ETV Bharat / city

నమ్మి భూములిస్తే... నట్టేట ముంచుతారా?

author img

By

Published : Dec 16, 2020, 7:16 AM IST

అందరం కలుద్దాం... అద్భుతం చేద్దామన్నారు... అంతర్జాతీయ స్థాయి రాజధాని కడదామన్నారు.. ఆంధ్రప్రదేశ్‌కు దిల్లీని మించిన రాజధానిని కడదామని మోదీ స్పష్టంగా చెప్పారు... అప్పటి అధికార పక్షం రాజధాని... అమరావతి అంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్‌ దానికి జై అన్నారు. అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు తెలిపారు. అపూర్వ రాజధాని నిర్మాణానికి మీ భూములు కావాలని ప్రభుత్వం అడిగితే.. ఆ గ్రామాల రైతులు ఆలోచనలో పడ్డారు. ఇంటిల్లిపాదికీ ఇన్నాళ్లూ అన్నం పెట్టిన భూముల్ని ఇచ్చేయడానికి మనస్కరించలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వబోమన్నారు. అంతా కలిసి వారికి నచ్చజెప్పారు... రకరకాలుగా భరోసా ఇచ్చారు. మీకేం భయం లేదంటూ చట్టాన్ని చూపారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ రావని అందరూ చెప్పేసరికి అన్నదాతలు సరే అన్నారు. రాష్ట్రం కోసం... రాజధాని కోసం తమ భూముల్ని ఇచ్చారు. ప్రభుత్వం మారింది... ‘మూడు రాజధానులు’ అంటూ మాట మార్చింది. ఇది అమరావతి కోసం భూములిచ్చిన అన్నదాతల పాలిట పిడుగుపాటులా మారింది. ప్రభుత్వం చేతిలో తాము మోసపోయామంటూ... అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... ఏడాదిగా వారు ఉద్యమిస్తున్నారు. ఎన్నో నిర్బంధాలు, అడుగడుగునా సంకెళ్లు, పోలీసుల లాఠీలు... అన్నింటినీ ఎదుర్కొంటూనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. నమ్మి భూములిస్తే నట్టేట ముంచుతారా?... అని ఆవేదనతో అడుగుతున్నారు... పోరుబాటలో అలుపెరగక సాగుతున్నారు...  ప్రత్యేక కథనం

amaravathi eenadu
amaravathi eenadu

మా త్యాగానికి విలువేదీ?


మీ ప్రాంతంలో రాజధాని కడతాం, భూములివ్వండి అని ప్రభుత్వం అడిగిన వెంటనే రైతులు ఎగిరి గంతేయలేదు. గొప్ప అవకాశం వచ్చిందని ఎదురెళ్లి భూములివ్వలేదు. నేల తల్లితో అనుబంధం పెనవేసుకున్న అందరు రైతుల్లానే వారూ ఆలోచించారు. తమ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనని దిగులు పడ్డారు. తమ గ్రామాలకు వచ్చిన అధికారుల్ని.. ‘మా భూములు మీకెందుకివ్వాలి’ అని నిలదీశారు. ఊరూరా సమావేశాలు పెట్టుకున్నారు... సమాలోచనలు చేశారు. భూములిచ్చేందుకు ససేమిరా అన్నారు. వారికి ప్రభుత్వం నచ్చజెప్పింది. రాష్ట్రానికి, భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే రాజధాని నిర్మాణమని వివరించింది. మీరూ, మేమూ కలసి అంతర్జాతీయ స్థాయి, ప్రజారాజధానిని నిర్మిద్దామని ఒప్పించింది. భూసమీకరణ విధానాన్ని ప్రకటించింది. మీ పిల్లలకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని హామీ ఇచ్చింది. ప్రభుత్వానికి, భూములిచ్చే రైతులకూ అది ఉభయతారకమని నచ్చజెప్పింది. మంత్రులు ఊరూరూ తిరిగి.. రాజధాని వస్తే అక్కడి ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలేమిటో వివరించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి డిమాండ్లను ఆమోదించారు. ప్యాకేజీ ప్రకటించారు. ఇంత జరిగాకే రైతులు భూములివ్వడానికి అంగీకరించారు.

అధికారపక్షమూ... ప్రతిపక్షాలూ...

