ETV Bharat / city

తెలంగాణ పబ్ కేసులో ముమ్మర దర్యాప్తు.. నిందితులపై తొలిరోజు ప్రశ్నల వర్షం!!

author img

By

Published : Apr 15, 2022, 9:29 AM IST

Hyderabad Pub Case
తెలంగాణ పబ్ కేసులో ముమ్మర దర్యాప్తు

Hyderabad Pub Case: పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పబ్‌ నిర్వాహకులు అభిషేక్‌, అనిల్‌ కుమార్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. తొలిరోజు ప్రశ్నల వర్షం కురిపించారు. పబ్‌లోకి కొకైన్‌ ఎలా వచ్చింది? హాష్‌ ఆయిల్‌ సిగరెట్లు ఎవరు విక్రయిస్తున్నారు? తదితర అంశాలపై నిందితుల నుంచి సమాచారం సేకరించారు.

Hyderabad Pub Case: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కీలక ప్రాంతంలో సంచలనం రేపిన పబ్‌ డ్రగ్స్‌ కేసులో.. మాదక ద్రవ్యాల గుట్టు తెలుసుకునేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో ఈ నెల 3న డ్రగ్స్‌ కలకలం రేగింది. అదే రోజు పబ్‌ నిర్వాహకులు అనిల్‌కుమార్, అభిషేక్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వీరిద్దరినీ కోర్టు అనుమతితో గురువారం నుంచి నాలుగు రోజులు కస్టడీకి తీసుకున్నారు. డ్రగ్స్‌ దందాపై తొలిరోజు పోలీసులు నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

వారితోనూ సంబంధాలున్నాయా..?: పోలీసులు దాడి చేసినప్పుడు పబ్‌ మేనేజర్‌ అనిల్‌ కుమార్‌ ముందు కొకైన్‌ పొట్లాలు లభించాయి. అదేరోజు అతడిని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదంటూ పోలీసులకు చెప్పాడు. పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌ను ప్రశ్నించినా.. తనకూ సమాచారం లేదన్నాడు. దీంతో పోలీసులు వారిద్దరి చరవాణులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు. వారి కాల్‌డేటాను పరిశీలించగా.. గోవాలో జరిగిన పార్టీలకు తరచూ అభిషేక్‌ వెళ్లేవాడని తేలింది. పబ్‌ మేనేజర్‌ అనిల్‌ ఫోన్‌లోని వాట్సాప్‌ చాట్‌లు, మెయిల్స్‌ను పరిశీలించగా.. అందులో సంకేత పదాలు, సంక్షిప సందేశాలున్నాయి. వీటిల్లో కొన్ని డ్రగ్స్‌ సూచించే విధంగా ఉండడంతో పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. పబ్‌కు వచ్చే యువకులకు హాష్‌ ఆయిల్‌ సిగరెట్లు విక్రయిస్తున్నారన్న ఆధారాలు లభించడంతో గంజాయి స్మగ్లర్లతోనూ పబ్‌ నిర్వాహకులకు సంబంధాల కోణంలోనూ పరిశోధిస్తున్నారు.

అనిల్‌ పార్టీలు.. అభిషేక్‌ ఆహ్వానాలు..: మాదక ద్రవ్యాలను వినియోగించేవారికి పుడింగ్‌ అండ్‌ మింక్‌పబ్‌లో ప్రవేశాలు, ఆహ్వానాలు పరిమితంగా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. పామ్‌ యాప్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలంటే రూ.2 లక్షలు చెల్లించాలన్న షరతు విధించారు. వారాంతాల్లో ప్రత్యేక పార్టీలను అనిల్‌ ఏర్పాటు చేస్తుండగా.. అభిషేక్‌ ఆహ్వానాలు పంపుతున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. సీసీ కెమెరాల ద్వారా లభించిన సమాచారంతో.. అభిషేక్‌ను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. అతడికి ఫోన్‌ నంబర్లు, సంభాషణలు చూపించి నిజాలు తేల్చే ప్రయత్నం చేశారు. పార్టీలు ఎన్నాళ్లుగా సాగుతున్నాయి? దందా వెనుక ఎవరున్నారు? తదితర వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పబ్‌ లీజుదారులు అర్జున్‌ వీరమాచినేని, కిరణ్‌ రాజ్‌ల పాత్రపైనా విచారించారు.

ఇదీ చదవండి: Porus Pollution: 'పోరస్‌' కాలుష్యం.. 55 ఏళ్లకే ప్రాణాలు పోతున్నాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.