ETV Bharat / city

కేబినెట్​లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..

author img

By

Published : Apr 11, 2022, 3:53 PM IST

Updated : Apr 12, 2022, 4:17 AM IST

కేబినెట్​లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు
కేబినెట్​లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

15:51 April 11

ఏపీ కేబినెట్‌లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు

పాత, కొత్తల కలయికతో పునర్‌వ్యవస్థీకరించిన రాష్ట్ర మంత్రివర్గం.. సోమవారం కొలువుదీరింది. అమరావతిలోని సచివాలయం పక్కన ఖాళీస్థలంలో ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శాఖలు కేటాయించారు. సీనియర్లలో కొందరికి ముఖ్యమైన శాఖలు లభించగా.. కొందరికి యథావిధిగా అప్రాధాన్య విభాగాలే దక్కాయి. ఈసారి కూడా అయిదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఒక్కో వర్గానికి ఒక్కోటి చొప్పున పంపిణీ చేశారు. వీరిలో ఒకరిద్దరికి తప్ప ఉప ముఖ్యమంత్రి స్థాయి ప్రాధాన్యమున్న శాఖలు దక్కలేదు. ఒకరికి దక్కినా దానిపై నిజమైన అజమాయిషీ లభిస్తుందా అన్నది సందేహమే. ఎస్సీ వర్గానికి చెందిన మహిళకే మళ్లీ హోం శాఖ అప్పగించారు. తొలి మంత్రివర్గంలో ఈ శాఖ చూసిన మంత్రికి కలిగిన అనుభవం ఈమెకు ఎదురుకాకుండా ఉంటేనే దానికి సార్థకత చేకూరుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చాలాకాలం తరువాత మంత్రిగా అవకాశం లభించిన సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావుకు కీలకమైన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం దక్కింది. ఆయనకు గతంలో ఈ శాఖ నిర్వహించిన అనుభవం ఉంది. మొన్నటి వరకు ధర్మాన సోదరుడు కృష్ణదాసే ఈ శాఖ చూశారు. మంత్రివర్గంలో అనధికార నంబర్‌ 2గా చలామణి అయ్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్తు, అటవీ, గనుల శాఖలు దక్కాయి. గతంలో చూసిన పంచాయతీరాజ్‌శాఖను తప్పించి కొత్తగా విద్యుత్తు అప్పగించారు. అప్పులు, నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలు విద్యుత్తు కోతలతో ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్న నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలు పెద్దిరెడ్డికి ఇవ్వడం గమనార్హం. సీఆర్‌డీఏతో కూడిన మున్సిపల్‌ పరిపాలన చూసిన బొత్స సత్యనారాయణకు ఈసారి విద్యాశాఖ లభించడం ఎవరూ ఊహించని పరిణామం. గతంలో మహిళా, శిశు సంక్షేమం చూసిన తానేటి వనితకు హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి వరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సురేష్‌కు గతంలో బొత్స సత్యనారాయణ చూసిన మున్సిపల్‌ పరిపాలనశాఖ దక్కింది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, అంజాద్‌ బాషాలతోపాటు మంత్రులు సీదిరి అప్పలరాజు, చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జయరాంలకు పాతశాఖలే దక్కాయి. వీటిలో బుగ్గన దగ్గరున్న ఆర్థిక, వాణిజ్య పన్నులు కీలమైనవి. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తేనే నవరత్నాలు అమలు చేయగలిగే స్థితి ఒకవైపు... కీలకవనరైన వాణిజ్య పన్నుల నుంచి గరిష్ఠంగా ఆదాయాన్ని ఆర్జించాల్సిన పరిస్థితిలో ఆయనకే మరోసారి ఆ బాధ్యతలు అప్పగించారు.