రాజధాని అమరావతి విషయంలో ఒక్కమాటపై నిలిచాయి... తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో రాజధాని నిర్మాణంపై శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రతిపక్షనేతగా జగన్‌ మద్దతు పలికారు. ఇంత జరిగాక... రాజధానికి అన్ని పక్షాల ఆమోదం ఉందని, భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బందీ కలగదన్న ధీమా రైతులకు కలిగింది. 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించే రాజధాని నగర బృహత్‌ ప్రణాళికను సింగపూర్‌కు చెందిన సుర్బానా-జురాంగ్‌ సంస్థలు రూపొందించాయి. దాన్ని సీఆర్‌డీఏ.. రాజధానిలోని ఊరూరా ప్రదర్శించింది. రాజధానిని నవ నగరాలుగా నిర్మిస్తామని చెప్పింది. గ్రామసభలు నిర్వహించి ప్రజల అభ్యంతరాలు స్వీకరించింది. ఆ మేరకు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసింది. తమకు చూపించిన, గ్రామసభలు ఆమోదించిన బృహత్‌ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వం రాజధాని కడుతుందని నమ్మి రైతులు భూములిచ్చారు.

ప్రధాని మాటతో..

రాజధాని నగరానికి సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పరిపాలన నగర నిర్మాణానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని ఆయనా హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులు, ప్రజల్లో ఇది మరింత భరోసా పెంచింది.

ఎకరంలోపు రైతులే 20,490 మంది

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన వారిలో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువ. సీఆర్‌డీఏ ఆ భూములు తీసుకుని వారికి ప్లాట్లు కేటాయించింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన స్థాయిలో రాజధాని నిర్మిస్తేనే ఆ ప్లాట్లకు గిరాకీ ఉంటుంది. మూడు రాజధానుల పేరుతో కేవలం అసెంబ్లీ భవనాన్నే ఇక్కడ ఉంచి మిగతావన్నీ తరలిస్తే, ఆ రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. సాగుకు భూమీ లేక, సీఆర్‌డీఏ తమకు కేటాయించిన ప్లాట్‌ను కొనేవారూ లేక ఏం చేయాలన్న ఆందోళనే కొన్ని రోజులుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఒక్కటి మూడై... రైతన్న మోడై!

అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప రాజధాని నగరాన్ని నిర్మిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు లేదు. కొత్త ప్రభుత్వం మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది. శాసనసభ భవనాన్ని మాత్రం అమరావతిలో ఉంచి, మిగతావన్నీ తరలిస్తే తమ పరిస్థితేమిటని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని పోరాటం చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ విధానంలో.. భూములిచ్చిన రైతులకు, సీఆర్‌డీఏకి మధ్య కీలక ఒప్పందం జరిగిందనీ, సీఆర్‌డీఏతో తాము చేసుకున్నది భాగస్వామ్య ఒప్పందమని గుర్తు చేస్తున్నారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం భూములు తీసుకుని, ఇప్పుడు తమకిచ్చిన హామీల్ని ఎలా ఉల్లంఘిస్తారన్నది రైతుల ప్రశ్న. ఇప్పుడు తమ సమ్మతి లేకుండానే సీఆర్‌డీఏను ఏకపక్షంగా ఎలా రద్దు చేస్తారని అడుగుతున్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నగర నిర్మాణం పూర్తి చేయాలని ఏడాదిగా ఉద్యమిస్తున్నారు. తమ హక్కుల్ని కాపాడాలని న్యాయపోరాటమూ చేస్తున్నారు.

