ETV Bharat / city

ప్రత్యేకహోదాపై 15వ ఆర్థిక సంఘం ఏమందంటే?

author img

By

Published : Feb 2, 2020, 5:29 AM IST

ప్రత్యేక హోదాపై 15వ ఆర్థిక సంఘం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించటంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని తెలిపింది. ఏ మాత్రమూ తమ పరిధిలోని అంశం కాదని మధ్యంతర నివేదికలో తేల్చి చెప్పింది.

ప్రత్యేకహోదాపై 15వ ఆర్థిక సంఘం ఏమందంటే?
ప్రత్యేకహోదాపై 15వ ఆర్థిక సంఘం ఏమందంటే?

ప్రత్యేకహోదాపై 15వ ఆర్థిక సంఘం ఏమందంటే?

రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై తుదినిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని 15వ ఆర్థిక సంఘం తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని మధ్యంతర నివేదికలో వెల్లడించింది. 'లుకింగ్ అహెడ్' శీర్షికన ఉన్న ఏడో అధ్యాయంలో... ఈ అంశాన్ని ఆర్థిక సంఘం తేటతెల్లం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వాలని... పలు రాష్ట్రాలు కోరాయని... వాటిని పరిగణనలోకి తీసుకుని కేంద్రమే తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సమతుల, సమ్మిళిత అభివృద్ధికి సంబంధించి మరింత మదింపు చేసి తుది నివేదిక రూపొందిస్తామని పేర్కొంది.

రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా రాష్ట్రానికి అయిదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హామీ ఇచ్చారు. 2014లో కేంద్ర మంత్రివర్గం ఇదే అంశాన్ని తీర్మానించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పక్కకుమళ్లింది. అనేక కారణాలు చూపి... కేంద్రం ఇప్పటివరకూ ప్రత్యేక హోదా ఇవ్వలేదు.

హోదా ఉన్నా లేకపోయినా... నిధుల కేటాయింపులో ఎటువంటి తేడా ఉండబోదంటూ 14వ ఆర్థిక సంఘం పేర్కొందని కేంద్రం వివిధ సందర్భాల్లో ప్రకటనలు చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక సాయాన్ని 2016 సెప్టెంబరులో రాష్ట్రానికి ప్రకటించింది. దీని ప్రకారం కేంద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం 90శాతం వాటా భరించాల్సి ఉంటుంది. అయితే 2017 మార్చిలో నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకే దీన్ని పరిమితం చేశారు. దీని వల్ల ప్రత్యేక ఆర్థికసాయం విషయంలోనూ.. ప్రత్యేకంగా వచ్చిన ఆర్థిక వెసులుబాటు ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని ఇప్పటివరకూ కేంద్రం చెబుతూ వచ్చింది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం ఈ అంశంపై స్పష్టంగా వివరణ ఇవ్వటంతో కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి: 'ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఎప్పుడో చెప్పాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.