ETV Bharat / business

'50 కోట్ల యూజర్ల వాట్సాప్ డేటా లీక్..​ ఆ వార్తలన్నీ అవాస్తవం'

author img

By

Published : Nov 29, 2022, 10:58 AM IST

WhatsApp Data Leak: వాట్సాప్​ డేటా లీక్ అయ్యిందన్న వార్తలను మెటా ఖండించింది. యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేసింది.

whatsapp data leak
వాట్సాప్ డేటా లీక్

WhatsApp Data Leak : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్​ నుంచి భారీగా డేటా లీక్ అయ్యిందన్న వార్తలను వాట్సాప్ మాతృసంస్థ మెటా ఖండించింది. 50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు వచ్చిన వార్తలను సోమవారం కొట్టిపారేసింది. "సైబర్​న్యూస్​లో వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. ఎలాంటి ధ్రువీకరణ లేని స్క్రీన్​షాట్ల ఆధారంగా ఈ ఆరోపణలు చేశారు. డేటా లీక్ విషయంలో సరైన ఆధారాలు లేవు" అని మెటా ప్రతినిధి వెల్లడించారు.

అంతకుముందు దాదాపు 50కోట్ల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు 'సైబర్‌న్యూస్‌' నివేదిక వెల్లడించింది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. ఓ హ్యాకింగ్‌ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఈ ఫోన్‌ నంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన పెట్టినట్లు సైబర్‌న్యూస్‌ కథనం పేర్కొంది. ఇందులో భారత యూజర్ల నంబర్లు కూడా ఉన్నాయని సమాచారం.

అత్యధికంగా ఈజిప్టు నుంచి 4.5కోట్ల మంది, ఇటలీ నుంచి 3.5 కోట్ల మంది, అమెరికాకు చెందిన 3.2 కోట్ల మంది, సౌదీ అరేబియా నుంచి 2.9కోట్లు, ఫ్రాన్స్‌ నుంచి 2 కోట్లు, టర్కీకి చెందిన 2 కోట్లు, యూకే నుంచి 1.1కోట్లు, రష్యా నుంచి దాదాపు కోటి మంది వాట్సాప్‌ యూజర్ల నంబర్లు లీకైనట్లు సైబర్‌న్యూస్‌ కథనం తెలిపింది. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నంబరుకు ఒక్కో ధరతో విక్రయానికి పెట్టారని పేర్కొంది. అమెరికా డేటాసెట్‌ అయితే 7వేల డాలర్లు, యూకే డేటా ధర 2500 డాలర్లు, జర్మనీ యూజర్ల నంబర్ల ధర 2వేల డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది.

ఈ నంబర్లను సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు చేసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. అందువల్ల, గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్‌, మెసేజ్‌లు వస్తే స్పందించొద్దని సూచించింది. కాగా.. మెటాకు చెందిన సంస్థల్లో డేటా లీక్‌ ఘటనలు ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా 50కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కి ఆన్‌లైన్‌లో లీక్‌ అయినట్లు వార్తలు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.