ప్రజా రాజధానిగా అమరావతి ఆవిర్భావం

2015 అక్టోబరులో శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ

దేశంలో పట్టణీకరణ దిశగా వేసిన కొత్త అడుగుకి ఆంధ్రప్రదేశ్‌, అమరావతి మార్గదర్శిగా నిలుస్తాయని ఆశిస్తున్నా. ఈ విజయదశమి పర్వదినాన ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయంలోకి ప్రవేశిస్తోంది. అమరావతి కొన్ని శతాబ్దాల చరిత్ర, వారసత్వం, ఘనమైన సంస్కృతితో తులతూగుతోంది. ఆంధ్ర ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రస్థానంగా అమరావతి మారబోతోంది. అమరావతి ప్రజారాజధానిగా ఆవిర్భవించనుంది. ఈ శుభతరుణంలో రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రాజధాని నిర్మాణ ప్రక్రియను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ప్రపంచంలోని శ్రేష్టమైన, ఉత్తమ విధానాల్ని, నమూనాల్ని మేళవించి ఈ నగర నిర్మాణం చేపట్టినందుకు హృదయపూర్వక అభినందనలు. నేను పార్లమెంటు ఆవరణ నుంచి మట్టి, యమునా నదీ జలాలు తెచ్చాను. మన దేశంలో నది ఒక సంస్కృతి. దిల్లీ నుంచి మట్టి, నీళ్లు తేవడం ద్వారా... మొత్తం దేశరాజధానే అమరావతికి తరలి వచ్చిందన్న సందేశం ఇవ్వడం నా ఉద్దేశం. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ సాగించే ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని మీకు హామీ ఇస్తున్నా. విభజన చట్టంలో చెప్పినవన్నీ తు.చ. తప్పక అమలు చేస్తామని ఈ సాంస్కృతిక నగరం అమరావతి వేదికగా ప్రకటిస్తున్నా.

అంతా భరోసా ఇచ్చారు

రాజధాని నిర్మాణానికి భూములిచ్చేలా రైతుల్ని ఒప్పించే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఇచ్చిన హామీలివీ..

అసెంబ్లీ సాక్షిగా.. అందరిదీ అదే మాట.. విజయవాడ-గుంటూరు మధ్య కృష్ణాతీరంలో రాజధాని నగరాన్ని నిర్మిస్తామని శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రతిపక్షాలూ అంగీకరించడంతో సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో ఎవరేమన్నారంటే..

ప్రపంచంలోకెల్లా అద్భుత రాజధాని

ధికారం ఉంది కదా అని నా ఊరిలో రాజధాని పెట్టుకుంటానంటే అన్యాయమే అవుతుంది. తుళ్లూరు ప్రాంతం రాజధానికి అనువుగా ఉంటుందనే అక్కడ భూములు సమీకరించాలని నిర్ణయించాం. దిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని తిరుపతి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్‌ సింగపూర్‌ రూపొందిస్తోంది. త్వరలోనే ఈ ప్రాంతం మరో సింగపూర్‌లా మారుతుంది. సచివాలయం, శాసనసభ, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలే కాకుండా, ఉద్యోగాలు లభించేలా రాజధాని ఉంటుంది. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అందుకే భూసమీకరణకు వెళుతున్నాం. భూములిచ్చిన రాజధాని రైతుల త్యాగాన్ని మరచిపోం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. రాజధానిలో తొలి లబ్ధిదారు అక్కడి రైతు, స్థానికుడే కావాలి. ప్రపంచస్థాయి రాజధానితోనే రైతుల భూములకు విలువ పెరుగుతుంది. ఇక్కడ రెండెకరాల పొలం ఉన్న వ్యక్తి... రాజధాని నిర్మాణం తర్వాత తనకు వచ్చిన స్థలంలో భవన సముదాయం కట్టుకుని దర్జాగా బతకొచ్చు. - చంద్రబాబు (భూ సమీకరణకు రైతుల్ని ఒప్పించేందుకు, తర్వాత వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు)

రాష్ట్రానికి మధ్యలో రాజధాని

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమాన దూరంలో, విజయవాడ పరిసర ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని 2014 సెప్టెంబరు 1న మంత్రివర్గం సమావేశమై తీర్మానించింది. రాజధాని నిర్మాణం భూసమీకరణ విధానంలో చేపడతాం. దీంతో రైతుల భూములకు విలువ పెరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడు అన్నట్లు ఈ విధానంలో జమీందార్లు ఎలా వస్తారు? ఎస్‌ఈజడ్‌లు ఇస్తేనే అలా వస్తారు. ప్రతిపక్ష నేత 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలంటున్నారు. అడవుల్లో పెడితే లక్ష ఎకరాలైనా దొరుకుతుంది. కానీ సాంఘిక జీవనం లభిస్తుందా? రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నా ఒక ప్రణాళిక ఉండాలి. ఉద్యోగాలు రావాలి. సాంఘిక జీవనం ఉండాలి.
* రాజధానికి సంబంధించి శివరామకృష్ణన్‌ కమిటీకి 4,728 మంది అభిప్రాయాలు చెప్పారు. వారిలో 2,191 మంది (46 శాతం) రాజధానిని విజయవాడ- గుంటూరు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించారు. విశాఖకు 10.7%, కర్నూలుకు 7.6%, ఒంగోలుకు 5.6%, రాజమహేంద్రవరానికి 2.9%, తిరుపతికి 2.4%, దొనకొండకు 2.5%, ఇతర ప్రాంతాలకు 2.2% మొగ్గు చూపారు. కేంద్ర సూచనల మేరకు రాజధాని ఎంపికకు తక్కువ ప్రమాదస్థాయి, రహదారి అనుసంధానత, నీటి లభ్యత, అందుబాటులో భూమి, భూమిఅభివృద్ధి అనే అంశాల్ని పరిశీలించాం.- చంద్రబాబు (ముఖ్యమంత్రి హోదాలో)

మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాం

విజయవాడలో రాజధాని పెట్టడాన్ని మేం మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రమైంది. ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేకనే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెబుతున్నా. రాజధాని ఎక్కడైనా పెట్టండి, కానీ కనీసం 30 వేల ఎకరాలైనా ఉన్నచోట పెట్టండి అని మొదటి నుంచీ మొత్తుకుంటున్నాం. రాజధాని నగరంలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే.. దాని ధర ఇంత అని ప్రభుత్వమే నిర్ణయించే అవకాశం ఉంటుంది. చదువుకున్న పిల్లలు, సామాన్యుడు ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లినప్పుడు.. నెలవారీ వాయిదాల (ఈఎంఐ) పద్ధతిలో ఒక ఫ్లాట్‌ కొనుక్కునేందుకు భూముల ధర అందుబాటులో ఉండాలనే చెబుతున్నాం. అద్దెకు తీసుకోవాలన్నా అందుబాటులో ఉండాలి.

భూసమీకరణలో వెళుతున్నామంటే నిజంగా బాధ అనిపిస్తోంది. ఆ పద్ధతిలో మనంతట మనమే స్థిరాస్తి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాం. అధ్యక్షా! ఎలాగూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాకపోయినప్పటికీ రాష్ట్రం ఒకటిగా ఉండాలి, భావోద్వేగాలకు తావివ్వకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో.. మాకు ఆయన చేసిన పద్ధతి నచ్చకపోయినా చర్చలో పాల్గొంటున్నాం. నిర్మాణాత్మక సూచనలు ఇస్తున్నాం.- వైఎస్‌ జగన్‌ (అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత)

రాజధాని ఎక్కడైనా ఆమోదయోగ్యమే

మా పార్టీ తరఫున ఈ ప్రదేశం రాజధానిగా కావాలని గానీ, వద్దని గానీ చెప్పటం లేదు. రాజధాని ఎక్కడైనా పెట్టండి, మాకు ఆమోదయోగ్యమే. కాకపోతే ప్రజలందరికీ భాగస్వామ్యం ఉండాలనేదే వైకాపా కోరిక. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలి. - బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (ప్రస్తుత ఆర్థికమంత్రి)

అభినందనలు..

న్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తానని మొదట్నుంచీ చెబుతున్న మాటలకు కట్టుబడి సీఎం రాజధాని ప్రకటన చేశారు. భాజపా తరఫున అభినందనలు. - ఆకుల సత్యనారాయణ, అప్పటి భాజపా శాసనసభాపక్ష నేత

రాజధాని రైతుల గోడు ఇదీ..

  • ఏకపక్ష రద్దు కుదరదు

సీఆర్‌డీఏ తరఫున డిప్యూటీ కలెక్టర్‌ హోదా కలిగిన అధికారి మాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారమే అభివృద్ధి చేయాలని అడుగుతున్నాం. 9.14 ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకుంటామంటే కుదరదు. ఇద్దరి అంగీకారంతోనే అది రద్దుకావాలి. ఆ ఒప్పందమే మా బలం. దాని ఆధారంగానే హైకోర్టులో పోరాడుతున్నాం.- కె. రాజేంద్రప్రసాద్‌, మందడం

  • జగన్‌ ఆమోదం తెలిపాకే...

రాజధానికి భూములివ్వడానికి నాలాగే చాలామందికి సందేహాలుండేవి. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అప్పటి ప్రతిపక్షనేత జగన్‌ అమరావతికి ఆమోదం తెలిపిన తర్వాతే చాలామంది భూములిచ్చాం. జీవనాధారమైన భూమంతా ప్రభుత్వానికి ఇచ్చేశాం. ఇప్పుడు మా భవిష్యత్తేంటో అర్థం కావట్లేదు. కూలి పనులకు వెళదామన్నా అసలు ఇక్కడ వ్యవసాయమేది?- లక్ష్మీనారాయణ, మందడం

  • భవిష్యత్తులో భూములిస్తారా?

తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్ని ప్రభుత్వాన్ని నమ్మి ఎలా ఇవ్వాలి? ప్రభుత్వం మారితే మాకేమిటి రక్షణ? అని అప్పట్లోనే ప్రశ్నించాం. అందుకే సీఆర్‌డీఏ చట్టం తీసుకొచ్చామని.. రైతులకు ఇబ్బంది ఉండదన్నారు. ఇప్పుడు రాజధానిని తరలిస్తామంటున్నారు. భూములిచ్చిన రైతుల్ని ప్రభుత్వమే మోసగిస్తే.. భవిష్యత్తులో ఇంకెక్కడైనా, ఏ అవసరానికైనా రైతులు భూములిస్తారా?- వై.నాగమల్లేశ్వరి, మహిళా రైతు

  • ప్రసవించాక బిడ్డను కడుపులో పెట్టగలమా?

రాజధాని నిర్మాణానికి మేమిచ్చిన భూముల్ని తిరిగిచ్చేస్తామని మంత్రులు ప్రకటనలిస్తున్నారు. తల్లి బిడ్డను ప్రసవించాక.. మళ్లీ ఆ బిడ్డను తల్లి కడుపులో పెడతామంటే సాధ్యమవుతుందా? రైతుల దగ్గర తీసుకున్న భూముల్లో ఇప్పటికే హైకోర్టు, సచివాలయం, ఇతర అనేక భవనాలు, రోడ్లు నిర్మించేశారు. ఇప్పుడు ఆ భూముల్ని రైతులకు ఎలా తిరిగిస్తారు? ఇస్తే అవి వ్యవసాయానికి ఉపయోగపడతాయా?- గోపి, రైతు, మందడం

  • ప్రభుత్వం మోసగించింది

అమరావతిలో మేమిచ్చిన భూముల్లో రాజధానిని అభివృద్ధి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని తీవ్రంగా మోసగించింది. రాజధానిలో నవ నగరాలు నిర్మిస్తామని చెప్పారు. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం అన్నింటినీ అభివృద్ధి చేయాలన్నదే మా డిమాండు.- వి. వీరాంజనేయులు, రైతు

  • ఆరేళ్లయినా అభివృద్ధి లేదు..

మా ప్రాంతంలో రాజధాని కావాలని మేం అడగలేదు. ప్రభుత్వాధికారులు అభివృద్ధిపై హామీ ఇచ్చిన తర్వాతే భూములిచ్చాం. రిటర్న్‌బుల్‌ ప్లాట్లను మూడేళ్లలో అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. ఆరేళ్లయినా అతీగతీ లేదు.- సీతారామయ్య, రాజధాని ప్రాంత రైతు

  • కౌలు కోసమూ యుద్ధమే

రాజధాని కోసం 25 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చాను. సీఆర్‌డీఏ మాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన కౌలు కోసం కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వం రిటర్న్‌బుల్‌ ప్లాట్లల్లో రాళ్లైనా పాతింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ రాళ్లు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి.- జె. నాగేశ్వరరావు, రైతు

  • ప్రభుత్వమా? ప్రైవేటు సంస్థా?

మాతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మేమిచ్చిన భూముల్లో రాజధాని అభివృద్ధి చేయకపోతే రూ.లక్ష కోట్లకు పైగా నష్టపరిహారం ఇస్తామని అప్పట్లో అధికారులు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రైవేటు సంస్థ మాదిరిగా తయారై సీఆర్‌డీఏని రద్దు చేస్తామంటోంది.- రాధిక, మహిళా రైతు, వెంకటపాలెం

  • ఆందోళన చేయాల్సి వస్తోంది
    దేశంలో ఎక్కడైనా, ఏ ప్రాజెక్టుకైనా సరే భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆందోళన చేస్తుంటారు. కానీ మేం రాజధానికి భూములిచ్చాక ప్రభుత్వం మాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తూట్లు పొడుస్తుంటే ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నాం. భూములిచ్చినప్పుడు ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే పునరాలోచించేందుకు 27 రోజుల గడువిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం రాత్రికి రాత్రే రాజధానిపై ఉత్తర్వులు తీసుకొచ్చి చెలగాటమాడుతోంది.- జి. భాను, రైతు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.