ETV Bharat / city

రాష్ట్రంలో అధికార పార్టీ.. అరాచక పర్వం... వంతపాడుతున్న కొందరు పోలీసులు

author img

By

Published : May 22, 2022, 4:28 AM IST

రాష్ట్రంలో వైకాపా నాయకుల అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. వారి దౌర్జన్యాలకు నిత్యం ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. కొంతకాలం వరకూ తప్పుడు కేసులు, దాడులతో రాజకీయ ప్రత్యర్థులను వేధించిన నాయకులు... ఇప్పుడు సామాన్య ప్రజానీకంపైనా పడ్డారు. ఆగడాలను అరికట్టాల్సిన పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతున్న ఘటనలు... బాధితుల్ని మరింత నిస్సహాయులుగా మారుస్తున్నాయి. ఇక తమను ఆదుకునేవాళ్లు లేరనే భయంతో ఏడాది కాలంలోనే చాలామంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరికొందరు సర్వం కోల్పోయి మౌనంగా రోదిస్తున్నారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి... అనంతబాబే తన భర్తను చంపేశారన్న హతుడి భార్య ఆరోపణలతో... వైకాపా నేతల దాష్టీకాలు మరోమారు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

అరాచక పర్వం
అరాచక పర్వం

అరాచకాలు, ఆగడాలు రాష్ట్రంలో నిత్య కృత్యమవుతున్నాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. వీటన్నింటి వెనుక రాష్ట్రంలో కొందరు వైకాపా నాయకుల ప్రమేయం ఉండటం కలవరం రేపుతోంది. అధికార పార్టీ నేతలమన్న అహంతో చెలరేగిపోతున్న నాయకుల దందాలు, దౌర్జన్యాలకు రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు. ఇటీవల వరకూ రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల్ని తప్పుడు కేసులు, దాడులు, దౌర్జన్యాలతో వేధించిన కొందరు నాయకులు ఇప్పుడు సామాన్య ప్రజానీకంపైనా జులుం ప్రదర్శిస్తున్నారు. ‘అధికారం మా చేతిలో ఉంది. పోలీసులు మేం చెప్పినదానికల్లా తలాడిస్తారు. మాకు అడ్డేముంది?’ అంటూ రెచ్చిపోతున్నారు. ఆగడాలను అరికట్టాల్సిన పోలీసులూ అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతున్న ఘటనలు..

బాధితుల్ని మరింత నిస్సహాయులుగా మారుస్తున్నాయి. తమను ఇంకెవరూ ఆదుకోలేరనే భయంతో ఈ ఏడాదిలోనే చాలామంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరికొందరు సర్వం కోల్పోయి మౌనంగా రోదిస్తున్నారు. తాజాగా వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌, దళిత యువకుడైన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించడం, తన భర్తను అనంతబాబే చంపేశారని హతుడి భార్య ఆరోపించిన నేపథ్యంలో వైకాపా నేతల దాష్టీకాలపై మరోమారు తీవ్ర చర్చ జరుగుతోంది.

మహిళలపై వేధింపులు, అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన మొదలుకుని అత్యాచారాల వరకూ అనేక ఘటనల్లో కొందరు వైకాపా నాయకుల ప్రమేయం వెలుగు చూస్తోంది. తన కుమార్తె స్కూల్‌ టాపర్‌గా నిలిచేందుకు... ప్రతిభావంతురాలైన మరో సహచర విద్యార్థిని అడ్డంకిగా ఉందంటూ ఓ వైకాపా కార్యకర్త వేధించడంతో ఆ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోటీ చేశాడని తప్పుడు కేసులు పెట్టించి, పోలీసులతో కొట్టించి ఓ ఎస్సీ యువకుడి బలవన్మరణానికి కారణమయ్యారు అధికార పార్టీ నాయకుడొకరు. యువతిని వేధించటం సరికాదని హితవు పలికినందుకు ఓ యువకుణ్ని రాళ్లతో కొట్టి, అవమానించి.. అతని ఆత్మహత్యకు కారకులయ్యారు మరికొందరు వైకాపా నాయకులు. ఓ మహిళను శారీరకంగా, మానసికంగా వేధించి ఆమె ప్రాణాలు తీసుకునేలా చేశారు ఇంకో నాయకుడు. ఇలాంటివి నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తున్నా వైకాపా అధిష్ఠానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వపరంగానూ చర్యల్లేక నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.

