ETV Bharat / city

university funds: నిధుల కోసం విశ్వవిద్యాలయాలపై దండయాత్ర..

author img

By

Published : Sep 29, 2022, 10:58 AM IST

Updated : Sep 29, 2022, 12:45 PM IST

AP university funds
విశ్వవిద్యాలయ నిధులపై కన్నేసిన ప్రభుత్వం

AP university funds: విశ్వవిద్యాలయ నిధులపై ప్రభుత్వం కన్నేసింది. గతంలోనే.. 150 కోట్ల రూపాయలను ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయించుకుంది. మళ్లీ మరో 2 వేల కోట్ల సేకరణకు సన్నద్ధమవుతోంది. ఇక భవిష్యత్‌లో వర్సిటీల అవసరాలకు నిధులెలా? కావాల్సినప్పుడల్లా ప్రభుత్వం వద్ద చేయిచాచాల్సిందేనా? ప్రభుత్వం సమయానికి ఇవ్వకపోతే పరిస్థితేంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.

AP Govt targets diversion of university funds: విశ్వవిద్యాలయాల నిధులను ఇతర కార్యకలాపాలకు మళ్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఒకసారి వర్సిటీల నుంచి 150 కోట్ల రూపాయలను.. రాష్ట్ర ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయించుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు మరోమారు నిధులపై దృష్టి పెట్టింది. అన్ని విశ్వ విద్యాలయాల నుంచి 2వేల కోట్ల రూపాయలు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విశ్వవిద్యాలయాల ప్రొఫైల్‌ పేరుతో ఉన్నత విద్యా మండలి ద్వారా ఆర్థిక వివరాలు సేకరిస్తోంది.

వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం: మీ వర్సిటీలో ఎంత మంది పని చేస్తున్నారు? ఎంతమంది పింఛనర్లు ఉన్నారు? ఏడాదికి జీతాలు, పింఛన్లకు ఎంత చెల్లిస్తున్నారు? మీ ఆదాయ వనరులేంటి? ఇప్పటివరకు ఎంత నిల్వ ఉంది? ఏయే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారు? కాలపరిమితి ఎప్పటికి పూర్తవుతుంది? అంతర్గత ఆదాయవనరులతో చేస్తున్న అభివృద్ధి కార్యకలాపాలేంటి? అనే వివరాలు అందించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది.

ఇప్పటికే జీతభత్యాలకు ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్‌ సరిపోకపోవడం లేదు: విశ్వవిద్యాలయాలు, బోర్డులలోని నిధులను కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని గతంలో ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో కొంత మొత్తం డిపాజిట్‌ చేశారు. అంతా డిపాజిట్‌ చేస్తే వెనక్కి రావని కొన్నింటిని అట్టిపెట్టుకున్నారు. ఇప్పుడు వాటినీ లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో పింఛన్లు, జీతభత్యాలకు ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్‌ సరిపోకపోవడంతో సొంత నిధులు ఖర్చుచేస్తున్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ ఉద్యోగులకు మూడేళ్లుగా ప్రయోజనాలను అందడంలేదు. ఇప్పుడున్న నిధులనూ తీసేసుకుంటే భవిష్యత్తులో వర్సిటీ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.

పెన్షనర్లకు చెల్లించే నిధుల వినియోగం:ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుమారు 4వేల మంది పెన్షనర్లున్నారు. వీరికి చెల్లించేందుకు ఏడాదికి 210కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం అన్నింటికీ కలిపి రూ.200కోట్లు ఇస్తోంది. దీంతో విశ్వవిద్యాలయానికి ఫీజులు, ఇతర ఆదాయం నుంచి ఏటా రూ.100కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల నిధులు కలిపి సుమారు.. రూ.400కోట్లు ఉన్నాయి. నాగార్జున వర్సిటీలో.... బోధనేతర సిబ్బంది పదవీవిరమణ పొందితే, వర్సిటీ నిధుల నుంచి చెల్లిస్తున్నారు.

ఇక అనంతపురం జేఎన్‌టీయూ ఇప్పటికే స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో రూ.50కోట్లు డిపాజిట్‌ చేసింది. వర్సిటీ కార్యకలాపాలు, పదవీ విరమణ ప్రయోజనాల నిర్వహణకు రూ.400కోట్ల వరకు ఉంచుకున్నారు. జేఎన్‌టీయూ కాకినాడ మొదటివిడతగా రూ.70కోట్లు డిపాజిట్‌ చేసింది. అనుబంధ కళాశాలలు ఎక్కువగా ఉండటంతో దీనికి ఆదాయం ఎక్కువ. ఇక్కడ సుమారు రూ.450కోట్ల వరకు ఉన్నాయి. ఏపీస్టేట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో డబ్బు డిపాజిట్‌ చేస్తే అవి వెనక్కి వచ్చే పరిస్థితి లేదని.. ఇప్పటికే వర్సిటీలు గగ్గోలు పెడుతున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Sep 29, 2022, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.