ETV Bharat / business

అప్పటి పరిస్థితిని తలచుకొని మస్క్ కంటతడి!

author img

By

Published : Aug 4, 2021, 5:55 PM IST

టెస్లా అధినేత ఎలాన్ మస్క్(​Elon Musk) ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యారు. అప్పట్లో స్పేస్​ ఎక్స్​ను మూసివేయాల్సిన పరిస్థితిని తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను 'టెస్లా ఓనర్స్‌ ఆఫ్‌ సిలికాన్‌వ్యాలీ' గ్రూప్ ట్విట్టర్​లో షేర్ చేయగా.. అది వైరల్​గా మారింది.

Elon-musk-says-NASA-saved-SpaceX-and-braeksdown-in-an-interview
Elon Musk: అప్పటి పరిస్థితిని తలచుకొని మస్క్ కంటతడి!

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ ఏదైనా ప్రాజెక్టు చేపట్టారంటే.. అది సక్సెస్‌ అయ్యి తీరాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయనపై ఉన్న నమ్మకం అలాంటిది. ఈ స్థాయికి చేరడానికి ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఓ దశలో స్పేస్‌ ఎక్స్‌ను దాదాపు మూసివేయాల్సిన పరిస్థితులు వచ్చాయట! ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకొని ఓ ఇంటర్వ్యూలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దానికి సంబంధించిన వీడియోను ‘టెస్లా ఓనర్స్‌ ఆఫ్‌ సిలికాన్‌వ్యాలీ’ గ్రూప్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

స్పేస్‌ ఎక్స్‌ నిర్మించిన ఫాల్కన్‌ వ్యోమనౌక లక్షిత కక్ష్యను చేరుకోవడంలో తొలుత మూడుసార్లు విఫలమైంది. నాలుగో ప్రయత్నంలో విజయవంతమైంది. అయితే, అప్పటికే కంపెనీ తీవ్ర నష్టాల్లోకి జారుకుంది. దాదాపు మూసివేసే స్థితికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో నాసా నుంచి ఓ శుభవార్త అందింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి సామగ్రిని తీసుకెళ్లాల్సిన భారీ కాంట్రాక్టును స్పేస్‌ ఎక్స్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ 1.6 బిలియన్ డాలర్లు. అప్పటికే తీవ్ర నిరాశలో కూరుకుపోయిన మస్క్‌కు ఇది పెద్ద ఊరట కలిగించింది. ఈ వార్తను ఫోన్‌ ద్వారా తెలుసుకున్న ఆయన వెంటనే ‘ఐ లయ్‌ యూ గాయ్స్‌’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది 2008 క్రిస్మస్‌కు రెండు రోజుల ముందు జరిగిన ఘటన. ఈ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్ స్వయంగా వివరించారు. నాసా తమని కాపాడిందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఈ వీడియోను తాజాగా ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. మస్క్ స్పందించారు. అది వాస్తవమని మరోసారి గుర్తుచేసుకున్నారు. నాసా అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ‘‘బయటి శక్తుల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. మంచి జరగాలనే కాంక్షతో పోరాడిన ప్రభుత్వ వర్గాలకు కృతజ్ఞతలు. ఇదే అమెరికా గొప్పతనం’’ అని వ్యాఖ్యానించారు. ఫాల్కన్‌ విజయవంతమైన తర్వాత.. డ్రాగన్‌, క్రూడ్రాగన్‌ పేరిట స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌకల్ని నిర్మించింది. క్రూడ్రాగన్‌ ఇప్పటి వరకు రెండుసార్లు వ్యోమగాముల్ని ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లింది. మరోవైపు 2024లో చంద్రుడిపైకి చేపట్టనున్న మానవసహిత యాత్రకు అవసరమైన కీలక ‘హ్యూమన్‌ ల్యాండర్‌ సిస్టం’ నిర్మాణానికి ఇటీవలే నాసాతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చదవండి: Tesla: భారత్‌లోకి టెస్లా ప్రవేశం ఇప్పట్లో లేనట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.