ETV Bharat / city

కొత్త జిల్లాల్లో.. ఉగాది నుంచే పాలన..!

author img

By

Published : Feb 10, 2022, 6:17 PM IST

Updated : Feb 10, 2022, 7:22 PM IST

ఉగాది నుంచి కొత్త జిల్లాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఉగాది నుంచి కొత్త జిల్లాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

18:14 February 10

ఉగాది నుంచి కొత్త జిల్లాలు

ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్లానింగ్‌, రెవెన్యూ, హోంశాఖ అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్‌.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా.. కొత్త జిల్లాల్లో అధికారుల విధులకు సంబంధించి కూడా మంత్రులు, అధికారులతో జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలను కొత్త జిల్లాలకు పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీరి అనుభవం కొత్త జిల్లాలకు మేలు చేస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఓఎస్డీ హోదాలో కొత్త జిల్లాలకు ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలే ఉంటారని సీఎం తెలిపారు. తుది నోటిఫికేషన్‌ వచ్చిన రోజు నుంచే కొత్త జిల్లాలపై పాలన నిర్వహించాలని సీఎం సూచించారు. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాలు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపైనా చర్చించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ గత నెల 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ చర్యలు చేపట్టింది.

అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉదాహరణకు.. కడపలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. దీంతో హిందూపురంలో ఆందోళనలు మొదలయ్యాయి. అన్ని సదుపాయాలు ఉన్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్నాయి.

కాగా.. నోటిఫికేషన్‌ జారీ చేసిన 30 రోజుల్లోగా జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు.

కొత్త జిల్లాలు ఏర్పడ్డాక యంత్రాంగమంతా సమర్థంగా పనిచేయాలి. ఎలాంటి అయోమయం లేకుండా పాలన సాఫీగా జరగాలి. భవనాలు, మౌలిక వసతులు, ఉద్యోగుల విభజన.. అన్నీ పూర్తి కావాలి. కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళికలు ఖరారు చేయాలి. భవనాల స్థలాల గుర్తింపుపై దృష్టి పెట్టాలి. అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలి. నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడ్డం అన్నది చాలా ముఖ్యం. దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలి.వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుంది. వీరు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలిస్తారు. స్థానిక సంస్థల (జిల్లాపరిషత్‌ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు అధికారులు తయారు చేస్తామన్నారు. - సీఎం జగన్

ఇదీ చదవండి:

AP Corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,345 కరోనా కేసులు, 4 మరణాలు

Last Updated : Feb 10, 2022, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.