ETV Bharat / city

తెలంగాణ జల విద్యుదుత్పత్తిని నిలువరించండి.. కేఆర్​ఎంబీకీ ఏపీ లేఖ

author img

By

Published : Apr 5, 2022, 7:07 AM IST

AP Letter to KRMB
కేఆర్​ఎంబీకీ ఏపీ లేఖ

AP Letter to KRMB: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ చేస్తున్న నీటి వినియోగాన్ని అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్​ఎంబీకి జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి లేఖ రాశారు. వేసవిలో తాగు నీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నందున సాగర్​ నీటితో తెలంగాణ విద్యుత్​ ఉత్పత్తి చేయకుండా నిలువరించాలని కోరారు.

విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడాన్ని నిలుపుదల చేసేలా చూడాలని కృష్ణ నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ అవసరాల కోసం నీటి విడుదలకు నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి లేఖ రాశారు. ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని నిలువరించాలని కోరారు.

‘తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి జలవిద్యుత్తు ఉత్పాదన కోసం నీటిని విడుదల చేస్తోంది. ఇలా చేస్తూ పోతే ఆ నీటిని ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వదిలేసే పరిస్థితులు ఏర్పడతాయి. సాగర్‌ దిగువ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నందున ప్రాజెక్టులో నీటిని భద్రపరుచుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం సాగర్‌ నీటితో జల విద్యుదుత్పత్తి చేయకుండా నిలువరించాలి’ అని జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు..

  • పులిచింతల జలాశయంలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 40.80 టీఎంసీల నీరుంది. గతంలోనూ తెలంగాణ ప్రభుత్వం వర్షాలు రాకముందే తరచూ సాగర్‌ నుంచి నీటిని విద్యుదుత్పత్తి పేరుతో దిగువకు వదిలిపెట్టింది. పదేపదే పులిచింతల స్పిల్‌ వే రేడియల్‌ గేట్లకు పనిచెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో 16వ గేటు కొట్టుకుపోయింది.
  • నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ పులిచింతలలోకి నీటిని వదిలితే, అక్కడ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. తర్వాత దిగువన ప్రకాశం బ్యారేజిలోకి విడుదల చేయాల్సిందే. ఇప్పటికే ప్రకాశం బ్యారేజి నిండుగా ఉన్నందున అక్కడా నిల్వ చేయలేం. వృథాగా సముద్రం పాలుచేయాల్సి ఉంటుంది.
  • సాగర్‌ దిగువన సాగునీటి అవసరాలు లేకుండా కేవలం విద్యుదుత్పత్తి కోసం జలాలను వినియోగించుకోవడం సరికాదు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించాలి.

ఇదీ చదవండి: CM Jagan Delhi Tour: నేడు దిల్లీకి సీఎం జగన్‌.. ప్రధానితో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.