ETV Bharat / bharat

YS Sharmila Comments: వివేకాది రాజకీయ హత్యే.. అవినాష్‌కు వ్యతిరేకంగా నిలవడమే హత్యకు కారణం..!

author img

By

Published : Jul 22, 2023, 8:11 AM IST

YS Sharmila on Viveka Murder Case: బాహ్య ప్రపంచానికి పైకి అంతా సవ్యంగా కనిపించినా తమ కుటుంబంతో అవినాష్‌రెడ్డి కుటుంబానికి కొంత కోల్డ్‌వార్‌ నడిచేదని..సీఎం జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల వెల్లడించారు. అవినాష్‌రెడ్డికి మరోసారి కడప ఎంపీ టికెట్‌ దక్కొద్దు అన్నది తమ బాబాయి అభిప్రాయమని తెలిపారు. తన ఉద్దేశంలో వివేకాది రాజకీయ హత్యేనని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏమి తన దగ్గర లేవని.. అయితే వివేకా ఆర్థిక, కుటుంబ కారణాలతో ఘర్షణకు దిగే వ్యక్తి మాత్రం కాదని.. స్పష్టం చేశారు. తమ కుటుంబం, అవినాష్‌రెడ్డి కుటుంబం తమ ముత్తాతకు ఇద్దరు భార్యల సంతానమని.. ఈ కారణంగానే విబేధాలు ఉండేవని చెప్పారు. వివేకా హత్యకు దారితీసిన పలు అంశాల గురించి తన వాంగ్మూలంలో ఆమె కూలంకషంగా వివరించారు.

sharmila
sharmila

వివేకాది రాజకీయ హత్యే.. అవినాష్‌కు వ్యతిరేకంగా నిలవడమే హత్యకు కారణం

YS Sharmila on Viveka Murder Case: వైఎస్​ అవినాష్‌రెడ్డిని కడప ఎంపీ సీటుకు పోటీ చేయనివ్వద్దనేది తన ఆలోచన అని వివేకానందరెడ్డి తనకు చెప్పారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. తనను ఎంపీగా పోటీ చేయమంటే ముందు తాను అందుకు ఒప్పకోలేదన్నారు. జగన్‌ తనకు మద్దతు ఇవ్వరని తెలిసే తాను అందుకు అంగీకరించలేదన్న ఆమె.. కానీ వివేకా పలుమార్లు అడగడంతో పోటీకి సరే అన్నానన్నారు.

అవినాష్‌తోపాటు అతని కుటుంబానికి వ్యతిరేకంగా నిలవడమే వివేకా హత్యకు కారణం కావచ్చు అన్నారు. తాము వెళ్లే దారిలోకి వివేకానందరెడ్డి వస్తున్నారని వారి మనసులో పెట్టుకోవచ్చని.. వివేకాది రాజకీయ లేదా ప్రేరేపిత హత్య కావచ్చని.. తాను అయితే అలాగే ఆలోచిస్తున్నానని ..వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలతో వివేకా హత్యకు గురై ఉండరని.. ఆమె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

అవినాష్‌ను పోటీ చేయనివ్వనని బహిరంగంగా ప్రకటించే మనిషి వివేకానందరెడ్డి కాదన్న షర్మిల.. జగన్‌కు తాను వ్యతిరేకంగా వెళ్లనని వివేకా అనుకున్నారని తెలిపారు. అవినాష్‌కు టికెట్‌ ఇవ్వకుండా జగన్‌ను ఒప్పించి తీరగలననే నమ్మకం చిన్నాన్నకు అపారంగా ఉండేది అన్నారు. ఆయన అవినాష్‌రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని షర్మిల పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి తరఫు నుంచి ఏమైనా జరిగి ఉండొచ్చనేదే తమ ఆలోచనని పేర్కొన్న షర్మిల.. అది నిజం కావచ్చు.. కాకపోవచ్చు అన్నారు.

వైఎస్‌ఆర్‌ ఉన్నప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో లేని అవినాష్‌రెడ్డి కుటుంబం ఆయన మరణించిన తర్వాత క్రియాశీలంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం భారతినేనని షర్మిల పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి ఆమెకు కజిన్‌ అని తెలిపారు. అవినాష్‌ తండ్రి, భారతి తల్లి తోబుట్టువులని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్‌రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి కారణం కావచ్చు అన్నారు.

మనోహర్‌రెడ్డి టీడీపీకు మద్దతు పలికారన్న షర్మిల.. జగన్‌ అతడ్ని ఒప్పించి తిరిగి వైసీపీకు మద్దతుగా పని చేయించారన్నారు. కాబట్టి వివేకా ఓటమికి మనోహర్‌రెడ్డి ఓ కారణం కావచ్చు అని షర్మిల అభిప్రాయపడ్డారు. 2019 మార్చి 15న జమ్మలమడుగులో తనతో ప్రచారం చేయించాలని వారు ప్రయత్నించారు అన్నది నిజం కాదని షర్మిల పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌ మరణించిన తర్వాత 2009 ఉపఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకూ తాను జగన్‌ కోసం పనిచేశానన్న షర్మిల.. హత్యకు గురయ్యే రెండు, రెండున్నర నెలక్రితం వివేకా తన ఇంటికి వచ్చి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయమని అడిగారన్నారు. అంతకు ముందెన్నడూ తమ మధ్య ఆ అంశం చర్చకు రాలేదన్న షర్మిల.. కాదన్నా వినేందుకు ఆయన సిద్ధంగా లేరని.... పోటీ చేయబోనని చెప్పొద్దంటూ గంటన్నరసేపు పదేపదే డిమాండ్‌ చేసి ఒప్పించారన్నారు.

ఈ విషయం మీడియాలో వచ్చిందా, బయట ప్రచారం జరిగిందా లేదా అన్నది గుర్తులేదన్న షర్మిల... ఇది తమ ఇద్దరి మధ్య మాత్రమే జరిగిన సంభాషణ అని కచ్చితంగా చెప్పగలను అన్నారు. తాను కాకుండా ఎంపీ సీటుకు తననెందుకు పోటీ చేయించాలని వివేకా అనుకున్నారో తెలియదని షర్మిల పేర్కొన్నారు. బహుశా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం కారణం కావచ్చు అన్నారు. తనకు టికెట్‌ రాదని ఆయన బలంగా నమ్మి ఉండొచ్చు అన్నారు. టికెట్‌ ఇప్పించేలా జగన్‌ను ఒప్పించే బాధ్యత తనదని మాత్రం చెప్పారన్నారు.

కొందరు దగ్గరి వ్యక్తులే వివేకాకు వెన్నుపోటు పొడిచారన్న షర్మిల.. తనకు తెలిసినంత వరకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డితోపాటు మరికొందరు అనుచరులే వివేకా ఓటమికి కారణమని తనకు గుర్తు అన్నారు. వివేకాకు కుడిభుజం లాంటి వ్యక్తులు కూడా ఆయనకు మద్దతుగా నిలవలేదన్నారు. వారి పేర్లయితే గుర్తులేదన్న షర్మిల.. కానీ కుటుంబంలోని అత్యంత సన్నిహితులే ఓటమికి కారణమన్నారు. తమ కుటుంబంలోనూ ఇదే చర్చ జరిగిందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.