వీరికి ప్రాధాన్యమున్న శాఖలే: కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారిలో అంబటి రాంబాబుకు జలవనరులు, విడదల రజనికి వైద్య, ఆరోగ్యం, అమర్‌నాథ్‌కు పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ, కాకాణి గోవర్థన్‌రెడ్డి వ్యవసాయం, సహకారం వంటి ముఖ్యమైన శాఖలు దక్కటం విశేషం. గోవర్థన్‌రెడ్డికి కోరుకున్న శాఖే దక్కిందంటున్నారు. ఉప ముఖ్యమంత్రుల్లో అంజాద్‌ బాషా, రాజన్న దొరలకు వారి వర్గాలకు చెందిన సంక్షేమశాఖలు మాత్రమే దక్కాయి. పేరుకు ఉప ముఖ్యమంత్రులైనప్పటికీ ఆయా శాఖలకున్న బడ్జెట్‌, పరిమితుల దృష్ట్యా పరిధి తక్కువేనన్న భావన వ్యక్తమవుతోంది. మొదటిసారి మంత్రివర్గంలో చోటిచ్చి, ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించిన బూడి ముత్యాలనాయుడుకు మాత్రం ప్రాధాన్యమున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ దక్కింది. మరో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి మొదటి మంత్రివర్గంలో ఎక్సైజ్‌తోపాటు వాణిజ్య పన్నులు కూడా ఉండేవి. కొద్ది నెలల తరువాత వాణిజ్య పన్నులు తొలగించి ఎక్సైజ్‌కు పరిమితం చేశారు. ఆ శాఖలోని కీలక వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర నామమాత్రమేనని, మరో సీనియర్‌ మంత్రి తనయుడే చూస్తారన్న విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి. ఈ విడతలోనైనా అలాంటి వాటికి తావివ్వని పరిస్థితి ఉంటుందేమో చూడాలి. జిల్లాలో సీనియర్‌ మంత్రితో విభేదాలున్నప్పటికీ మంత్రివర్గంలో చేరగలిగిన రోజాకి మాత్రం నిధులు, పెద్దగా విధులూ లేని శాఖ లభించిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.

మహిళల భద్రతపై దృష్టి పెడతా: రెండోసారి మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటానని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మహిళలు, చిన్న పిల్లల సంక్షేమ శాఖ నిర్వహించడం ద్వారా.. వారి సమస్యలపై అవగాహన ఉందని వివరించారు. హోంమంత్రిగా మహిళల ఇబ్బందులు, వారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడతానని విలేకరులకు వివరించారు.

మంత్రులకు కేటాయించిన శాఖలు:

మంత్రులు శాఖలు
ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
సీదిరి అప్పలరాజు పశుసంవర్ధక, మత్స్యశాఖ
దాడిశెట్టి రాజా రహదారులు, భవాలశాఖ
గుడివాడ అమర్నాథ్‌ పరిశ్రమలు, ఐటీ శాఖ
వేణుగోపాల్ బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాలు
తానేటి వనిత హోంశాఖ
జోగి రమేష్‌ గృహనిర్మాణ శాఖ
కారుమూరి నాగేశ్వరరావు పౌరసరఫరాలశాఖ
మేరుగ నాగార్జున సాంఘిక సంక్షేమశాఖ
విడదల రజని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
కొట్టు సత్యనారాయణ ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ
బొత్స సత్యనారాయణ విద్యాశాఖ
అంబటి రాంబాబు జలవనరుల శాఖ
ఆదిమూలపు సురేశ్‌ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనులు, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆర్‌.కె.రోజా పర్యాటక, యువజన, క్రీడల శాఖ
కె.నారాయణ స్వామి ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ
అంజాద్ బాషా ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమశాఖ
బుగ్గనఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళిక శాఖ
గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ
ఉషశ్రీ చరణ్ మహిళా శిశుసంక్షేమశాఖ
బూడి ముత్యాలనాయుడుపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
రాజన్నదొరఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ
పినిపే విశ్వరూప్ రవాణాశాఖ

ఇదీ చదవండి: Jagan New Cabinet: కొలువుదీరిన జగన్ కొత్త టీం

Last Updated : Apr 12, 2022, 4:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.