ETV Bharat / bharat

దొంగల భరతం పట్టిన ఎంపీ.. యాక్షన్ హీరోలా ఛేజింగ్.. తుపాకీ గురిపెట్టినా తగ్గేదేలే!

author img

By

Published : May 5, 2023, 10:45 PM IST

ఓ ఎంపీ ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరి చేసి.. పారిపోతున్న వారిని ఎనిమిది కిలోమీటర్లు చేధించి మరి బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Aurangabad MP caught three snatchers
ముగ్గురు దొంగలను పట్టుకున్న ఎంపీ సుశీల్ కుమార్​

మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీ చేసి.. పారిపోతున్న దొంగలను ఓ ఎంపీ సినిమా లెవెల్​లో ఛేజ్ చేసి పట్టుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బంది సహాయంతో ఎనిమిది కిలోమీటర్ల పాటు దొంగలను వెంబడించిన ఆ ఎంపీ.. చాకచక్యంగా వారిని అడ్డగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బిహార్​లో ఈ ఘటన జరిగింది. ఔరంగాబాద్ పార్లమెంట్​ సభ్యుడు సుశీల్ కుమార్​ సింగ్​.. ఇలా దొంగలను పట్టుకున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం.. బరున్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. సిరిస్ గ్రామానికి చెందిన సరిత కుమారి అనే మహిళ.. అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను చూసేందుకు జముహర్ మెడికల్ కాలేజీకి వెళ్లింది. అనంతరం బైక్​పైన తన భర్త రాజేష్ గుప్తాతో కలిసి తిరిగి వస్తోంది. ఆ సందర్భంలోనే ముగ్గురు దొంగలు సరిత మెడలో ఉన్న చైన్​ను లాక్కుని పారిపోయారు. దీంతో ఆ మహిళ బిగ్గరగా అరిచింది. అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న ఎంపీ సుశీల్​ కుమార్​ సింగ్.. ఘటనను గమనించారు. వెంటనే దొంగలు పారిపోతున్న వైపుగా వెళ్లమని డ్రైవర్​కు సూచించారు. అలా చాలా సేపు వారిని వెంబడించారు.

ఎంపీ కారు దొంగలకు దగ్గరగా వెళ్లగానే.. వారు సుశీల్​ కుమార్​ సింగ్​కు గన్ గురిపెట్టారు. తమ వెంటపడితే కాల్చేస్తామని బెదిరించారు. అయినా సుశీల్​ కుమార్​ ఏ మాత్రం బెదరలేదు. ఆ దొంగలను విడిచిపెట్టకుండా.. వారిని అలాగే వెంబడించారు. దాదాపు దొరికిపోయారు అనుకున్న సమయంలో ఎంపీ కారుకు ఓ ట్రక్ అడ్డు వచ్చింది. దీంతో అదే అదునుగా భావించిన దొంగలు.. ఎంపీ కారును ఓవర్​టేక్​ చేసి చాలా దూరం వెళ్లారు. అయినా పట్టువదలకుండా దొంగలను వెంబడించారు ఎంపీ సుశీల్​ కుమార్​ సింగ్​. చివరకు మధుపుర్ అనే​ గ్రామ సమీపానికి వెళ్లిన దొంగలు.. బైక్​ బురదలో కూరుకుపోవడం వల్ల కిందపడ్డారు.

దొంగలు బురదలో పడిపోవటాన్ని గమనించిన ఎంపీ.. వెంటనే కారు ఆపారు. ఎంపీని చూసిన ఆ ముగ్గురు దొంగలు వెంటనే లేచి పక్కనే ఉన్న పొలాల వైపు పరిగెత్తారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ బాడీగార్డ్​లు.. వారిని వెంబడిస్తూ పరిగెత్తారు. అనంతరం అరకిలోమీటర్ వరకు​ ఛేదించి దొంగలను పట్టుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు అప్పగించారు. నిందితులను టింకు కుమార్, ఆనంద్ కుమార్ ఠాకూర్​గా పోలీసులు గుర్తించారు. వీరంతా రోహ్​తాస్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ అకోధి గోలా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటారని తెలిపారు.

MP Sushil Kumar Singh caught three snatchers
దొంగలతో పోలీసులు, ఎంపీ (కళ్లజోడు పెట్టుకున్న వ్యక్తి)

"నేను పని మీద సాసారాంకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ముగ్గురు దొంగలు.. మహిళ మెడలో గొలుసును చోరీ చేసి పారిపోతున్నారు. వెంటనే నా వ్యక్తిగత సిబ్బంది సహాయంతో వారిని పట్టుకున్నాను. ఈ ఘటన బిహార్​ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏలా ఉన్నాయో తెలియజేస్తుంది. నీతీశ్​ కుమార్ ప్రభుత్వంలో దొంగలు భయం లేకుండా పట్టపగలే చోరీలు చేస్తున్నారు" అని ఎంపీ సుశీల్​ కుమార్​ సింగ్ తెలిపారు. బాధితురాలికి ఓ సోదరుడిగా సాయం చేశానని ఆయన వెల్లడించారు.

MP Sushil Kumar Singh caught three snatchers
దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు

అరెస్టయిన వారి నుంచి ఒక విదేశీ అధునాతన పిస్టల్, ఒక దేశీయ చేతి తుపాకీ​, ఏడు లైవ్ కాట్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ నుంచి లాక్కున్న చైన్ మాత్రం వారి నుంచి రికవరీ కాలేదని వారు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే రెండు ముక్కలుగా విరిగి పోయి చైన్ దొరికిందని పేర్కొన్నారు. అనంతరం దానిని మహిళకు అందించినట్లు పోలీసులు వెల్లడించారు. దొంగలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.