ETV Bharat / bharat

Margadarsi మార్గదర్శిలో ఆడిటింగ్‌పై తెలంగాణ హైకోర్టు స్టే..

author img

By

Published : Apr 24, 2023, 10:28 PM IST

Updated : Apr 25, 2023, 6:32 AM IST

Telangana High Court stay on Auditing in Margadarsi: మార్గదర్శిలో ఆడిటింగ్‌పై తెలంగాణ హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఆడిటర్‌ను నియమించే పరిధి రిజిస్ట్రార్‌కు లేదన్న న్యాయస్థానం.... కేవలం మార్గదర్శిపైనే విచారణ ఎందుకన్నదానికి సమాధానమేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎలాంటి ఫిర్యాదుల ప్రస్తావనే లేదన్న న్యాయస్థానం ఆడిటర్‌ నియామకంతోపాటు తదనంతర చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 19కి వాయిదా వేసింది.

Margadarshi
మార్గదర్శి

మార్గదర్శిలో ఆడిటింగ్‌పై తెలంగాణ హైకోర్టు స్టే

Telangana High Court stay on Auditing in Margadarsi: మార్గదర్శి సంస్థకు చెందిన వ్యవహారాలన్నింటినీ ఆడిట్‌ చేయడానికి ప్రత్యేకంగా ఆడిటర్‌ను నియమిస్తూ ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల అమలును తెలంగాణ హైకోర్టు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకంగా ఒక చిట్‌ లేక కొన్ని చిట్‌ గ్రూపుల గురించి కాకుండా మొత్తం కంపెనీ సాధారణ వ్యవహారాలపై ఆడిట్‌ నిర్వహించడానికి ప్రాథమికంగా చట్టం అనుమతించదని పేర్కొంది.

ప్రాథమిక నివేదిక, ఆడిటర్‌ను నియమిస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్స్, ఆడిటర్‌ జారీ చేసిన నోటీసులు, ఇరుపక్షాల వారు సమర్పించిన గత తీర్పులన్నింటినీ పరిశీలించిన మీదట మార్గదర్శి పిటిషన్‌పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తేల్చి చెప్పింది. మార్గదర్శి డైరెక్టర్లకు ఆడిటర్‌ జారీ చేసిన నోటీసులతోపాటు గతంలో హైదరాబాద్‌ కార్యాలయంలో జరిపిన సోదాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ పరిధి ఉందని పేర్కొంది. అనుకూలమైన న్యాయస్థానాన్ని ఎంపిక చేసుకుంటున్నారన్న ఏపీ ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇదే మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యాపారానికి సంబంధించి పిటిషనర్లు ఈ హైకోర్టును ఆశ్రయించారని, పలు పిటిషన్‌లు ఇక్కడ పెండింగ్‌లో ఉన్నాయని.. అన్ని అంశాలపై హైకోర్టు తేల్చడం సబబుగా ఉంటుందని, అందువల్ల కేసు పూర్వాపరాలను పరిశీలిస్తామని పేర్కొంది.

ఏపీ ప్రభుత్వంతోపాటు ప్రత్యేకంగా నియమితులైన ఆడిటర్‌కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్‌ 19కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను గతంలో మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు జత చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు విచారణ నిమిత్తం ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మార్గదర్శి వ్యవహారాలపై ప్రైవేటు ఆడిటర్‌ నియామకంతోపాటు, ఆడిట్‌ నిర్వహించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ రిజిస్ట్రార్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై ఇటీవల సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌కుమార్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆడిటర్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన రిజిస్ట్రార్‌ చిట్‌ఫండ్‌ కంపెనీల్లో ఆడిట్‌ చేసే తనిఖీ అధికారులకు సాయం చేయడానికిగాను ఆడిటర్‌ సేవలను తీసుకుంటూ జనవరి 9న ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఐతే కోర్టు ముందుంచిన ప్రాథమిక నివేదికను పరిశీలిస్తే ఆడిటర్‌ తనిఖీ అధికారుల ప్రమేయం లేకుండానే తనంతట తానే ఆడిట్‌ చేసినట్లు ఉందని పేర్కొన్నారు.

