ETV Bharat / bharat

3నెలల చిన్నారికి 51 సార్లు వాతలు.. వ్యాధికి వింత చికిత్స.. శిశువు మృతి

author img

By

Published : Feb 4, 2023, 12:42 PM IST

తల్లిదండ్రుల మూఢనమ్మకం మూడు నెలల పసికందు ప్రాణం తీసింది. వ్యాధి తగ్గాలంటూ వారు తమ పాప శరీరంపై ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు. మధ్యప్రదేశ్​లో జరిగిన ఈ ఘటనలో చిన్నారి మృతి చెందింది. అసలేం జరిగిందంటే?..

three month old baby dies after poked 51 times
చిన్నారికి 51 సార్లు ఇనుపరాడ్డుతో కాల్చి వాతలు

మధ్యప్రదేశ్ భోపాల్​లో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నిమోనియా వ్యాధి బారిన పడిన చిన్నారికి మూఢనమ్మకంతో తెలిసీ తెలియని వైద్యం చేశారు తల్లిదండ్రులు. మూడునెలల వయసున్న పాప శరీరంపై 51 సార్లు ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు. దీంతో అభం శుభం తెలియని చిన్నారి పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి మరణించింది. వివరాల్లోకి వెళ్తే..

ఇదీ జరిగింది..
షాడోల్‌లోని సింగ్‌పుర్‌ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి రుచితా కోల్ నిమోనియా బారినపడింది. దీంతో పాపకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే ఆమె తల్లిదండ్రులు మూఢనమ్మకంతో ఆసుపత్రికి తీసుకెళ్లకుండా స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు పాపను చూపించారు. అక్కడ వ్యాధి తగ్గాలంటూ చిన్నారి పొట్టపై కాలిన ఇనుపరాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు. ఆ తర్వాత పాప పరిస్థితి మరింత దిగజారింది. ఓవైపు కాలిన గాయాలు.. మరోవైపు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం వల్ల అప్పుడు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే 15 రోజులు గడిచిపోయింది.

సరైన సమయంలో నిమోనియాకు చికిత్స అందకపోవడంతో ఇన్ఫెక్షన్‌ వ్యాపించి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పాపకు హడావుడిగా అంత్యక్రియలు పూర్తిచేశారు. శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఖననం చేసిన పాప మృతదేహాన్ని వెలికి తీసి శనివారం పోస్టుమార్టం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఘటనపై షాదోల్‌ జిల్లా కలెక్టర్‌ వందన వేధ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. "వాతలు పెట్టొద్దని స్థానిక అంగన్వాడీ కార్యకర్త చెప్పినా ఆ పాప తల్లి పట్టించుకోలేదు. గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిమోనియాకు ఇలాంటి 'చికిత్స'లు సర్వసాధారణమయ్యాయి. దీనిపై చర్యలు తీసుకుంటున్నాం" అని ఆమె తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భాజపా నేతలు.. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ను కోరారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.