ETV Bharat / city

అప్పుల మోత.. వడ్డీ వాత.. ఇప్పటికే రూ.13,500 కోట్ల బహిరంగ రుణం

author img

By

Published : Jun 15, 2022, 7:47 AM IST

Debt of Rs.2000 Crores రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.2,000 కోట్ల రుణం సమీకరించింది. అత్యధికంగా 8.04 శాతం వడ్డీకి ఈ అప్పు తీసుకుంది. 20 ఏళ్ల కాలపరిమితితో రూ.వెయ్యి కోట్లు, 19 ఏళ్ల కాలపరిమితితో మరో రూ. వెయ్యి కోట్లు సేకరించింది.

ap government on Tuesday mobilized a debt of Rs 2,000 crore
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 2000 కోట్ల రుణం సమీకరణ

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.2,000 కోట్ల రుణం సమీకరించింది. అత్యధికంగా 8.04 శాతం వడ్డీకి ఈ అప్పు తీసుకుంది. 20 ఏళ్ల కాలపరిమితితో రూ.వెయ్యి కోట్లు, 19 ఏళ్ల కాలపరిమితితో మరో రూ. వెయ్యి కోట్లు సేకరించింది. ప్రతి మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటాయి. కేంద్ర ఆర్థికశాఖ అనుమతించిన మేరకు వాటి సెక్యూరిటీలను మార్కెట్లో వేలం వేసి రుణాలను సమీకరిస్తాయి.

ఈసారి ఆంధ్రప్రదేశ్‌తో పాటు హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు కూడా వేలంలో పాల్గొన్నాయి. తమిళనాడు రూ.వెయ్యి కోట్లు 7.94 శాతం వడ్డీకి, హరియాణా 7.69, 7.95 శాతం వడ్డీకి రూ.రెండు వేల కోట్ల రుణాలు తీసుకున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ 8 శాతానికి మించి వడ్డీ చెల్లించేందుకు ముందుకు వస్తేనే అప్పు పుట్టింది.

ఈ నెలలోనే అత్యధికం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ప్రభుత్వం ఇంతవరకు రూ.17,890 కోట్లు సెక్యూరిటీల వేలంతో రుణంగా తీసుకుంది. ఈ నెలలో తీసుకున్న రుణాలకే అత్యధిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగానే వడ్డీ కూడా ఉంటుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

మనకు ఉన్న చేబదుళ్ల వెసులుబాటు, ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం కింద వినియోగించుకున్న నిధులు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం వంటి వాటి విషయంలో ఎన్ని రోజుల్లో తిరిగి చెల్లించాం, ఎన్ని రోజులు ఓవర్‌ డ్రాఫ్ట్‌లో ఉండాల్సి వచ్చిందన్న అంశాల ప్రాతిపదికన రాష్ట్ర క్రెడిట్‌ రేటింగు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. జూన్‌ 7న రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు రుణంగా తీసుకుంది. దానికి వడ్డీ ఏకంగా 8.07 శాతం.

రుణపరిమితిలో దాదాపు సగం హుళక్కి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రూ.28 వేల కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతులిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 7 నుంచి మే 2 వరకు మొత్తం రూ.4,390 కోట్లు రుణంగా తీసుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో అదనంగా వచ్చిన రుణ వెసులుబాటును వినియోగించుకోనందున దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నట్లు లెక్కలు పేర్కొంటున్నాయి.

ఈ ఏడాది రుణ అనుమతులు కూడా ఆలస్యంగా వచ్చాయి. ఆ తర్వాత గతంలో ఎన్నడూ లేని రీతిలో ఒక్క మే నెలలోనే దాదాపు రూ.9,500 కోట్ల రుణం తీసుకున్నారు. జూన్‌ నెలలో ఇంతవరకు రూ.4,000 కోట్లు బహిరంగ మార్కెట్‌ రుణం పొందారు. కేంద్రం అనుమతించిన రుణంలో దాదాపు సగం మొత్తాన్ని తొలి మూడు నెలలు పూర్తి కాకముందే రాష్ట్రం సమీకరించడం గమనార్హం. అప్పులతోనే రాష్ట్ర అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోందని చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.