ETV Bharat / city

కేంద్ర పద్దుపై కోటి ఆశలు.. హోదా, రైల్వే జోన్‌ అమలుపై ఎదురుచూపులు!

author img

By

Published : Jan 31, 2021, 4:33 AM IST

కొత్త ఏడాదొచ్చి నెల కావస్తోంది. అంటే కేంద్ర కొత్త బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. ప్రతిసారిలానే ఈసారీ పద్దుపై రాష్ట్రం కోటి ఆశలు పెట్టుకుంది. విభజన హామీలనైనా కేంద్రం పూర్తిగా నెరవేరుస్తుందా అని ఎదురుచూడటం బడ్జెట్ చూశాక నిట్టూర్చడం.... ఏటా ఇదే అలవాటైంది. ఈసారి బడ్జెట్‌లోనైనా తమ ఆంక్షలు నెరవేరుతాయా.... ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ అమలు జరుగుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఏపీకి కేంద్ర సాయం
union budget 2021

రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్లు గడిచిపోతున్నా... ఆంధ్రప్రదేశ్‌ ఇంకా బాలారిష్టాలను దాటలేదు. చేయి పట్టుకుని నడిపించాల్సిన కేంద్రం.... ఇచ్చిన హామీలనే పూర్తిగా నెరవేర్చట్లేదు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు, ఎన్ని వేదికలపై మొరపెట్టుకున్నా కేంద్రం కనికరించడం లేదు. హోదా ప్రకటించే దిశగా ఈ బడ్జెట్‌లోనైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రత్యేక హోదాతో విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల్లో సింహభాగం కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లూ వస్తాయి. ప్రభుత్వంపై ఆర్థికభారం తగ్గుతుంది. పారిశ్రామిక రాయితీలు లభిస్తాయి.

రాష్ట్రంలో పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఉపాధి కరవైంది. అందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలతోపాటు ప్రైవేటురంగంలోనూ ఎక్కువ పరిశ్రమలు వచ్చేలా కేంద్రం చొరవ తీసుకోవాలని.. బల్క్‌డ్రగ్‌ పార్కులు వంటి ప్రాజెక్టుల్ని మంజూరు చేసి ఫార్మారంగ అభివృద్ధికి ఊతమివ్వాలని రాష్ట్రం కోరుతోంది. రాష్ట్రంలో అనేక చోట్ల రక్షణరంగ సంబంధిత పరిశ్రమలను కేంద్రం ప్రతిపాదించినా.... ఇంకా ఆచరణకు నోచుకోలేదు. 2014-15 నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు 22వేల 948 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా... 4వేల 117.89 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం తెలిపింది. అందులోనూ ఇప్పటికి 3వేల 979.5 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

ఒకట్రెండు తప్ప...

విభజన తర్వాత ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో.... ఒకట్రెండు తప్ప పెద్ద పరిశ్రమలు లేవు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవా పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. వాటి సత్వర పూర్తికి కేంద్రం సాయం చేయాల్సి ఉంది. విభజన హామీల్లో ఒకటైన గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు దిశగా ఒక్క అడుగూ పడలేదు. రాష్ట్రంలో 3 అంతర్జాతీయ విమానాశ్రయులండగా.... కొవిడ్ ముందు వరకూ కేవలం విశాఖకు మాత్రమే అంతర్జాతీయ విమాన సర్వీసులుండేవి. కొవిడ్ తర్వాత అవీ నిలిచిపోయాయి. అంతర్జాతీయ విమానాలు వచ్చేలా కేంద్రం చర్యలు ప్రకటించాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

ఆశించిన సాయం అందట్లేదు...

పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ.. కేంద్రం నుంచి ఆశించిన సాయం అందట్లేదు. ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా కాకుండా కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు జరిపి.... పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తులు ఉన్నాయి. 2017-18 ధరల సూచీ ఆధారంగా ప్రాజెక్టు సవరించిన అంచనాలు రూ.55,656 కోట్లుకు చేరగా.... వాటి ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరుతూనే వస్తోంది. విశాఖ కేంద్రంగా.... తూర్పు కోస్తా రైల్వే జోన్ ప్రకటించి రెండేళ్లవుతున్నా..... దీనికి అవసరమున్న 200 కోట్ల కోసం ఇప్పటికీ ముందడుగు పడలేదు. నిరుటి బడ్జెట్‌లో కొత్త జోన్‌, రాయగడలో కొత్త డివిజన్ ఏర్పాటుకు 3 కోట్లు కేటాయించినా వాటిని రాయగడకే ఖర్చు చేస్తున్నారు.

హైస్పీడ్ రైల్వే లైన్....

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి-65 వెంట హైస్పీడ్‌ రైల్వేలైన్‌ ప్రాజెక్ట్‌ కావాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. ఇది వస్తే తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణం సులభమవ్వడమే కాకుండా దూరమూ తగ్గుతుంది. దీని గురించి ఎంపీలు చాన్నాళ్లుగా కోరుతున్నా స్పందన లేదు. అమరావతిని రైలుమార్గంతో అనుసంధానించే ప్రాజెక్టు మంజూరైనా నిధులివ్వడం లేదు. ఇలా ప్రతి ఏటా కోటి ఆశలతో రాష్ట్ర ప్రజలు ఎదురుచూసే కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ఏమేర కేటాయింపులు చేస్తారో ఆసక్తికరంగా మారింది.



ఇదీ చదవండి

'తీవ్ర పరిణామాలు తప్పవు'... సీఎస్​కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.