5-1-2022 ఎస్సీ యువకుడి బలవన్మరణం :

...

కాకినాడ జిల్లా సామర్లకోటలోని బులుసుపేటకు చెందిన ఎస్సీ యువకుడు అలపు గిరీష్‌బాబు గతేడాది మున్సిపల్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తమకు వ్యతిరేకంగా పోటీ చేశాడని అతనిపై కక్ష పెంచుకున్న వైకాపా నాయకులు.. తప్పుడు ఫిర్యాదుతో కేసు పెట్టించారు. పోలీసుల వేధింపులు తాళలేక గిరీష్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. వైకాపా నాయకుల ఒత్తిడితో తన తమ్ముణ్ని రోజూ పోలీసు స్టేషన్‌కు పిలిపించి హింసించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని గిరీష్‌ సోదరుడు ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. మృతదేహాన్ని సామర్లకోట పోలీసుస్టేషన్‌ మెట్లపై ఉంచి ఆందోళన చేశారు.

17-3-2022 నాయకుడి వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న మహిళ : కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లె గ్రామ వైకాపా నాయకుడు గరికపాటి నరసింహారావు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ వీవోఏ గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు నరసింహారావుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు సరికదా... ఫిర్యాదు ఉపసంహరించుకోవాలంటూ ఆమెపైనే ఒత్తిడి తీసుకొచ్చారు. న్యాయం కోసం ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసినా మూడు రోజులపాటు కనీస స్పందన లేదు. వైకాపా నాయకుడి వేధింపులు పెరిగిపోవడంతో నిస్సహాయ స్థితిలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ‘నరసింహారావు, అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి నా సోదరిని హత్య చేశారు’ అని నాగలక్ష్మి సోదరుడు భోగాది వినయ్‌బాబు ఆరోపించారు.

23-3-2022 , చదువుల తల్లిని బలిగొన్న దౌర్జన్యం :

...

పలమనేరుకు చెందిన వైకాపా కార్యకర్త సునీల్‌కుమార్‌ దాష్టీకం బంగారు భవిష్యత్తు కలిగిన, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన మిస్బాను బలి తీసుకుంది. పదో తరగతిలో తన కూతురే స్కూల్‌ టాపర్‌గా నిలవాలని, ఆమెకు పోటీగా ఎవరూ ఉండకూడదంటూ... ఆమె కంటే బాగా చదివే, ఎక్కువ మార్కులు తెచ్చుకునే మిస్బాపై వేధింపులకు తెగబడ్డారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆ చిన్నారిని పాఠశాల నుంచి తొలగించేలా చేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మిస్బా ఆత్మహత్యకు పాల్పడింది. ‘నాన్నా పేదలు చదువుకోకూడదా? డబ్బున్న వాళ్లే చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలా? నాకు మంచి మార్కులొస్తే స్నేహితురాలే ఓర్వలేకపోతోంది. నేను మళ్లీ పాఠశాలకు వెళ్లాలంటే ఆ అమ్మాయి తండ్రి అనుమతి తీసుకోవాలంటూ మా ఉపాధ్యాయుడు వేధిస్తున్నారు’ అంటూ చనిపోయే ముందు ఆవేదనతో తన తండ్రికి లేఖ రాసింది. ఈ ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. బాధిత కుటుంబాన్నే డీఎస్పీ కార్యాలయానికి పిలిపించడం, మిస్బా రాసిన లేఖ స్వాధీనానికి అర్ధరాత్రి వేళ వారి ఇంట్లో సోదాలు చేయడం వివాదాస్పదమైంది.

11-4-2022, అసభ్య ప్రవర్తనపై ప్రశ్నిస్తే.. అంతు చూశారు..

