ETV Bharat / bharat

'వరుస పండుగల వేళ బీఅలర్ట్.. ప్రజలంతా మాస్క్​ తప్పక ధరించాలి'

author img

By

Published : Dec 22, 2022, 2:21 PM IST

Updated : Dec 22, 2022, 3:36 PM IST

త్వరలో వరుస పండుగలు ఉన్న నేపథ్యంలో దేశప్రజలంతా మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ కోరారు. శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ప్రపంచ దేశాల్లో మహమ్మారి విజృంభణను గమనిస్తున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా విషయంలో తాము రాజకీయం చేయడం లేదని అన్నారు మాండవీయ.

Union Health Minister Mansukh Mandaviya statement
Union Health Minister Mansukh Mandaviya statement

దేశంలో కొవిడ్​ మహమ్మారి పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని.. కానీ భారత్​లో మాత్రం తగ్గుతున్నాయని తెలిపారు. చైనాలో కొవిడ్​ కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలో మహమ్మారి కట్టడి చేయడంలో కేంద్ర చురుగ్గా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు.

"మహమ్మారిపై పోరాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220 కోట్ల వ్యాక్సిన్​ డోసులు అందించాం. ప్రపంచ దేశాల్లో కొవిడ్ విజృంభణను గమనిస్తున్నాము. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. కొవిడ్ కొత్త వేరియంట్‌ను సకాలంలో గుర్తించడానికి జీనోమ్-సీక్వెన్సింగ్‌ను పెంచాలని రాష్ట్రాలకు సూచించాం. త్వరలో వరుస పండుగలు రానున్న నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. ముందు జాగ్రత్తగా ప్రజలు చర్యలు తీసుకోవాలి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్​పోర్టుల్లో కరోనా టెస్టులు చేస్తాం."
--మన్‌సుఖ్‌ మాండవీయ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

కరోనాపై తాము ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని మాండవీయ స్పష్టం చేశారు. 'భారత్ జోడో యాత్రలో పాల్గొన్నవారిలో కొందరికి కరోనా పాజిటివ్​గా తేలిందని నాకు తెలిసింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని నాకు రాజస్థాన్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. దీనిపై రాజకీయం చేయాలని నేను అనుకోవడం లేదు. కరోనా తొలి, రెండో వేవ్​ల సమయంలోనూ మేం వైరస్​పై రాజకీయాలు చేయలేదు. కానీ, వైద్య శాఖ మంత్రిగా దేశంలో కొవిడ్ వ్యాపించకుండా చూసుకోవడం నా బాధ్యత. అందుకే యాత్ర కన్వీనర్​కు, ముఖ్యమంత్రికి లేఖ రాశా. కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించా. కానీ కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రం మాట వినడం లేదు' అని పేర్కొన్నారు. దేశంలోని పెద్ద ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు మాండవీయ వివరించారు. అవన్నీ సజావుగా నడుస్తున్నాయని చెప్పారు. దేశంలో సరిపడా ఔషద నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.

భారత్​లో బీఎఫ్​-7 వేరియంట్​..
తొలిసారి కొవిడ్‌ బయటపడిన చైనాలో ఆ మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. అయితే, అక్కడ వైరస్‌ విజృంభణ ఒమిక్రాన్ ఉపరకం బీఎఫ్-7 కారణమని నిపుణులు తేల్చారు. ఈ వేరియంట్ భారత్‌లోనూ బయటపడింది. తొలి కేసును గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా బీఎఫ్‌-7 వేరియంట్ కేసులు ఇప్పటివరకు 4 నమోదైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో 3 గుజరాత్‌లో నమోదుకాగా.. మరో కేసు ఒడిశాలో వెలుగుచూసినట్లు పేర్కొన్నాయి.

'నిఘా మరింత కట్టుదిట్టం'
చైనా, జపాన్‌, అమెరికా సహా పలు దేశాల్లో కొవిడ్​ మహమ్మారి పరిస్థితులపై అంచనా వేసేందుకు మన్‌సుఖ్‌ మాండవీయ.. దిల్లీలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని ఆయన ఆదేశించారు. "కరోనా ఇంకా ముగిసిపోలేదు. అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం" అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌, జాతీయ టీకా సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగి NTAGI) ఛైర్మన్‌ ఎన్‌.ఎల్‌.ఆరోడా, ఐసీఎంఆర్‌ డీజీ డా. రాజీవ్‌ బహల్‌, ఇతర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్య, ఆయుష్‌, ఔషధ, బయోటెక్నాలజీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Last Updated : Dec 22, 2022, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.