ETV Bharat / city

రాష్ట్రాలకు దన్ను: 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు

author img

By

Published : Mar 27, 2021, 4:30 PM IST

Updated : Mar 27, 2021, 7:02 PM IST

గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు నిధులు, రాష్ట్రాల పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, నగదు బదిలీ, విద్యుత్ రంగం లాంటి కీలకైమన అంశాలపై 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు చేసింది. స్థానిక సంస్థలకు 2021-26 కాలానికి 2 లక్షల 36 వేల 805 కోట్లను ఆర్థిక సంఘం కేటాయించింది. మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు వివిధ అంశాల ఆధారంగా వెయిటేజి ఇచ్చి ప్రోత్సాహక ఆధారిత గ్రాంట్లు ఇవ్వాలని సూచించింది. స్థూల ఉత్పత్తిపై 0.50 శాతం మేర అదనపు నిధులు సమీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఎఫ్ఆర్బీఎం చట్టంలోనూ సవరణలు అవసరమని 15వ ఆర్థిక సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది.

15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు
15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు

ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు

గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలకు 2020-21 కాలానికి గానూ 60,750 కోట్ల రూపాయల్ని కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2021-26 కాలానికి ఈ సంస్థలన్నిటికీ 2 లక్షల 36 వేల 805 కోట్ల రూపాయల నిధుల కేటాయింపునకు కమిషన్ ఆమోదాన్ని తెలియచేసింది. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్​లకు ఈ నిధుల పంపకాలు సమాంతరంగా జరగాలని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర జీఎస్డీపీలో 0.50 శాతం మేర అదనపు నిధుల్ని సమీకరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఐదేళ్ల కాలానికిగానూ స్థూలపన్ను ఆదాయం రూ.135.2 లక్షల కోట్ల మేర ఉంటుందని ఆర్థిక సంఘం అంచనా వేసింది.

డివిజబుల్ పూల్​లో సెస్, సర్​ఛార్జీలు తీసివేసిన అనంతరం రూ.103 లక్షల కోట్లుగా స్థూలపన్ను ఆదాయం ఉంటుందని ఆర్థిక సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. డివిజబుల్ పూల్‌లో 41 శాతం ఉన్న రాష్ట్రాల వాటా 2021-26 కాలానికి 42.2 లక్షల కోట్ల మేర ఉంటుందని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. మొత్తం గ్రాంట్లతో సహా 10.33 లక్షల కోట్లు, పన్ను ఆదాయం పంపిణీ రూ.42.2 లక్షల కోట్ల మేర చేయాల్సి ఉంటుందన్నది ఆర్థిక సంఘం అంచనా. స్థూల రాబడిలో 34 శాతం కేంద్రంలోని వనరుల అవసరాలకు, జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలపై వ్యయం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం కేటాయించింది.

మెరుగైన పనితీరు కనపరిచిన రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన 12.5 శాతం మేర వెయిటేజీ కల్పించాలని ఆర్థిక సంఘం సూచించింది. పనితీరు ద్వారా ప్రోత్సాహకాలు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. మొత్తం 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంట్ల మంజూరుకు ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. 2 లక్షల 94 వేల 514 కోట్ల రూపాయల ఆదాయ లోటు ఉంటుందని స్పష్టం చేసింది. స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్ల మొత్తాన్ని 2021-26 కాలానికి 4 లక్షల 36 వేల 361 కోట్లుగా నిర్ధారించారు. ఈ గ్రాంట్లలో మొత్తం 8 వేల కోట్లను కొత్త నగరాల ఇంక్యుబేషన్ కోసం, వాటి పనితీరు ఆధారిత గ్రాంట్లుగా ఇచ్చేందుకు కేటాయించారు.

మున్సిపల్ సేవలకు 450 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు 2 లక్షల 36 వేల 805 కోట్లు, పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థలకు లక్షా 21 వేల 55 కోట్లు, స్థానిక సంస్థల్లో ప్రజారోగ్య నిధుల కోసం 70 వేల 51 కోట్లను ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు, పట్టణాలకు మాత్రమే ప్రాథమిక నిధులు ప్రతిపాదించారు. మిలియన్ ప్లస్ నగరాల కోసం 100 శాతం గ్రాంట్లు సిటీస్ ఛాలెంజ్ ఫండ్​కు పనితీరు ఆధారంగా అనుసంధానించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగంపై వ్యయం చేసే నిధుల్ని 8 శాతానికి పెంచాలని ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. వైద్యుల లభ్యతలో రాష్ట్రాల మధ్య అసమానతల దృష్ట్యా... అఖిలభారత స్థాయిలో వైద్యారోగ్య సేవల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆరోగ్య రంగానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్రాలకు లక్షా 6 వేల 606 కోట్లను సిఫార్సు చేసింది. పట్టణప్రాంతాల్లోని సీహెచ్​సీ, పీహెచ్​సీ, బ్లాక్ స్థాయిలో ప్రజారోగ్య విభాగాలు, గ్రామీణ ఉప వైద్య కేంద్రాల స్థాయిని, మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు 70 వేల 51 కోట్లు గ్రాంట్లుగా విడుదల చేయాల్సిందిగా ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. మిగిలిన 31,755 కోట్లు ప్రత్యేకించి ఆరోగ్య రంగానికి వినియోగించాలని పేర్కొంది. సాధారణ రాష్ట్రాలకు 13,367 కోట్లు, ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలకు రూ. 1,898 కోట్లు కేటాయించారు.

రాష్ట్రాలకు వివిధ రంగాల్లోనూ ప్రోత్సాహకాల కేటాయింపునకు ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. విద్యా రంగంలో సాధించే ఫలితాలను పెంచేందుకు 2022-23 నుంచి 2025-26 వరకు రూ.4,800 కోట్లును ప్రోత్సాహకాలుగా ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ప్రతీ ఏడాదీ రూ.1,200 కోట్ల చొప్పున ప్రత్యేకించాల్సిందిగా ఆర్థిక సంఘం సూచించింది. ఉన్నత విద్య కోసం ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్, మెడికల్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు, ఆన్‌లైన్ లెర్నింగ్ అభివృద్ధికి రూ.6,143 కోట్లను కేటాయించారు.

వ్యవసాయ సంస్కరణలు చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలకు 45 వేల కోట్ల రూపాయలను పనితీరు ఆధారిత ప్రోత్సాహకంగా ఉంచాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. భూ సంబంధిత చట్టాల సవరణకు, భూగర్భ జల నిల్వలను పెంచే రాష్ట్రాలకూ ప్రోత్సాహక ఆధారిత గ్రాంట్లను మంజూరు చేయాలని స్పష్టం చేసింది. నూనెగింజలు, పప్పుధాన్యాలు, కలప, కలప ఆధారిత ఉత్పత్తికీ ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయాల్సిందిగా సిఫార్సు చేసింది.

విద్యుత్ రంగ సంస్కరణల్లో పనితీరు ఆధారంగా రాష్ట్రాలకు అదనపు రుణాలు తీసుకునే వెసులుబాటునూ కల్పించేందుకు ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. ప్రస్తుత దశలో ఉన్న అనిశ్చితి, సమకాలీన వాస్తవాలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఆర్​బీఎం చట్టంలోనూ సవరణలు అవసరమని ఆర్థిక సంఘం పేర్కొంది.

ఇదీ చదవండీ... సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా

Last Updated : Mar 27, 2021, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.