి దృష్ట్యా 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పరిమాణం పెరగనుంది. ప్రస్తుత బడ్జెట్ రూ.2 లక్షల 30 కోట్లుగా ఉంది. రానున్న ఏడాదికి అది రూ.2 లక్షలా 50 కోట్ల మార్కును దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దళితబంధుకు పెద్దపీట..

తెలంగాణ బడ్జెట్​లో ఎప్పటి మాదిరిగా.. సంక్షేమం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేయనున్నారు. రైతుబంధు పథకంతో పాటు ఈసారి దళితబంధుకి పెద్దమొత్తంలో కేటాయింపులు జరగనున్నాయి. దళిత బంధు పథకానికి బడ్జెట్​లో ఏకంగా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాటితో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆయా రంగాలకు నిధుల కేటాయింపు పెరగనుంది.

ఇదీ చూడండి: ఆర్థిక రాజధానే కాదు.. కోటీశ్వరులకు ఆవాసం కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.