...

యువతితో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదంటూ అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో గ్రామ సర్పంచి, వైకాపా నాయకుడు కన్నం శ్యామ్‌ను ఉద్దేశించి... శ్రీనివాస్‌ అనే యువకుడు వాట్సప్‌ స్టేటస్‌ పెట్టారు. అదే అతని నేరమైపోయింది. మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ శ్యామ్‌, అతని అనుచరుడు అద్దేపల్లి శ్రీనివాసరావు తదితరులు శ్రీనివాస్‌ను రాళ్లతో కొట్టారు. అవమానంగా భావించిన ఆ కుర్రాడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘నేనేం తప్పు చేశానని కొట్టారు? అధికారం ఉంటే ఏమైనా చేస్తారా? నా చావు తర్వాతైనా నిజాలు బయటకు వస్తాయి’ అంటూ ఆత్మహత్యకు ముందు తన స్నేహితులందరికీ వాయిస్‌ మెసేజ్‌లు పంపించారు.

16-2-2022, ఎంపీ నందిగం సురేష్‌ హల్‌చల్‌ :

..

అర్ధరాత్రి వేళ వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు తన సమీప బంధువులను అదుపులోకి తీసుకుని వదిలి పెట్టలేదంటూ.. వైకాపా ఎంపీ నందిగం సురేష్‌ తన అనుచరులతో ఫిబ్రవరి 16న విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో హల్‌చల్‌ చేశారు. 30 మందికి పైగా అనుచరులతో అర్ధరాత్రి దాటిన తర్వాత స్టేషన్‌లోకి వెళ్లి దాదాపు గంటకు పైగా వీరంగం వేశారు. విధుల్లో ఉన్న ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ తదితరులపై ఆగ్రహంతో ఊగిపోయారు. హెడ్‌కానిస్టేబుల్‌ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాల్ని చిత్రీకరిస్తుండగా ఎంపీ అనుచరులు ఫోన్‌ లాక్కొని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

16-3-2022, అనుచరగణం వీరంగం.. మంత్రి పెద్దిరెడ్డి అనుయాయుడి వేధింపులు :

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన శ్రీనాథ్‌రెడ్డి... గ్రామ వాలంటీర్లు, పోలీసులతో కలిసి తనను వేధిస్తున్నారంటూ చల్లావారిపల్లెకు చెందిన మధు అనే వ్యక్తి మార్చి 16న ఆత్మహత్యకు యత్నించారు. రొంపిచెర్ల మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ చల్లా లక్ష్మి భర్త శ్రీనాథ్‌రెడ్డి అధికార బలాన్ని వినియోగించి తనను వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అప్రమత్తమైన స్నేహితులు ఆయన్ని కాపాడుకున్నారు.

3-4-2022, టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయుల దాడి:

...

ఏప్రిల్‌ 3న కర్నూలు జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై అమకతాడు టోల్‌ప్లాజా వద్ద తమను నేరుగా అనుమతించలేదంటూ పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరుల వీరంగం సృష్టించారు. ‘మా కారు వస్తే గేటు ఎందుకు ఎత్తట్లేదు?’ అంటూ కర్రలతో దాడి చేయడంతో కొందరు టోల్‌ప్లాజా సిబ్బంది గాయపడ్డారు.

* తాము అడిగినంత కమీషన్‌ ఇవ్వట్లేదంటూ మద్దికెర పరిధిలో రైల్వే పనులు చేస్తున్న గుత్తేదారులపై ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు దాడికి పాల్పడ్డారు. సిబ్బంది, కూలీలను రాళ్లతో కొట్టి గాయపరిచారు. అక్కడున్న వాహనాలు, యంత్రాల్ని తమతోపాటు తీసుకెళ్లి కొద్ది దూరంలో పడేశారు.

