ETV Bharat / business

'రాష్ట్రాల కోరిక మేరకే వాటిపై జీఎస్టీ.. నిర్ణయం కేంద్రానిది కాదు'

author img

By

Published : Jul 24, 2022, 3:28 PM IST

GST on food items: రాష్ట్రాలు చేసిన అభ్యర్థన ప్రకారమే ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీ విధించాలన్న నిర్ణయం జీఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో తీసుకుందని, అందులో అన్ని రాష్ట్రాలు భాగమేనని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు.

Packaged Food GST
GST on food items

Packaged Food GST: ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలన్న నిర్ణయం.. రాష్ట్రాల అభ్యర్థన మేరకే తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వ్యాట్ ద్వారా కోల్పోయే ఆదాయాన్ని పూడ్చేందుకే జీఎస్టీ విధించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిది కాదని, జీఎస్టీ మండలిదేనని కేంద్ర ఆర్థిక శాఖ రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. మండలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పాటు మంత్రులు భాగమేనని గుర్తుచేశారు.

"జీఎస్టీ అమలులోకి రాకముందు చాలా రాష్ట్రాల్లో 'వ్యాట్' ఉండేది. ఆహార పదార్థాలపై వ్యాట్ విధించడం ద్వారా రాష్ట్రాలు ఆదాయాన్ని సంపాదించేవి. బ్రాండెడ్ ప్యాకింగ్ ఉత్పత్తులపైనే పన్ను విధించాలని జీఎస్టీ మార్గదర్శకాల్లో ఉంది. అయితే, అందులోని లొసుగులను ఉపయోగించుకొని కొన్ని పేరున్న కంపెనీలు సైతం.. పన్నును తప్పించుకుంటున్నాయి. దీనిపై రాష్ట్రాలు కూడా మాకు సమాచారం ఇచ్చాయి. జీఎస్టీకి ముందు తమకు చాలా ఆదాయం వచ్చేదని, ఇప్పుడు దాన్ని కోల్పోతున్నామని చెప్పాయి. మంత్రుల బృందం, ఫిట్​మెంట్ కమిటీ, జీఎస్టీ మండలి చర్చలు జరిపి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకుంది."
-తరుణ్ బజాజ్, రెవెన్యూ కార్యదర్శి

రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు బజాజ్ స్పష్టం చేశారు. ఏ ఒక్క రాష్ట్రానికి అసంతృప్తి ఉన్నా.. దానిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. 'ఏదో ఓ రాష్ట్రానికి అభ్యంతరాలు ఉన్నాయనే కారణంతో చాలా ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం. రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడం లేదా ప్రతిపాదనను అక్కడితో ఆపేయడం అనే విధానం నడుస్తోంది' అని అన్నారు.

జులై 18 నుంచి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ అమల్లోకి వచ్చింది. పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ సహా ఆహారపదార్థాలు, నిత్యావసరాలన్నీ పన్ను పరిధిలోకి వచ్చేశాయి. కూరగాయలు మినహా అన్ని ప్యాకెట్లలో ఉండే బ్రాండెడ్‌ పదార్థాలపై 5 నుంచి 18 శాతం వరకు జీఎస్టీ భారం పడింది. అయితే, పప్పులు, పెరుగు, ఓట్స్​ సహా మొత్తం 11 రకాల నిత్యావసర సరకులను ముందస్తుగా ప్యాక్​ లేదా లేబెల్డ్​ చేసి విక్రయిస్తేనే జీఎస్​టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విడిగా వాటిని అమ్మితే ఈ జీఎస్​టీ వర్తించదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.