ETV Bharat / city

మూడో వంతు ప్రాంతానికి ప్రాతినిధ్యమే లేదు.. ఇంతకాలం చేసిన కసరత్తు ఇదేనా..!

author img

By

Published : Apr 11, 2022, 6:04 AM IST

AP New Cabinet: కొండంత రాగం తీసి.. అన్నట్లుగా ఉంది మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తీరు. ఏదో చేద్దామనుకుని, తుదకు పెద్దగా ఏమీ చేయలేక పోయారన్న వ్యాఖ్యానాలు... రాజకీయవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో సీఎం జగన్‌తో పాటు వైకాపా ముఖ్యులు ఇంతకాలం చేసిన కసరత్తు ఇదేనా అని విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి.
AP News
AP News

AP New Cabinet: పాత మంత్రివర్గ సభ్యుల్లో ఒకరో ఇద్దరో కొనసాగుతారు అన్న దశ నుంచి ఆ సంఖ్య ముగ్గురు.. నలుగురు.. ఐదారుగురు.. ఇలా ఏకంగా పది దాటేసింది. తొలుత అనధికారికంగా చేసిన ప్రకటనలో పది మంది కొనసాగుతారని వెల్లడించగా, కీలకమైన ప్రకాశం జిల్లాకు స్థానం లేదన్న విషయమై నాలుక్కరుచుకుని మరొకరిని జత చేశారు. చివరకు ఏకంగా 11మంది పాత మంత్రులు తిరిగి కొనసాగనున్నారు. ఎన్నికల వ్యూహాలు, నాయకుల సిఫార్సులు... ఇలా రకరకాల కారణాలతో ముందుగా చేయాలనుకున్న మార్పుల్లో కొన్నింటికే పరిమితయ్యారన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 4 కీలక సామాజిక వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. మొన్నటి వరకు ఈ నాలుగింటిలో మూడు వర్గాల వారు మంత్రులుగా ఉన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ నాలుగు ప్రధాన సామాజిక వర్గాల్ని విస్మరించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఆయా వర్గాలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతున్నా... అది కంటితుడుపు వ్యవహారమేనన్న వ్యాఖ్యలు అధికార పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.


అగ్రవర్ణాలంటే ఆ రెండు సామాజిక వర్గాలే అన్నట్లుగా..: అగ్రవర్ణాల్లో.. పదుల సంఖ్యలో కీలక నామినేటెడ్‌ పదవులు, సలహాదారుల పోస్టులు పొందిన వర్గానికి, రాజకీయంగా కీలకమైన మరో సామాజిక వర్గాలకే... మంత్రివర్గంలో చోటు పరిమితమైంది. ఈ రెండు వర్గాల నుంచి ముగ్గురు చొప్పున ఉంటారని తొలుత ప్రచారం జరగ్గా.. కేబినెట్‌లో దాదాపు మూడో వంతు పదవులు లభించాయి. అగ్రవర్ణాలంటే ఈ రెండు సామాజిక వర్గాలే అన్నట్లుగా ఉంది. ఇదో రకమైన సామాజిక న్యాయం అన్న వ్యంగ్య వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బీసీల్లో అత్యధిక ఓ వర్గానికి ప్రాతినిధ్యం లభించలేదు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్న ఐదుగురిలో నలుగురిని కొనసాగిస్తూ, కీలక హోంశాఖ బాధ్యతలు చూసిన మహిళకు తాజా మంత్రివర్గంలో మొండిచెయ్యి చూపడం గమనార్హం. ఈ మార్పునకు ప్రాతిపాదిక ఏమిటన్నది చర్చ సాగుతోంది. మంత్రివర్గంలోకి మొదట్లో విన్పించని కొన్ని పేర్లు తాజా జాబితాలో చేరటం విశేషం. విశాఖలో ఎన్‌సీసీ సంస్థకు చెందిన అత్యంత విలువైన 97 ఎకరాల భూమిని బెంగళూరుకు చెందిన సంస్థకు కట్టబెట్టిన నేపథ్యంలో.. ఈ సంస్థ యాజమాన్యం సన్నిహిత బంధువుకు పదవి లభించడం అనూహ్యం. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎంచుకున్న ఓ మంత్రి పేరు సైతం విస్మయం కలిగించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మూడో వంతు ప్రాంతానికి ప్రాతినిధ్యమే లేదు..: అధికార, పాలనా వికేంద్రీకరణ అంటూ కొత్త జిల్లాల్ని ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకొకరు చొప్పున మంత్రివర్గంలో ఉంటారని భావించారు. ఒక మంత్రైనా ఉంటే పాలన, పర్యవేక్షణ సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇలా సర్దుబాటు చేయడం సహజం. ఇక్కడ ఆ సూత్రమూ అమలు కాలేదు. మళ్లీ పాత జిల్లాల ప్రాతిపదికనే ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఏకంగా ఎనిమిది జిల్లాలకు అంటే దాదాపు మూడో వంతు ప్రాంతానికి ప్రాతినిధ్యమే లేకపోవటం రాష్ట్ర రాజకీయ చరిత్రలో రికార్డుగా మిగిలిపోనుంది. విశాఖపట్నం, ఎన్టీఆర్‌, గుంటూరు, తిరుపతి, ఏలూరు వంటి జిల్లాల నుంచీ ఎవరినీ తీసుకోలేదు. హైదరాబాద్‌ను కోల్పోయిన రాష్ట్రానికి మిగిలిన కొద్దోగొప్పో నగరాలనుకున్నవి ఇవే. వీటికే ప్రాతినిధ్యం లేకపోవటం విచిత్రంగా ఉందన్న వ్యాఖ్యలు అధికార పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. బాగా వెనకబడిన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకూ అవకాశం లభించలేదు. రాష్ట్రానికి మూలగా, అభివృద్ధికి ఆమడదూరంలోనూ ఉన్న ఈ ప్రాంతాలను ప్రాతినిధ్యం లేదు.

కనీసం ఎమ్మెల్సీగానూ అవకాశం ఇవ్వకపోగా..: కిందటి ఎన్నికల సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఇరువురు నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని ఎన్నికల బహిరంగ సభల్లో జగన్‌ స్వయంగా ప్రకటించారు. వీరిలో మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఒకరు. అప్పట్లో మంత్రిగా ఉన్న లోకేశ్‌పై గెలిపిస్తే మంత్రి పదవి ఖాయమని పేర్కొన్నారు. చిలకలూరిపేటలో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మర్రి రాజశేఖర్‌ స్థానంలో కొత్తగా పార్టీలోకొచ్చిన విడదల రజనికి ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు. అధికారంలోకొస్తే ఎమ్మెల్సీగా తీసుకోవడంతోపాటు మంత్రివర్గంలోనూ స్థానం కల్పిస్తానని రాజశేఖర్‌కు హామీ ఇచ్చారు. కనీసం ఎమ్మెల్సీగానూ అవకాశం ఇవ్వకపోగా, ఏకంగా రజనినే మంత్రివర్గంలోని తీసుకోవడం విశేషం.

ఇదీ చదవండి: బజారుకెక్కిన "కేబినెట్ పంచాయితీ".. ఆశావహుల్లో నిరసన జ్వాల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.