ETV Bharat / city

పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాల్సి రావొచ్చు!

author img

By

Published : Jun 6, 2022, 4:49 AM IST

Updated : Jun 6, 2022, 6:23 AM IST

పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాల్సి రావచ్చని కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చే పనిని నేషనల్‌ హైడ్రోపవర్‌ కంపెనీకి అప్పజెప్పినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం తదితర అంశాలపై వెదిరె శ్రీరాం రెండు తెలుగు రాష్ట్రాల తరఫున కేంద్ర జల్‌శక్తి శాఖలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వరుసగా దిల్లీలో సమావేశాలు, కేంద్ర జల్‌శక్తి శాఖకు, రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు మధ్య అనుసంధానంగా ఉంటున్నారు. తాజాగా పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన ‘ఈనాడు’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.

A new dia from wall may need to be fitted in the polavaram
పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాల్సి రావొచ్చు!

పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాల్సి రావచ్చని, దీనిపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. సాధారణంగా దెబ్బతింటే మరమ్మతు చేయడం కంటే.. కొత్త డయాఫ్రం వాల్‌ కట్టడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చే పనిని నేషనల్‌ హైడ్రోపవర్‌ కంపెనీకి అప్పజెప్పినట్లు వెల్లడించారు. దీనిపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రాజెక్టును పూర్తిచేసే గడువు విషయంలో వీటి ప్రభావం ఏదీ ఉండబోదన్నారు. పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం తదితర అంశాలపై వెదిరె శ్రీరాం రెండు తెలుగు రాష్ట్రాల తరఫున కేంద్ర జల్‌శక్తి శాఖలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వరుసగా దిల్లీలో సమావేశాలు, కేంద్ర జల్‌శక్తి శాఖకు, రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు మధ్య అనుసంధానంగా ఉంటున్నారు. తాజాగా పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన ‘ఈనాడు’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఇవి...

పోలవరంలో డయాఫ్రం వాల్‌ సమస్యను ఎలా అధిగమించబోతున్నారు?
శ్రీరాం: ఇప్పటికే నిపుణులు పరిశీలించారు. దిల్లీ సమావేశాల్లో చర్చించాం. ఇసుక కోత ఏర్పడిన చోట కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలని నిర్ణయించాం. మిగిలిన డయాఫ్రం వాల్‌ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఎన్‌హెచ్‌పీసీకి అప్పజెప్పాలని నిర్ణయించాం. రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కేంద్ర జలసంఘంతో మాట్లాడతారు. ఎన్‌హెచ్‌పీసీ ప్రాజెక్టులో ఒకటి ఇలాంటి సమస్యే వచ్చిందని తెలిసింది. అక్కడ అధ్యయనం చేయాలని, అదే విధానంలో పోలవరంలోనూ సరిపోల్చి డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చాలని సూచించాం. కేంద్ర జలసంఘం నిర్ణయం తీసుకుంటుంది.

ఇలాంటి సమస్య ఎక్కడా రాలేదన్నారు... హైడ్రో ప్రాజెక్టుల్లో ఎక్కడ వచ్చింది?
శ్రీరాం: తీస్తా హైడ్రోపవర్‌ ప్రాజెక్టులో దాదాపు ఇలాంటి సమస్యే వచ్చింది. అక్కడ ఎలా పరిష్కరించారో అధ్యయనం చేస్తాం. పోలవరం తరహాలోనే అక్కడా నిర్మించారు. ఇలాంటి సమస్యే అక్కడ కూడా వచ్చింది. అక్కడ అధ్యయనం తర్వాత రెండు నెలల్లో డయాఫ్రం వాల్‌పై నిర్ణయం తీసుకుంటాం. దిల్లీ సమావేశంలోనే ధ్వంసమైనంత మేర కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలని నిర్ణయించాం. ఎంత లోతు నుంచి కట్టాలో ఇంకా తేల్చలేదు. సామర్థ్యం తేలిన తర్వాత పూర్తిగా కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలా అన్నది తేలుస్తాం. దాదాపు కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాల్సి రావచ్చు.

ఇసుక కోత... అగాధాల సమస్య ఎలా పరిష్కరిస్తున్నారు?
శ్రీరాం: ప్రస్తుతం హైడ్రోఫిల్లింగ్‌ విధానంలోనే అక్కడ పూడ్చాలని భావిస్తున్నాం. ఇసుక గట్టిదనం, సాంద్రతపై పరీక్షలు చేయిస్తున్నాం. వాటి ఫలితాలు నెలన్నరలో వస్తాయి. డ్రెడ్జింగ్‌ను కూడా పరిశీలించాం. ఆ పరీక్ష ఫలితాలు వచ్చాక డ్రెడ్జింగ్‌ అవసరమా కాదా అన్నది పూర్తిస్థాయిలో తేలుతుంది. ప్రస్తుతం కోత పడ్డ ప్రాంతంలో ఇసుకతో నింపుతున్నాం.

డిజైన్ల ఆమోదానికి ఆలస్యం అవుతోంది?
శ్రీరాం: ఇందులో చాలా సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర జలవనరులశాఖ డిజైన్లు ప్రతిపాదిస్తుంది. కేంద్ర జలసంఘం ఆమోదిస్తుంది. ఇందులో అనేక అంశాలున్నాయి. ఇంజినీరింగు విషయంలో భిన్న కోణాలు ఉంటాయి. అవన్నీ పరిశీలించాలి.

గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది?
శ్రీరాం: ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. 90% నిధులు కేంద్రమే ఇస్తుంది. 10% మూడు రాష్ట్రాలు భరించాలి. ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని నీటిని గోదావరి నుంచి పెన్నా మీదుగా తమిళనాడుకు తరలించాలనేది యోచన. ఈ స్థాయిలో కేంద్రం నుంచి నిధులు వస్తున్నందున రెండు తెలుగు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాలి. ఈ ప్రాజెక్టు చేపట్టాలంటే భాగస్వామ్య రాష్ట్రాల సమ్మతి ముఖ్యం. అందుకు ప్రయత్నిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌నూ ఒప్పించాలి.

పోలవరం నుంచి గోదావరి పెన్నా అనుసంధానం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది కదా... దీనివల్ల దిగువ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉంటాయనే వాదన ఉంది.
శ్రీరాం: పోలవరం వద్ద అనుసంధాన ప్రతిపాదనకు వరద జలాలు మూలం. వరద జలాల ఆధారంగా చేపట్టే ప్రాజెక్టులకు ఈ స్థాయి నిధులిచ్చేందుకు కేంద్ర జలసంఘం సమ్మతించదు. నికర జలాల ఆధారంగా చేపట్టే ప్రాజెక్టులకే అనుమతి ఇస్తుంది.

Last Updated : Jun 6, 2022, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.