ETV Bharat / city

Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశం

author img

By

Published : Aug 8, 2022, 8:17 AM IST

weather report: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో.. ఉత్తర కోస్తా, యానాంలో.... ఇవాళ, రేపు... ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Heavy rains
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

weather report: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమ, మంగళవారాల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. అల్పపీడన ప్రాంతం మధ్యగా ప్రయాణిస్తున్న నైరుతి రుతుపవన ద్రోణి.. ఆగ్నేయ దిశగా ఉత్తర అండమాన్‌ వరకు విస్తరించిందని వివరించారు. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో సోమ, మంగళవారాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 40- 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ హెచ్చరించారు.

గంగవరంలో 128 మి.మీ వర్షం: తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో 127.75 మి.మీ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మల్కిపురంలో 96.25 మి.మీ వర్షం పడింది. నంద్యాల, ప్రకాశం, బాపట్ల, విశాఖపట్నం, ఎన్టీఆర్‌, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిశాయి. శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల మధ్య విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడలో 87.75 మి.మీ, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో 77, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 71.75, ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో 65.5, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 65.25 మి.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, అనకాపల్లి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోనూ వానలు కురిశాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.