ETV Bharat / city

15th finance commission: ఆ వెయ్యి కోట్లు వస్తే! అమరావతికి దన్ను

author img

By

Published : Oct 6, 2021, 6:51 AM IST

దేశంలో 8 కొత్త నగరాలకు రూ.8 వేల కోట్లు కేటాయించాలని కేంద్రానికి పదిహేనో ఆర్థికసంఘం సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో అన్నీ రాష్ట్రాలు నిధులు దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత పెద్ద నగరం ఒక్కటీ లేని ఆంధ్రప్రదేశ్‌కి... అమరావతి వంటి మహానగరాన్ని నిర్మించుకోవలసిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటి నుంచీ సిద్ధమైతేనే కేంద్ర నిధుల కోసం పోటీలో నిలబడగలమని చెబుతున్నారు.

15th finance commission to amaravathi
15th finance commission to amaravathi

దేశంలోని ఏ మహానగరానికీ తీసిపోని విధంగా ప్రజారాజధాని అమరావతి వస్తుందని అంతా భావించారు. అన్నీ అమరుతున్నాయనగా.. రాజధాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. భూ సమీకరణ, రూ.10 వేల కోట్లతో చేసిన పనులు... వేలమంది శ్రామికుల నిరంతర శ్రమ.. నిష్ఫలంగా మారిపోయాయి. కానీ ఇప్పుడు అనుకోకుండా మరో అవకాశం వచ్చింది. రాజధాని నగర నిర్మాణానికి పదిహేనో ఆర్థికసంఘం ప్రతిపాదించిన పథకం ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఈ పథకానికి మన రాష్ట్రం నుంచి అమరావతి ఎంపికైతే... కేంద్రం నుంచి ఏకంగా రూ.వెయ్యి కోట్ల గ్రాంటు వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే పట్టణ జనాభా 35 శాతానికి పెరగడంతో మన దేశంలో ప్రణాళికాబద్ధంగా కొత్త నగరాలు నిర్మించాల్సిన అవసరాన్ని పదిహేనో ఆర్థిక సంఘం గుర్తించింది.

దేశంలో 8 కొత్త నగరాలకు రూ.8 వేల కోట్లు కేటాయించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఇప్పటికే పెద్ద నగరాలున్న రాష్ట్రాలూ ఈ నిధులు దక్కించుకుని కొత్త నగరాలు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత పెద్ద నగరం ఒక్కటీ లేని ఆంధ్రప్రదేశ్‌కి... అమరావతి వంటి మహానగరాన్ని నిర్మించుకోవలసిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటి నుంచీ సిద్ధమైతేనే కేంద్ర నిధుల కోసం పోటీలో నిలబడగలమని చెబుతున్నారు.

అమరావతే ఎందుకు?

రోడ్ల నిర్మాణం, తాగునీరు, మురుగునీటి పైపులైన్ల వంటి మౌలిక వసతుల కల్పన, పాఠశాలలు, కళాశాలలకు స్థలాల కేటాయింపు వంటి సవాళ్లు... కొత్తగా నిర్మించే నగరంలో తక్కువని పదిహేనో ఆర్థిక సంఘం పేర్కొంది. గ్రీన్‌ఫీల్డ్‌ నగరాన్ని నిర్మించేటప్పుడు ఎదురయ్యే ప్రధానమైన సవాళ్లనూ ప్రస్తావించింది. అమరావతి వాటన్నిటినీ ఎప్పుడో అధిగమించింది. ఆర్థిక సంఘం ఏం చెప్పిందో, అమరావతికి ఉన్నవేంటో చూద్దాం...!

రూ.వెయ్యి కోట్లతో నిర్మాణానికి ఊతం

217 చ.కి.మీ.ల విస్తీర్ణంలో అమరావతిని అన్ని హంగులతో అభివృద్ధి చేయడానికి రూ.40 వేల కోట్లకుపైగా అంచనాలతో టెండర్లు పిలిచారు. దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టారు. సగం పూర్తయిన రహదారులు, భవనాలు పాడవుతున్నాయి. కేంద్రం ఇచ్చే రూ.వెయ్యి కోట్లతో వీటిని పూర్తిచేయవచ్చు. ఈ పనులు మొదలైతే.. నిధులిచ్చేందుకు ఆర్థిక సంస్థలూ ముందుకొస్తాయి. ఆర్థిక సంఘం కూడా... తామిచ్చే రూ.వెయ్యి కోట్లను ‘వయబిలిటీ ఫండింగ్‌’గానే చెబుతోంది. ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణకు అది ఒక ఉత్ప్రేరకంగా తోడ్పడుతుందని పేర్కొంది.

పదిహేనో ఆర్థిక సంఘం ఏం చెప్పింది?

పదిహేనో ఆర్థిక సంఘం 2021-26కి సంబంధించిన నివేదికలో... కొత్త నగరాల నిర్మాణం అవసరాన్ని గుర్తించింది. ఇప్పటికే ఉన్న నగరాల్లో వసతుల్ని మెరుగు పరుస్తూనే, మరిన్ని కొత్త నగరాల్ని నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘పోటీ ఆధారిత గ్రాంటు’ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఒక రాష్ట్రంలో ఒక నగరానికే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. పూర్తిగా కొత్తగా నిర్మించే (గ్రీన్‌ఫీల్డ్‌) నగరాలతో పాటు, ఇప్పటికే ఉన్న నగరాల (బ్రౌన్‌ఫీల్డ్‌) విస్తరణకూ ఆ నిధులు ఉపయోగించుకోవచ్చని పదిహేనో ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలా చూసినా... దీనికి అవసరమైన అర్హతలన్నీ అమరావతికి ఉన్నాయి.

ఎలా ఎంపిక చేస్తారు?

* కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2022 జనవరి 31 నాటికి నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఇందులో రాష్ట్రాల ప్రతినిధులూ సభ్యులే. పోటీలో పాల్గొనేందుకు ప్రాథమిక అర్హతల్ని కమిటీ నిర్దేశిస్తుంది.

* 2022 మార్చి 31 నాటికి బిడ్డింగ్‌ అర్హతలను నిర్ణయిస్తారు.

* 2022 సెప్టెంబరు 30 నుంచి బిడ్‌లు స్వీకరిస్తారు.

* 2022 డిసెంబరు 31 నాటికి ఎంపికైన రాష్ట్రాలను ప్రకటిస్తారు.

* 2023 మార్చి 31 నాటికి మొదటి దశ నిధులు విడుదల చేస్తారు.

* నిధులన్నీ మొదటే ఇచ్చేస్తే ప్రాజెక్టును మధ్యలో వదిలేస్తారని.. నిధులు దశలవారీగా విడుదల చేయాలని ఆర్థిక సంఘం నిర్దేశించింది.

ఇదీ చదవండి: Employees: తెలంగాణ వెళ్లాలనుకునే ఉద్యోగుల రిలీవ్‌కు ప్రభుత్వం కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.