ETV Bharat / bharat

లైంగిక దాడి అంటే ఏమిటి?

author img

By

Published : Aug 7, 2021, 7:07 AM IST

లైంగిక దాడి అంటే ఏమిటి? అనే దానిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానానికి సహాయకుడుగా సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవేను నియమిస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

Bombay HC RAPE CASE
సుప్రీంలో విచారణ

లైంగిక దాడి విషయమై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారడంతో దీనిపై వచ్చిన అప్పీలుపై సహకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం కోర్టు సహాయకుడు (అమికస్‌ క్యూరీ)ని నియమించింది. సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవేను అమికస్‌ క్యూరీగా నియమిస్తున్నట్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈ నెల 24న తొలి కేసు కింద దీనిపై విచారణ జరపనున్నట్టు తెలిపింది.

ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే 2016 డిసెంబరులో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి తినడానికి ఏమైనా ఇస్తానన్న నెపంతో 12 ఏళ్ల బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఛాతీ భాగాన్ని చేతితో తడిమి, దుస్తులు విప్పేందుకు ప్రయత్నించాడు. ఆమె అక్కడ నుంచి తప్పించుకొంది. అనంతరం నిందితునిపై భారత శిక్షా స్మృతి, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కింది కోర్టు పోక్సో చట్టం కింద శిక్ష వేసింది.

దీనిపై ముద్దాయి అప్పీలు చేయగా బాంబే హైకోర్టు నాగ్‌పుర్‌ బెంచ్‌ మాత్రం స్పర్శ కాకపోతే (చర్మం..చర్మం తగలకపోతే) లైంగిక దాడి కిందకు రాదంటూ తీర్పు ఇచ్చింది. దుస్తులు వేసుకున్న ఉన్న బాలిక ఛాతీ భాగాన్ని తాకినందున దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని తెలిపింది. అందువల్ల పోక్సో చట్టం వర్తించదని తీర్పు చెప్పింది. పోక్సో చట్టం చట్టం కింద అయితే ఈ నేరానికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడి ఉండేది. నిందితుడు ఆ బాలిక గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాడని, అందువల్ల ఐపీసీ 354 సెక్షన్‌ ప్రకారం ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్టు ఈ ఏడాది జనవరి 19న తీర్పు ఇచ్చింది.

ఒకరి చర్మాన్ని ఒకరు తాకితేనే లైంగిక దాడి కిందకు వస్తుందంటూ ఇచ్చిన తీర్పుపై విమర్శలు రావడంతో అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ రంగంలో దిగారు. ఈ తీర్పు అమలు కాకుండా చూడాలని సుప్రీంకోర్టును కోరగా జనవరి 27న స్టే లభించింది. చర్మం.. చర్మం తాకితేనే లైంగిక దాడి కిందికి వస్తుందన్న విషయం పోక్సో చట్టంలోని సెక్షన్‌-8లో ఉందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. మునుపు ఎన్నడూ ఇలాంటి తీర్పు రాలేదని, దీనివల్ల ప్రమాదకరమైన పర్యవసానాలు ఉంటాయని అటార్నీ జనరల్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై అప్పీలు చేయాలని మహారాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌కు సూచించారు. శరీరాన్ని తడమడం లైంగిక వేధింపు కిందికి రాదంటూ పేర్కొనడాన్ని కూడా సవాలు చేస్తూ యూత్‌ బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా మరో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.

హైకోర్టు తీర్పులో ఏముంది?

ఎలాంటి చర్యలు లైంగిక వేధింపుల కిందికి వస్తాయి.. ఎలాంటి రావు అన్న విషయాలను కూడా హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. 'పోక్సో చట్టం కింద కఠినమైన శిక్షలు ఉన్నందున ఆరోపణలు కూడా తీవ్రమైనవే ఉండాలి. ఆధారాలు కూడా స్పష్టంగా ఉండాలి' అని హైకోర్టు పేర్కొంది.'12 ఏళ్ల బాలిక ఛాతీని తాకినట్టు మాత్రమే ఆరోపణలు వచ్చాయి. ఆమె ధరించిన టాప్‌ను తొలగించారా? అందులో చేయి దూర్చారా? ఛాతీని తాకారా? అన్నదానికి ఆధారాలేవీ లేవు. అందువల్ల ఇది లైంగిక దాడి అన్న నిర్వచనం పరిధిలోకి రాదు' అని తెలిపింది. లైంగిక దాడి అంటే ఏమిటో పోక్సో చట్టం ఇలా నిర్వచిస్తోంది. 'లైంగిక వాంఛతో పిల్లల మర్మాంగాలు, వెనుకభాగం, ఛాతీ భాగాలను తాకినా; ఆయా భాగాలను తాకించుకున్నా; అంగప్రవేశం లేనప్పటికీ ఇతరత్రా రూపాల్లో భౌతిక సంబంధాలు పెట్టుకున్నా అది లైంగిక దాడే' అని చట్టంలో ఉంది. 'భౌతిక సంబంధం' అంటే ఏమిటి అన్నదానిపై హైకోర్టు వివరణ ఇస్తూ 'ఇది చర్మం..చర్మం తాకడం'గానీ, ప్రత్యక్షంగా స్పృశించడంగానీ అవుతుందని తెలిపింది. అయితే ప్రస్తుత కేసులో ముద్దాయి అలా చేసినట్టు రుజువులు లేనందున పోక్సో చట్టం వర్తించదని పేర్కొంది. దీనిపైనే పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. సమస్య తీవ్రమైనది కావడంతో సర్వోన్నత న్యాయస్థానం అమికస్‌ క్యూరీని నియమించింది.

ఇదీ చూడండి: 'ట్రైబ్యునల్స్​ ఉండాలా? వద్దా?'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.