ETV Bharat / city

Disha app: దిశ యాప్​పై విస్తృత ప్రచారం..అవగాహన కార్యక్రమాలు

author img

By

Published : Jun 28, 2021, 6:23 PM IST

Updated : Jun 29, 2021, 10:26 AM IST

దిశ యాప్ (Disha app)పై మరింత ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం ఆదేశాలతో ఇప్పటికే అధికారులు అనేక కార్యక్రమాలను చేపట్టారు. గొల్లపూడిలో జరిగే యాప్ డౌన్ లోడ్ కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) స్వయంగా హాజరుకానున్నారు.

ap governament steps in to promote Disha app
ap governament steps in to promote Disha app

మహిళల భద్రత, రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న దిశ యాప్‌ వినియోగంపై అవగాహన, చైతన్యం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టింది. మహిళలు, యువతులు, విద్యార్ధినులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఇంటింటికీ ప్రచారం చేసి వారిలో అవగాహన పెంచాలని సీఎం జగన్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి, డీజీపీ సహా అత్యున్నత స్ధాయి అధికారుల సమావేశంలో కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి.. తానే స్వయంగా యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విజయవాడలోని గొల్లపూడిలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు.

దిశ యాప్‌.. ఉద్దేశ్యం

మహిళలకు మెరుగైన భద్రత, రక్షణ, అత్యవసర సమయాల్లో అండగా నిలిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లును ఆమోదించింది. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణను శరవేగంగా దర్యాప్తుచేసి, బలమైన ఆధారాలతో న్యాయస్థానాల ముందు వారిని నిలబెట్టడానికి తగిన చర్యలు తీసుకుంది. వీటితోపాటు మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, ఇతరత్రా నేరాల నివారణకు ప్రభుత్వం దిశ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్‌ ద్వారా రక్షణ, భద్రత కల్పించేలా మహిళలు, యువతుల్లో అవగాహన కల్పించేందుకు సీఎం ఆదేశాలతో ప్రభుత్వం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి మహిళా, యువతి, విద్యార్థిని కూడా తమ ఫోన్లలో దిశయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు చేపట్టింది. పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు విస్తృతంగా యాప్‌ డౌన్‌లోడ్, వినియోగంపై అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.

16 లక్షల డౌన్‌లోడ్లు..

మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన దిశయాప్‌ను ఇప్పటికే 16 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రతి మహిళా, యువతి, విద్యార్థిని డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఇంటింటికీ ప్రచారాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

పుష్‌ బటన్‌తో అలర్ట్‌..

పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పరిధిలో పుష్‌ బటన్‌ ఆప్షన్‌ ఉంటుంది. పోలీసులు అందరితో పాటు యాప్‌ ఉపయోగించే వారందరినీ ఒకేసారి అప్రమత్తం చేసేలా ఈయాప్‌లో అవకాశం ఉంది.

దిశ యాప్‌లో ఎస్‌ఓఎస్‌..

ఆపదలో ఉన్నామని సమాచారం ఇస్తే క్షణాల్లో యాప్ ద్వారా సహాయం అందుతుంది. యాప్‌లో అత్యవసర సహాయం (ఎస్‌ఓఎస్‌) బటన్‌ ఉంటుంది. యువతులు, మహిళలు ఎక్కడైనా ఆపదలో చిక్కుకున్నామని భావిస్తే వెంటనే యాప్‌ను ఓపెన్‌ చేసి, అందులో ఉన్న ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్‌ నంబర్, చిరునామా, వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశంతో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కి చేరుతుంది. ఆ వెంటనే కంట్రోల్‌ రూం సిబ్బంది అప్రమత్తమై తమకు సందేశం పంపినవారి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు. వారి వాయిస్‌తో పాటు పది సెకండ్ల వీడియో కూడా రికార్డ్‌ చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు పంపుతుంది. విపత్కర పరిస్ధితుల్లో దిశయాప్‌ను ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు, ఆ యాప్‌ వెంటనే దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది.

ఎన్నో ఫీచర్లు..

దిశ యాప్‌లో ఆపదలో ఉన్నామని అతివలు భావిస్తే పోలీసులతో పాటు కుటుంబసభ్యులకూ సమాచారం ఇచ్చే వెసులుబాటు ఉంది. ఇందులో కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించి ఐదు నంబర్లను ఫీడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఆపదలో ఉన్నవాళ్లు ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కిన వెంటనే ఆ ఐదు నంబర్లకు కూడా సమాచారం అందుతుంది. యాప్‌లోనే డయల్‌ 100, డయల్‌ 112 నంబర్లు ఉంటాయి. పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీసు స్టేషన్‌ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఏర్పాటు కూడా ఉంది. ఇవే కాకుండా ఆస్పత్రులు, మెటర్నటీ సెంటర్లు, ట్రామా కేర్‌ సెంటర్లు, బ్లాడ్‌ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు అందుబాటులో ఉంచారు.

డౌన్‌లోడ్‌ ఇలా..

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి, యాపిల్‌ ఫోన్‌లో అయితే యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం తమ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ వెంటనే ఆ మొబైల్‌ నంబర్‌కు ఒక ఓటీపీ నంబర్‌ వస్తుంది.దాన్ని కూడా యాప్‌లో నమోదు చేస్తే రిజిష్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇదీ చదవండి:

RDS Controversy: ఆర్‌డీఎస్‌ కుడికాలువ నిర్మాణం సక్రమమే: మంత్రి అనిల్

Last Updated : Jun 29, 2021, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.