ETV Bharat / city

ఆ కాలేజీలకు షాక్‌.. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు బంద్​!

author img

By

Published : May 17, 2022, 9:42 AM IST

ఉపాధ్యాయ విద్య కళాశాలలకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి గట్టి షాక్​ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 6 వేల కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టకూడదని నిర్ణయించింది. ఇందులో కొన్ని ప్రభుత్వ కళాశాలలూ ఉండటం గమనార్హం.

ఆ కాలేజీలకు షాక్‌..
ఆ కాలేజీలకు షాక్‌..

బీఈడీ, డీఈడీతో పాటు వ్యాయామ విద్య కోర్సులను అందించే ఉపాధ్యాయ విద్య కళాశాలలకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) గట్టి షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 6 వేల కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం(2022-23)లో ప్రవేశాలు చేపట్టకూడదని నిర్ణయించింది. దేశంలో దాదాపు 17 వేల ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలో ఉపాధ్యాయ విద్యా కోర్సులను అందించే కళాశాలలున్నాయి. ఈ నిర్ణయం అమలైతే.. వాటిలో మూడో వంతు విద్యాసంస్థల్లో ప్రవేశాలు ఉండవు(‘జీరో ఇయర్‌’). అందులో కొన్ని ప్రభుత్వ కళాశాలలూ ఉండటం గమనార్హం.

గత కొన్నేళ్లుగా బీఈడీ, డీఈడీ కళాశాలల బలోపేతంపై దృష్టిపెట్టిన ఎన్‌సీటీఈ.. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి 2022 ఏప్రిల్‌ 2వ తేదీ నాటికి ప్రతి కళాశాల పనితీరు అంచనా నివేదిక (పెర్ఫార్మెన్స్‌ అప్రైజల్‌ రిపోర్ట్‌-పార్‌)ను అప్‌లోడ్‌ చేయాలంటూ తుది గడువును నిర్దేశించింది. ఈ గడువులోపు 10,993 కళాశాలలు మాత్రమే సమర్పించాయి. నివేదిక సమర్పించని వాటిపై ఎన్‌సీటీఈ చర్యలు తీసుకుంది.

తెలుగు రాష్ట్రాలపైనా ప్రభావం..

తెలంగాణలో ప్రస్తుతం 206 బీఈడీ, 109 డీఈడీ ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 271 మాత్రమే నివేదికలను సమర్పించాయి. అంటే మిగిలిన 44 కళాశాలల్లో జీరో ఇయర్‌ అయినట్లే. ఆంధ్రప్రదేశ్‌లో 521 బీఈడీ, డీఈడీ కళాశాలలున్నాయి. వాటిలో 403 కళాశాలలు మాత్రమే ‘పార్‌’ నివేదికను అప్‌లోడ్‌ చేయడంతో 118 కళాశాలల్లో వచ్చే కొత్త విద్యాసంవత్సరంలో ప్రవేశాలు జరపడానికి వీల్లేదు. కాకతీయ వర్సిటీలో బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులు, ఓయూలో ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు నిలిచిపోనున్నాయి.

‘పార్‌’ ఎందుకంటే..

బీఈడీ, డీఈడీ కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు లేరని, కనీస సౌకర్యాలు లేవని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ‘పార్‌’ నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. దీని ప్రకారం- కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, వారి విద్యార్హతలు, ఆధార్‌ నంబర్లు, పరిశోధన పత్రాల సమర్పణ, ప్రాంగణ నియామకాలు, ఫెలోషిప్‌లు, భవనాలు, తరగతి గదులు తదితర వివరాలను, ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి. చాలా కళాశాలలు ఇప్పటివరకు తమ వద్ద పని చేస్తున్నట్లు ఒకే అధ్యాపకుడిని చూపుతున్నాయి. ఆధార్‌ నంబర్ల అనుసంధానంతో ఇది సాధ్యపడదు. అందుకే పలు కళాశాలలు నివేదికలను సమర్పించలేదని తెలుస్తోంది.

ఇవీ చూడండి..

జైలులో అసహజ శృంగారం.. 20 ఏళ్ల యువకుడిపై టీనేజర్​..

'ఊ అంటావా'కు రూ.5కోట్లు.. 'రోబో' పాటకు రూ. 20కోట్లు.. 'చమ్మక్​ చల్లో' బడ్జెట్​ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.