ETV Bharat / city

'అమరావతి ప్రాంతాన్ని ముంచేందుకు ప్రభుత్వం కుట్ర'

author img

By

Published : Jun 10, 2021, 10:05 PM IST

amaravathi farmers protest
అమరావతి ప్రాంతాన్ని ముంచేందుకు ప్రభుత్వం కుట్ర

కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు, డంపింగ్ వ్యవహారం వివాదంగా మారుతోంది. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలోని తాళ్లాయపాలెం వద్ద కరకట్ట వెంట ఇసుక తవ్వకాలను రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రైవేటు సంస్థ చేపట్టిన తవ్వకాలతో కరకట్టకు ప్రమాదం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి ప్రాంతాన్ని ముంచేందుకే ప్రభుత్వం కుట్ర పన్నిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన రైతులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.

రాజధాని అమరావతి పరిధిలో మరో వివాదం చెలరేగింది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం పుష్కర ఘాట్‌ సమీపంలో కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఇసుక తవ్వకాలు, అమ్మకాల కాంట్రాక్ట్ దక్కించుకున్న జైపీ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆధునిక యంత్రాలతో నదిలో డ్రెడ్జింగ్ ప్రారంభించింది. నదిలో నుంచి తోడిన ఇసుకను డంప్ చేయటానికి కరకట్ట వెంట ఉన్న భూములను ఉపయోగించుకోవాలని భావించారు. అందుకోసం భూముల్లో పెద్ద పెద్ద గుంతలు తవ్వారు.

సీఆర్డీఏ అనుమతులు లేకుండానే..

కరకట్టకు అవతలి వైపు నదిలో ఇసుక తోడేస్తూ..ఇవతలి వైపు డంపింగ్ కోసం గుంతలు తవ్వటంపై రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలతో కరకట్ట దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. అసలు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూముల్లో ఇసుక డంపింగ్ చేయటం ఏమిటని అన్నదాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా డంపింగ్ చేయటాన్ని రైతులు తప్పుబడుతున్నారు. గత రెండు రోజులుగా అక్కడ తవ్వకాలు, డంపింగ్ కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. విపక్ష నేతలు రైతులకు మద్దతు ప్రకటించారు.

'రాజధానికి భూములిస్తే..ఇసుక తవ్వకాలా ?'

కృష్ణానది వెంట 1960వ దశకంలో కరకట్ట నిర్మించారు. అప్పట్లో వరదల కారణంగా నదీతీర ప్రాంతాల్లోకి నీరు వచ్చేది. ముంపు నుంచి కాపాడుకునేందుకు రైతులు పోరాడి కరకట్టను సాధించుకున్నారు. ఆ తర్వాత ఎంతటి వరదలు వచ్చినా తీర ప్రాంత గ్రామాలకు, పొలాలకు ఇబ్బంది లేదు. ఇప్పుడు నదిలో ఇసుక తవ్వకాలతో పక్కనే ఉన్న కరకట్టకు ప్రమాదం పొంచి ఉందని రైతులు తెలిపారు. అలాగే రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూముల్లో ఇసుక నిల్వకు ఏర్పాట్లు చేయటంపై మండిపడుతున్నారు. సీఆర్‌డీఏ అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థ ఇసుక నిల్వ చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. కరకట్టకు ఆనుకుని ఉన్న భూముల్లో గోతులు తవ్వి ఇసుక డంపింగ్‌ చేస్తున్నారని, ఫలితంగా ఆ గుంతల్లో నీరు చేరితే కరకట్ట బలహీనపడే ప్రమాదం ఉందంటున్నారు. తాము రాజధాని నిర్మాణానికి మాత్రమే భూములిచ్చామని, ఇసుక నిల్వకు కాదని స్పష్టం చేస్తున్నారు. రైతులు సీఆర్‌డీఏ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. డంపింగ్‌ చేసేందుకు ప్రైవేటు సంస్థకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని వారి నుంచి సమాధానం వచ్చింది. దీంతో రైతులు కోర్టులో కేసు వేయాలని భావిస్తున్నారు.

పోలీసుల పహారా..

పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పనులు అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇసుక తవ్వకాలపై గనుల శాఖ గానీ, సీఆర్‌డీఏ నుంచి గానీ వ్యతిరేక నివేదిక లేదా ఫిర్యాదు వస్తే ప్రైవేటు సంస్థపై కేసు నమోదు చేస్తామన్నారు.

ఇదీచదవండి: 'ఇసుక డంపింగ్​తో కరకట్ట మనుగడ ప్రశ్నార్ధకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.