ఈ ప్రశ్నకు సమాధానమేదీ?:ఆడిటర్‌ సమర్పించిన ప్రాథమిక నివేదికలో వ్యక్తిగత చర్చల విషయాన్ని పేర్కొన్నారని న్యాయమూర్తి ప్రస్తావించారు. ఆడిటర్‌ను తనిఖీ అధికారులకు సాయపడటానికి నియమించారని, అలాంటప్పుడు రిజిస్ట్రార్‌ అతనితో వ్యక్తిగత చర్చలు ఎందుకు జరపాల్సి వచ్చిందో తెలియడం లేదన్నారు. మార్గదర్శిపై కక్షసాధింపు చర్యలతో రిజిస్ట్రార్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారన్న మార్గదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలకు ఇది బలం చేకూరుస్తోందన్నారు. అంతేకాకుండా ఆడిట్, తనిఖీలు అన్నీ మార్గదర్శిలోనేనా లేదంటే ఏ ఇతర చిట్‌ఫండ్‌ కంపెనీలో అయినా నిర్వహిస్తున్నారా అనే ప్రశ్నకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది నుంచి స్పష్టమైన సమాధానం లేదన్నారు.

ప్రస్తుత కేసులో రికార్డులను పరిశీలిస్తే ఒక ప్రత్యేకమైన చిట్‌ లేదా చిట్‌ గ్రూపులకు చెందిన లావాదేవీలను ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ప్రాథమికంగా చూస్తే సెక్షన్‌ 61 (4) కింద మార్గదర్శికి చెందిన వ్యవహారాలపై సాధారణ ఆడిట్‌ నిర్వహించడానికి రిజిస్ట్రార్‌ తన అధికారాలను వినియోగించే పరిధి లేదని స్పష్టం చేశారు. సెక్షన్‌ 61(2) కింద ప్రైవేటు ఆడిటర్‌ను చిట్‌ ఆడిటర్‌గా రిజిస్ట్రార్‌ నియమించవచ్చా లేదా అనేదానిపై సందేహాలున్నాయని, దాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఫిర్యాదుల ప్రస్తావనేలేదు: ప్రాథమిక నివేదికలోగానీ, ఇతర ఉత్తర్వుల్లోగానీ మార్గదర్శి కంపెనీ, లేదంటే ఏదైనా చిట్, చిట్‌ గ్రూపుపై ఫిర్యాదులున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. చిట్‌ఫండ్‌ కంపెనీల్లో తనిఖీకి సాయం చేయడానికి ఆడిటర్‌ను నియమించినప్పటికీ, మార్గదర్శి మినహా ఏ ఇతర చిట్‌ఫండ్‌ కంపెనీలలో ఆడిట్‌ నిర్వహించలేదన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. సెక్షన్‌ 24 ప్రకారం చిట్‌ నిబంధనలను అమలు చేయడంలో మార్గదర్శి విఫలమైందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది పి.గోవిందరెడ్డి వాదనలు వినిపించినప్పటికీ దీనికి సంబంధించిన వివరాలను ఆడిటర్‌ సమర్పించిన ప్రాథమిక నివేదికలోగానీ, రిజిస్ట్రార్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లోగానీ పేర్కొనలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

అయినప్పటికీ ఈ అంశాలన్నింటిపై ఏపీ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసిన తరువాత పిటిషనర్‌కు అవకాశం ఇచ్చి పరిశీలిస్తామన్నారు. ఈ కారణాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక చిట్‌ లేదా చిట్‌ గ్రూపు ప్రస్తావన లేకుండా మార్గదర్శి కంపెనీ సాధారణ వ్యవహారాలను ఆడిట్‌ చేయడానికి ఆడిటర్‌ను రిజిస్ట్రార్‌ నియమించడాన్ని చట్టం అనుమతించదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్ల ఆడిటర్‌ నియామకం తదనంతర చర్యలన్నింటిని నిలిపివేస్తున్నట్లు పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌కుమార్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 25, 2023, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.