ETV Bharat / business

గృహరుణ ఒప్పందంపై సంతకం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

author img

By

Published : Jun 26, 2022, 6:57 AM IST

జీవితంలో అతి పెద్ద పెట్టుబడి సాధారణంగా ఇంటిపైనే ఉంటుంది. సొంతింటి కోసం రుణం తీసుకోవడం అంటే ఒక దీర్ఘకాలిక ఒప్పందాన్ని కొనసాగిస్తున్నట్లే. ఈ అప్పు తీసుకునే తొందరలో చాలామంది కొన్ని ప్రాథమిక విషయాలను విస్మరిస్తుంటారు. ఒకసారి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత వాటిని భరించక తప్పదు. కాబట్టి, ముందుగానే వాటిని అర్థం చేసుకుంటే భవిష్యత్‌లో చిక్కులు రాకుండా చూసుకోవచ్చు.

home loan agreement precautions
home loan agreement precautions

Precautions for home loan: బ్యాంకులు లేదా గృహరుణ సంస్థల నుంచి ఇంటి రుణం తీసుకునే ముందు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాం. ఆ నియమ నిబంధనలన్నింటినీ అంగీకరిస్తున్నట్లు ఇరు పక్షాలూ సంతకం చేయాల్సి ఉంటుంది. ఒకసారి సంతకాలు పూర్తయి, రుణం మంజూరైతే.. దీన్ని నుంచి బయటకు రావడం అంత తేలికేమీ కాదు. కాబట్టి, ఒప్పంద పత్రంలో చూడాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలేమిటంటే..

వడ్డీ రేట్లు..: బ్యాంకులు తమ ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌కు అనుసంధానం చేశాయి. దాదాపు అన్ని బ్యాంకులూ రెపో రేటును తమ ప్రామాణిక వడ్డీ రేటుగా పరిగణిస్తున్నాయి. దీనికి కొంత మేరకు అదనంగా కలిపి (స్ప్రెడ్‌) గృహరుణ వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. కొన్ని బ్యాంకులు రెపో రేటు మారగానే వడ్డీ రేటునూ దానికి అనుగుణంగా మార్చేస్తుంటాయి. మరికొన్ని మూడు నెలలకోసారి మాత్రమే వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. బ్యాంకులను బట్టి, ఇది ఆధారపడి ఉంటుంది. ఒప్పందంలో వడ్డీ రేటును ఏ విధంగా నిర్ణయిస్తారన్నది స్పష్టంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో వడ్డీ రేటు పెరిగినప్పుడు ఈఎంఐ మారదు. వ్యవధి మాత్రమే పెరుగుతుంది. గృహరుణ సంస్థల (హెచ్‌ఎఫ్‌సీ) తీరు మరో విధంగా ఉంటుంది. వీటి రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌పీఎల్‌ఆర్‌) పెరిగినప్పుడు రుణ గ్రహీతలకు ఆ భారాన్ని వెంటనే బదిలీ చేస్తాయి. తగ్గినప్పుడు మాత్రం కొంత రుసుము చెల్లించి, ఆ తగ్గింపు ప్రయోజనాన్ని పొందాల్సి ఉంటుంది. కాబట్టి, వీటితో రుణ ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఇలాంటి రుసుములు ఎంత మేరకు విధిస్తున్నారన్నది చూసుకోవాలి.

విలువ ఆధారంగా..: కొనుగోలు చేస్తున్న ఆస్తి విలువలో ఎంత మేరకు రుణం ఇవ్వాలన్నది బ్యాంకులు నిర్ణయిస్తాయి. రుణం తీసుకునే వ్యక్తి ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, వయసు, తిరిగి చెల్లించే సామర్థ్యం ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈ లోన్‌ టు వాల్యూ (ఎల్‌టీవీ)ని నిర్ణయిస్తాయి. కొన్నిసార్లు ఆస్తి విలువ తగ్గే ఆస్కారం ఉంది. ఇలాంటప్పుడు ఎల్‌టీవీ నిష్పత్తిని పెంచే అవకాశం బ్యాంకులకు ఉంటుంది. అప్పుడు కొంత మేరకు చేతి నుంచి డబ్బు డిపాజిట్‌ చేయాల్సి వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఎల్‌టీవీని పెంచుతారనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవడం అవసరం.

ముందుగానే చెల్లిస్తే..: చలన వడ్డీ రేటుకు తీసుకున్న రుణాలను వ్యవధికి ముందుగానే చెల్లించినా బ్యాంకులు ఎలాంటి రుసుములను వసూలు చేయవు. కానీ, స్థిర వడ్డీ రుణాలను ముందుగా చెల్లిస్తే కొంత ఫీజు ఉంటుంది. ఒప్పందంలో గమనించాల్సిన ముఖ్యమైన అంశాల్లో ఇదీ ఒకటి.

రుసుముల మాటేమిటి?: నెలవారీ వాయిదాలను చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు భారీగా రుసుములు విధిస్తాయి. కొన్ని సందర్భాల్లో డిఫాల్టర్‌గానూ పేర్కొంటాయి. రుణ ఒప్పంద పత్రంలో ఈ నిబంధనను జాగ్రత్తగా చూడాలి. నెలవాయిదా చెల్లించకపోతే ఎంత రుసుము విధిస్తుంది? ఎన్నాళ్ల తర్వాత ఎగవేతదారుగా పేర్కొంటారు అనేవి చూడాలి. రుణగ్రహీత మరణించడం, ఉమ్మడిగా రుణం తీసుకున్న దంపతులు విడాకులు తీసుకోవడంలాంటి సందర్భాల్లో ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయన్నదీ చూసుకోవాలి.

ఉద్యోగం లేదా చిరునామా మారినప్పుడు బ్యాంకులకు ఆ విషయం తెలియజేయాలి. లేకపోతే బ్యాంకులు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇవే కాకుండా.. రుణం విషయంలో మీకు సందేహం ఉన్న ప్రతి విషయాన్నీ బ్యాంకు ప్రతినిధి లేదా వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా నివృత్తి చేసుకోవాలి.

ఇదీ చదవండి: ఫారం-16 అందుకున్నారా?.. అయితే ఈ వివరాలు సరిచూసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.