ETV Bharat / city

పల్లెలు, పట్టణాల మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర

author img

By

Published : Aug 17, 2022, 8:20 AM IST

అమరావతి రైతుల పాదయాత్ర
అమరావతి రైతుల పాదయాత్ర

రాజధాని రైతులు సెప్టెంబరు 12 నుంచి చేపడుతున్న మహా పాదయాత్ర మార్గం దాదాపు ఖరారైంది. హైకోర్టు తీర్పునకు కట్టుబడి రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, కోర్టు ఆదేశాల ప్రకారం రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలన్న డిమాండ్‌తో రైతులు పాదయాత్రకు పిలుపునిచ్చారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు 60 రోజులకుపైగా కొనసాగనున్న పాదయాత్రను హైవే మీద కాకుండా వీలైనన్ని ఎక్కువ పల్లెలు, పట్టణాల మీదుగా వెళ్లేలా నిర్వాహకులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.

హైకోర్టు తీర్పునకు కట్టుబడి రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, కోర్టు ఆదేశాల ప్రకారం రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలన్న డిమాండ్‌తో రాజధాని రైతులు సెప్టెంబరు 12 నుంచి చేపడుతున్న మహా పాదయాత్ర మార్గం దాదాపు ఖరారైంది. అమరావతి నుంచి అరసవల్లి వరకు 60 రోజులకుపైగా కొనసాగనున్న పాదయాత్రను హైవే మీద కాకుండా వీలైనన్ని ఎక్కువ పల్లెలు, పట్టణాల మీదుగా వెళ్లేలా నిర్వాహకులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా యాత్ర కొనసాగనుంది. అమరావతి రైతులు గత ఏడాది చేపట్టిన పాదయాత్ర అక్టోబరు 17న తుళ్లూరులో మొదలై డిసెంబరు 17న తిరుపతిలో ముగిసింది.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా జరిగిన ఆ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించడంతో, అదే స్ఫూర్తితో రెండో పాదయాత్రకు రైతు ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి సన్నాహాలు చేస్తోంది. వెంకటపాలెం సమీపంలో తితిదే నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. దానికి ముందు రోజు మందడంలోని దీక్షా శిబిరంలో హోమం నిర్వహిస్తారు. పాదయాత్ర కృష్ణాయపాలెం, యర్రబాలెం, పెదవడ్లపూడి, తెనాలి, వేమూరు, భట్టిప్రోలు మీదుగా వెళ్లి కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుంది. మోపిదేవి, చల్లపల్లి, మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా కొనసాగి ఏలూరు జిల్లాలో ప్రవేశిస్తుంది.

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని దెందులూరు, ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, పాలకొల్లు మీదుగా కొవ్వూరు చేరుతుంది. అక్కడి నుంచి గోదావరి దాటి.. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోని రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, ప్రత్తిపాడు, అన్నవరం, తుని మీదుగా అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని పలు ప్రాంతాల మీదుగా విజయనగరం జిల్లాలో ప్రవేశిస్తుంది. అటు నుంచి శ్రీకాకుళం జిల్లాలో పలు గ్రామాలు, పట్టణాల మీదుగా అరసవల్లి చేరుకుంటుంది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.