ETV Bharat / city

దగ్గు, జలుబులా కరోనా మనతోనే ఉండిపోతుంది: డాక్టర్ అమేశ్​

author img

By

Published : Apr 22, 2021, 3:53 PM IST

దేశ జనాభాలో ఎనభై శాతంమందికి టీకా ఇస్తేనే ఇమ్యూనిటీ వృద్ధి చెంది కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని అమెరికాలో అంటురోగాలకు సంబంధించిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ అమేశ్‌ ఏ అడల్జా అంటున్నారు. భారత్‌లో కనిపిస్తున్న ‘డబుల్‌ మ్యుటేషన్‌ వేరియంట్‌’పై భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌లలో డబుల్‌, అంతకంటే ఎక్కువ మ్యుటేషన్లే కనిపించాయని తెలిపారు. కరోనా లేని ప్రపంచాన్ని చూడలేమని, ప్రమాదకర స్థాయి నుంచి దగ్గు, జలుబులా మారిపోయి మనతోనే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాకు టీకా ఒక్కటే ఆయుధమని స్పష్టం చేశారు.

american doctor amesh
ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ అమేశ్‌ ఏ అడల్జా

భారత్‌లో కరోనా ‘డబుల్‌ మ్యుటేషన్‌ వేరియంట్‌’ రూపంలోకి మారిందంటున్నారు. ఇది ఎంత ప్రమాదకరంగా మారవచ్చు?

జ. దీనిని డబుల్‌ మ్యూటెంట్‌ పేరుతో పిలుస్తున్నారు కాని అన్ని వేరియంట్లలోనూ డబుల్‌, మల్టిపుల్‌ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ స్ట్రెయిన్‌లలోనూ అవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ డబుల్‌ మ్యుటెంట్‌ గురించి ఆందోళన అవసరంలేదు.


అంతక్రితం టీకా తయారీకి ఎన్నో ఏళ్లు పట్టేది. కరోనాకు మాత్రం ఏడాదిలోపే అందుబాటులోకి ఎలా వచ్చింది?

జ. మీరు చెప్పింది నిజమే. అప్పట్లో అంత సమయం పట్టేది. అయితే సాంకేతికత పెరగడం, ఇది అత్యవసర పరిస్థితి కావడంతో వేగంగా, సమర్థతతో తయారు చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్ల దీర్ఘకాల భద్రత, సామర్థ్యంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఫైజర్‌, మెడర్నా వంటివి ఎమ్‌ఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను, మిగతా కంపెనీలు సరికొత్త సాంకేతికతలను వినియోగించి విజయం సాధించాయి. ఈ సాంకేతికత భవిష్యత్‌లో వచ్చే మహమ్మారులను ఎదుర్కోవడానికి సైతం మనకు ఉపయోగపడుతుంది.


మొత్తం జనాభాలో ఎంత మందికి టీకా ఇస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీని మనం సాధించగలం?

జ. కరోనా ఎన్ని రూపాలు (మ్యుటేషన్స్‌) మార్చినా టీకా వల్ల వ్యాధి తీవ్రంగా రాకుండా ఉంటుంది. ఆసుపత్రిపాలు కాకుండా చేస్తుంది. మరణాలను నిలువరించగలుగుతుంది. ఇక హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించాలంటే.. జనాభాలో కనీసం 80 శాతం మందికి టీకా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌ వంటి దేశాలు అలాగే సాధించాయి.


టీకాల సమర్థతను ఎలా విశ్వసించొచ్చు. 91 శాతం సమర్థత గల టీకాను ఎలా అర్థం చేసుకోవాలి?

జ. మూడోదశ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుని, మెడికల్‌ జర్నల్స్‌లో సమీక్షలు ప్రచురితమైన వాటిని విశ్వసించవచ్చు. అలాంటి వాటికే ప్రభుత్వాలు అత్యవసర అనుమతులు ఇస్తున్నాయి. ఇక 91 శాతం సమర్థత అంటే.. టీకా తీసుకోనివారితో పోలిస్తే కరోనా సోకడానికి 91 శాతం తక్కువ అవకాశాలు ఉండడమన్నమాట.


ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి?

జ. ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రకియను వేగవంతం చేయాలి. ప్రజలకు దీనిని చేర్చడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. టీకాలు పొందడానికి అడ్డుగా ఉన్న ప్రతిబంధకాలన్నిటినీ తొలగించాలి. ప్రైవేటు రంగాన్నీ టీకాల పంపిణీలోకి దింపాలి. వైరస్‌ వేగంగా విజృంభిస్తూ లక్షలమంది ప్రాణాలను బలిగొంటున్న వేళ టీకాలు మాత్రమే పరిష్కారం చూపగలవు.


కరోనా లేని ప్రపంచాన్ని మనం ఎప్పుడు చూడవచ్చు?

జ. ఇప్పుడు మనం టీకాలను తయారుచేసుకున్నాం కనుక ఇది ఒక ముగింపునకు ప్రారంభంగా చెప్పవచ్చు. టీకాలనైతే తయారుచేసుకున్నాం. అయితే అందరికీ పంపిణీ జరగాలి. ఇందుకు సమయం పట్టవచ్చు. ఈలోగా ఆసుపత్రుల పాలయ్యే రోగుల, మరణాల సంఖ్య తగ్గేలా చూసుకోవాలి. కరోనా లేని ప్రపంచం అయితే అసాధ్యం. ఎందుకంటే అది ఒక జలుబు, దగ్గులాగా మారి మనతోనే ఉండిపోతుంది. ఇప్పటిలాగా తీవ్రరూపంలో ఉండకపోవచ్చు కానీ మనం సహజీవనం చేయకతప్పదు.


కరోనాపై పోరులో ఏ దేశం అత్యుత్తమంగా స్పందించింది? అగ్రరాజ్యం అమెరికా ఎందుకు స్పందించలేకపోయింది?

జ. తొలి నుంచీ తైవాన్‌ చాలా వేగంగా స్పందించింది. అన్ని చర్యలనూ చేపట్టగలిగింది. హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించడంలో ఇజ్రాయెల్‌, భూటాన్‌, తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్‌ విజయం సాధించాయి. అమెరికాలో దశాబ్దాల కాలం నుంచీ ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక వసతులు కొరతగానే ఉన్నాయి. వాటిని సరిగా పట్టించుకోలేదు. సరైన వనరులను ఏర్పాటు చేయడంలో వెనకబడింది. ఆసుపత్రుల విస్తరణలోనూ ఇక్కడి రాష్ట్రాల చట్టాలు కఠినంగా ఉంటాయి. కనీసం ఇటువంటి మహమ్మారి సమయంలోనైనా వాటిని సడలించాల్సిన అవసరం ఉంది.

వైద్య రంగంలో దిట్ట...

జాన్స్‌ హాప్కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సెక్యూరిటీలో సీనియర్‌ స్కాలర్‌ అయిన డాక్టర్‌ అడల్జా కరోనా సమయంలో నేషనల్‌ కాలేజియేట్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ కరోనా వైరస్‌ సలహా బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటిదాకా అమెరికాలోని ప్రభుత్వ ప్యానెళ్లలో తీవ్ర అంటురోగాల చికిత్సకు మార్గదర్శకాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా అంటురోగాల సమాజ (ఇన్‌ఫెక్టియస్‌ డిసీజెస్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా) అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. అత్యవసర డాక్టర్లకు చెందిన పలు కళాశాలల్లో సభ్యుడిగానూ సేవలందిస్తున్నారు.

ఇదీ చూడండి:

నోటి శుభ్రతతో కరోనా తీవ్రతకు కళ్లెం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.