28-3-2022
‘రాయదుర్గం ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని’

తమ గ్రానైట్‌ క్వారీలోకి ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న వాహనంతో చొరబడి పనులకు అడ్డుపడుతున్నారని, క్వారీ వదిలివెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరిస్తున్నారని రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడైన గాలి అమర్‌నాథ్‌రెడ్డి, తదితరులపై కొందరు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ కర్ణాటకలోని హోసపెటేకు చెందిన శశినారాయణ ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

26-3-2022 , ఎస్సీ బాలికపై అత్యాచారం... వైకాపా నేత ప్రమేయంపై ఫిర్యాదు :

తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు, ఏపీ ఫిషర్‌మెన్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఆఫ్కాప్‌) ఛైర్మన్‌ కె.అనిల్‌బాబుపై గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎస్సీ బాలిక తండ్రి ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

...

తెదేపా సానుభూతిపరులమని.. వైకాపా నాయకుల ఒత్తిడితో తమ ఇంటిని కూల్చేశారంటూ అనంతపురం జిల్లా కుందుర్తి మండలం నిజవల్లి గ్రామానికి చెందిన దళితులు హనుమంత రాయుడు, అనితా లక్ష్మి దంపతులు ఈ నెల 7న ఆత్మహత్యకు యత్నించారు.

9-5-2022 ,కబ్జాలు, విలువైన భూములపై కన్ను : మంత్రి ఆదిమూలపు సురేష్‌ తమ ఎకరా భూమిని ఆక్రమించారని, ప్రశ్నిస్తే ఇబ్బందులు పెడుతున్నారని మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన కేసరి రంగలక్ష్మమ్మ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ‘మీరైనా న్యాయం చేయండి సారూ’ అంటూ కలెక్టర్‌ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. అయితే అవి తప్పుడు ఆరోపణలంటూ ఆదిమూలపు సురేష్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

* ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు ఒకరు తమ భూమి కబ్జా చేశారంటూ వృద్ధ దంపతులు మురళీమోహన్‌గౌడ్‌, జయదేవి ఇటీవల కర్నూలు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు.

* తెనాలిలో రద్దీగా ఉండే కూడలిలో నూనె రామకృష్ణ అనే వ్యాపారికి సంబంధించిన దుకాణాన్ని మున్సిపల్‌ అధికారులు ఇటీవల కూలగొట్టారు. తన స్థలంపై కన్నేసిన వైకాపా నాయకుడు ఒత్తిడితోనే అధికారులు కూల్చేశారంటూ బాధితుడు ఆరోపించారు.

మర్డర్లు నా వృత్తి.. నన్నే డబ్బులడుగుతారా? : ‘మర్డర్లు చేయడం నా వృత్తి.. నన్నే డబ్బులు అడుగుతారా? మిమ్మల్ని చంపేస్తా. నేను బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మనిషిని. తలచుకుంటే సాయంత్రానికి ఆసుపత్రి లేకుండా చేస్తా’ అంటూ సిద్ధార్థరెడ్డి అనుచరుడు చికెన్‌ బాషా నందికొట్కూరులోని సుజాత ఆసుపత్రి సిబ్బందిపై ఏప్రిల్‌ 8న దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రి బిల్లు చెల్లించాలని అడిగినందుకు ఇలా దౌర్జన్యం చేశారు.

23-4-2022, దాడులు, దౌర్జన్యాలు : సత్యసాయి జిల్లా కదిరిలో మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య కుటుంబానికి చెందిన లాడ్జిని స్వాధీనం చేసుకోవడానికి వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారు. అనంతపురం జిల్లాకు చెందిన శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో లాడ్జి వద్దకు చేరుకున్న వైకాపా కార్యకర్తలు ఆ మార్గంలో అడ్డంగా పెద్దపెద్ద బండరాళ్లు వేశారు. అడ్డుకోబోయిన రామయ్యను పక్కకు నెట్టేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మౌనంగా ఉండిపోయారు.

22-4-2022

...

వైకాపా నాయకులు చేయిస్తున్న మట్టి అక్రమ తవ్వకాల్ని అడ్డుకున్నందుకు గుడివాడ అర్బన్‌ ఆర్‌ఐ జాస్తి అరవింద్‌పై మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు దాడికి పాల్పడ్డారు. జేసీబీతో ఆయన్ని పక్కకు విసిరేశారు. గొంతు నొక్కి ముఖంపై కొట్టి, చొక్కా చింపేశారు. మెడలోని బంగారు గొలుసు తెంచేశారు.

* పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో తెదేపా కార్యకర్త కాకాని ఏసురాజుపై ఈ నెల 8న కొందరు కంట్లో కారం చల్లి, ఇనుప రాడ్లతో దాడి చేశారు. వైకాపా నాయకుడు, ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, వాలంటీర్లు గోపాల్‌, నాగరాజులే హత్యాయత్నం చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది.

* చాగలమర్రి- రాయచోటి హైవే కాంట్రాక్టు పనుల్లో వాటా ఇవ్వకపోతే పనులు జరగనివ్వనంటూ చక్రాయపేట మండలం వైకాపా ఇన్‌ఛార్జ్జి, సీఎం బంధువు వై.ఎస్‌.కొండారెడ్డి గుత్తేదారు ప్రతినిధుల్ని బెదిరించారు. పోలీసులు అతణ్ని అరెస్టు చేసి, జిల్లా బహిష్కరణకు సిఫార్సు చేశారు.

వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నాలు

* తెదేపా అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా గ్రామంలో వేడుకలు నిర్వహించడంపై ఆగ్రహించిన వైకాపా నాయకులు తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడంతో అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధించారంటూ పులివెందుల నియోజకవర్గం చెరువుకాంపల్లెకు చెందిన రామాంజనేయులు, కృష్ణవేణి దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.

* వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోదరుడు కొండారెడ్డి పొలానికి దారి ఇవ్వడానికి.. తమ పొట్టకొట్టొద్దంటూ అనంతపురం జిల్లా మురిడి గ్రామ రైతులు ఈ నెల 4న సామూహిక అత్మహత్యకు యత్నించారు.

* వైకాపా నాయకులతో కుమ్మక్కై పోలీసులు తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎర్రగుడికి చెందిన తలారి లక్ష్మీనారాయణ, రాములమ్మ దంపతులు ఈ నెల 5న పురుగులమందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించారు.

పోలీస్‌స్టేషన్లలో వారు చెప్పిందే చట్టం : రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్లలో వైకాపా నాయకులు చెప్పిందే చట్టమన్నట్లుగా పరిస్థితి ఉంది. కొన్ని స్టేషన్లలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, వారి ప్రధాన అనుచరుల మాటే చెల్లుబాటవుతోంది. వారి ఆగడాలపై బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేయలేని దుస్థితి నెలకొంది. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వారిపైనే తప్పుడు కేసులు పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మరీ తప్పనిసరై వైకాపా నాయకులపై కేసు నమోదు చేయాల్సి వస్తే నామమాత్రపు సెక్షన్లతో సరి పెట్టేస్తున్నారు. తదుపరి చర్యల ఊసేఉండట్లేదు. ప్రశ్నిస్తున్నవారిని, గిట్టని వారిని, అడ్డుగా ఉన్నవారిని వేధించేందుకు, కక్ష సాధించేందుకు పలువురు నాయకులు పోలీసుల్ని పావులుగా వినియోగించుకుంటున్నారు. తప్పుడు కేసులు పెట్టించి, విచారణ పేరిట పదేపదే పోలీస్‌ స్టేషన్లకు పిలిచేలా ఒత్తిడి చేస్తున్నారు. పోలీసులతో కొట్టిస్తున్నారు. దీన్ని అవమానంగా భావించి పలువురు బాధితులు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలున్నాయి. పైరవీలు, సిఫార్సులతో పోస్టింగŸులు దక్కించుకుంటున్న కొందరు పోలీసు అధికారులు ఈ ఘటనల్లో నేతలకు కొమ్ముకాస్తున్నారు.

ఇదీ చదవండి: విజయ్​తో లిప్‌లాక్!.. నిన్ను తలచుకుంటే నా పెదవులపై చిరునవ్వు: సమంత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.