ETV Bharat / city

YS VIVEKA MURDER CASE : 'కేసు విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం'

author img

By

Published : May 20, 2022, 4:43 AM IST

మాజీమంత్రి వివేకా హత్య కేసులో స్థానిక అధికారులు సహకరించడం లేదని సీబీఐ అధికారులు హైకోర్టుకు నివేదించారు. ఫోరెన్సిక్‌ నివేదిక రావాల్సి ఉండటంతో....కేసు విచారణ ఎప్పటికి పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేమని తెలిపారు.

HIGH COURT
HIGH COURT

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దిల్లీ, గాంధీనగర్‌ ఫోరెన్సిక్‌ లేబొరేటరీల నుంచి నివేదికలు రావాల్సి ఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును ఎప్పటికి పూర్తి చేస్తామన్న దానిపై నిర్ధిష్ట సమయం చెప్పలేమని స్పష్టం చేసింది. సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు ఈ మేరకు కోర్టుకు నివేదించారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా వివరాలను అఫిడవిట్‌ రూపంలో కోర్టులో దాఖలు చేశామని, నిందితుల అనుచరులు కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి వాహన డ్రైవర్‌ను బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. వసతుల కల్పన, పరిపాలనాపరమైన అనుమతుల వ్యవహారంలో స్థానిక అధికారుల నుంచి సహకారం అందడం లేదని చెప్పారు. పిటిషనర్లకు బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి.. నిందితులు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ల విచారణను జూన్‌ 13కి వాయిదా వేశారు. అప్పటిలోగా ఫోరెన్సిక్‌ నివేదికలను తెప్పించుకునేందుకు యత్నించాలని సీబీఐకి సూచించారు. సాధ్యపడకపోతే కేసు పూర్వాపరాల ఆధారంగా (మెరిట్స్‌) బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరుపుతామని చెప్పారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5), వై.సునీల్‌ యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3) బెయిలు కోసం హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ఇటీవల విచారణ జరిపారు.

ఇదీ చదవండి: Cannes Film festival: 'బ్రాండ్​ ఇమేజ్​తో కాదు.. ఇండియన్ బ్రాండ్​తో వచ్చా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.