ETV Bharat / business

తెలంగాణలో... జోరుగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు

author img

By

Published : Mar 4, 2021, 9:11 AM IST

షేర్‌ మార్కెట్లో లావాదేవీల మాదిరిగా తెలంగాణలో భూముల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియను ప్రభుత్వం సరళీకృతం చేయడంతో భూ విక్రయాలు పెరిగాయి. ధరణి పోర్టల్‌ ద్వారా ఏక కాలంలో సేవలను అందించడం విక్రయదారులతోపాటు కొనుగోలుదారులకు కూడా కలిసి వస్తోంది. దీంతో కొందరు భూములను కొనుగోలు చేసి విక్రయించడాన్నే వ్యాపారంగా మార్చుకున్నారు. నగరం చుట్టూ ఉన్న జిల్లాల్లో ఈ వ్యాపారం రోజురోజుకూ పుంజుకుంటోంది.

తెలంగాణ: జోరుగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు
తెలంగాణ: జోరుగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు

దయం కొని ధర రాగానే షేర్‌ మార్కెట్లో బాండ్లను విక్రయించినట్లు భూములపై పలువురు పెట్టుబడి పెడుతున్నారు. నాలుగైదు కమతాలకు చెందిన రైతులతో మాట్లాడి ఐదు నుంచి పది ఎకరాలకు పైగా ఒకేచోట ఉండేలా చూసుకొని ధరణి ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఆ వెంటనే ఎక్కువ విస్తీర్ణం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్న వారికి మరింత లాభానికి వారు విక్రయిస్తున్నారు. రెండు నెలలుగా ఇలాంటి లావాదేవీలు తెలంగాణ యాదాద్రి, సూర్యాపేట, మెదక్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని పలు మండలాల్లో భారీగా పెరిగాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుండటంతో విక్రయదారులు, కొనుగోలుదారులు ముందుకొస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలతో పెద్దగా లాభాలు ఉండకపోవడంతో వ్యాపారులు గతంలో స్థిరాస్తి వెంచర్లకు ఉపయోగపడే భూములను మాత్రమే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. సాగుపై మక్కువ ఉన్న వారికి, నగరానికి దగ్గర్లో ఐదు నుంచి పది ఎకరాల భూమి ఉండాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నగరం చుట్టూ ఉన్న జిల్లాలో వేల సంఖ్యలో ఇలాంటి లావాదేవీలు నమోదవడం విశేషం.

వివరాలిలా...

నాలా అనుమతులూ... సులువు

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూములను వ్యవసాయేతర రంగానికి (నాలా) వినియోగించుకునేందుకు ప్రభుత్వం సులువుగా అనుమతి ఇస్తోంది. పోర్టల్‌ అమల్లోకి రాకముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే రెవెన్యూ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందాల్సి ఉండేది. అనంతరం నాలాకు దరఖాస్తు చేసుకున్నాక ఆర్డీవో ఆదేశాల మేరకు తహసీల్దారు, ఆర్‌ఐ, వీఆర్వో విచారణ నిర్వహించి నివేదికను పంపేవారు. అధికారులు సరేనంటే.. అనుమతులు వచ్చేందుకు కనీసం ఇరవై రోజులు పట్టేది. ఇప్పుడు ధరణిలో భూమి ఉంటే నాలాకు స్లాటు నమోదు చేసుకుంటే చాలు మరుసటిరోజే అనుమతి ఇస్తున్నారు. దీంతో విక్రయాల్లో వేగం పెరిగింది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, విజయవాడ, బెంగళూరు మార్గాల్లోని మండలాల్లో రహదారుల వెంబడి ఉన్న భూములకు డిమాండ్‌ పెరిగింది.

సర్వే నంబర్ల వారీగా ధరలు...

రాష్ట్రంలో భూముల ధరలను గ్రామాల యూనిట్‌గా కాకుండా సర్వే నంబర్ల వారీగా నిర్ధారించడం రైతులకు కలిసివస్తోంది. రహదారులు, నీటి వనరులు, మైదాన ప్రాంతాలు, పరిశ్రమలకు సమీపంలో ఉన్న భూములు తాజా విధానంతో భారీగా ధర పలుకుతున్నాయి. ధరణి పోర్టల్లో సర్వే నంబరును నమోదు చేయగానే మార్కెట్‌ ధరను నిర్ధారించి చూపుతోంది. దీనివల్ల ధర విషయంలోనూ రైతులు మోసపోయే పరిస్థితి దూరమైందని వారు చెబుతున్నారు. ఇది కొనుగోలుదారుల పనినీ సులువు చేస్తోందని అంటున్నారు.

రెండు లక్షలు దాటిన రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి ముగిసే నాటికి 2.08 లక్షలకు చేరుకున్నాయి. గతేడాది నవంబరు 2న ధరణి పోర్టల్‌ ద్వారా ప్రారంభించిన రిజిస్ట్రేషన్లు క్రమంగా పుంజుకున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెల ముగిసేనాటికి 75,842కి చేరుకున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూములతోపాటే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేవారు.

ఈ పద్ధతిని మార్చిన ప్రభుత్వం 571 తహసీల్దారు కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విధానం అమల్లోకి తెచ్చింది. తహసీల్దారే సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తూ మ్యుటేషన్‌తోపాటు రిజిస్ట్రేషన్‌ నిర్వహిస్తున్నారు. మరోవైపు నాలుగు నెలల్లో 7366 నాలా అనుమతులను పోర్టల్‌ ద్వారా మంజూరు చేశారు.

ఇదీ చూడండి:

పీఏసీఎస్‌లను విస్తరించాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.