ETV Bharat / bharat

కలియుగ 'విశ్వకర్మ'.. ఉలితో శిలలకు ప్రాణం.. కళాఖండాలకు ప్రపంచమే ఫిదా!

author img

By

Published : Nov 27, 2022, 5:01 PM IST

Updated : Nov 27, 2022, 7:23 PM IST

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​కు చెందిన ఓ కళాకారుడు తన హస్తకళతో అందరి మన్ననలు పొందుతున్నాడు. రాళ్లపై విగ్రహాలు చెక్కుతూ.. దేశ, విదేశాల్లో తన ప్రతిభను చాటుతున్నాడు. వివిధ రకాల బొమ్మలను, ప్రముఖుల విగ్రహాలను చెక్కి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు.

man Carving idols on rocks
రాళ్లపై బొమ్మలను చెక్కుతున్నకళాకారుడు

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​కు చెందిన ఓ కళాకారుడు రాళ్లపై బొమ్మలను అద్భుతంగా చెక్కుతున్నాడు. తన అసమాన ప్రతిభతో అందరినీ మెప్పిస్తున్నాడు. అచ్చం నిజమైన వాటిలాగే శిలలపై శిల్పాలు చెక్కుతూ... అందరితో ఔరా..! అనిపిస్తున్నాడు. తన హస్తకళ నైపుణ్యంతో దేశ, విదేశాల్లోను చక్కని గుర్తింపు పొంది అభినందనలు అందుకుంటున్నాడు.

Deepak Vishwakarm life like statues
దీపక్​ విశ్వకర్మ చెక్కిన విగ్రహాలు

దీపక్​ విశ్వకర్మ ఓ శిల్పి. రాళ్లపై అద్భుతంగా విగ్రహాలను చెక్కుతాడు. మనుషులను చూసి వారిని అచ్చుగుద్దినట్లుగా రాళ్లపై వారి రూపాన్ని చెక్కడం అతడి ప్రత్యేకత. ఇప్పటి వరకు అనేక విగ్రహాలను చెక్కాడు. మహాత్మ గాంధీ, బి.ఆర్.అంబేడ్కర్​, సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్​, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీ, అమితాబ్ బచ్చన్​ వంటి ప్రముఖుల రూపాలను సుందరంగా రాళ్లపై చెక్కాడు.

Deepak Vishwakarm life like statues
దీపక్​ విశ్వకర్మ చెక్కిన విగ్రహాలు

దేవుళ్ల ప్రతిరూపాలను సైతం అద్భుతంగా చెక్కగలడు దీపక్​. కేవలం మన దేశమే కాకుండా విదేశీయుల డిమాండ్​ మేరకు​ చిన్న సైజ్​ విగ్రహాలను తయారు చేసి ఫ్రాన్స్, స్పెయిన్, ప్యారిస్, దుబాయ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. వారి అభిరుచుల ఆధారంగా ఇంట్లో, పార్కుల్లో, హోటళ్లలో అలంకరణ కోసం ఆర్డర్​పై అనేక కళాఖండాలను సరఫరా చేస్తున్నాడు.

Deepak Vishwakarm life like statues
దీపక్​ విశ్వకర్మ చెక్కిన విగ్రహాలు

"చిన్నప్పటి నుంచి విగ్రహాల తయారీ అంటే నాకు చాలా ఇష్టం. అదే క్రమంగా అభిరుచిగా మారింది. నేను చదువుకునే సమయంలో బ్లాక్‌బోర్డ్‌పై అక్షరాలు రాసే బదులు వేరొకరి బొమ్మని వేసేవాడిని. చదువుపై ఆసక్తి ఉండేది కాదు. మా కుటుంబంలో ఐదు తరాల వారంతా విగ్రహ శిల్పులే. అదే నాకు వారసత్వంగా వచ్చింది."
-దీపక్ విశ్వకర్మ, శిల్పి

దీపక్ విశ్వకర్మ.. తన కళతో రాష్ట్రపతి మన్ననలు​ సైతం అందుకున్నాడు. ఈ మధ్య 4.5 కిలోల రాయితో నీటిలో తేలియాడే పడవను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అందులో సీతారాములు, లక్ష్మణుడు కూర్చొని ఉంటారు. ఈ విగ్రహాన్ని చూసిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. దీపక్​ను ప్రత్యేకంగా అభినందించారు.

Last Updated : Nov 27, 2022, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.