ETV Bharat / bharat

ఈ ఏడాది 7.5 శాతం ఆర్థిక వృద్ధి.. లక్షన్నర కోట్ల డాలర్ల పెట్టుబడులు!

author img

By

Published : Jun 23, 2022, 7:01 AM IST

Narendra Modi BRICS: భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విలువ 2025 కల్లా లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతిరంగంలో నవకల్పనకు మద్దతిస్తున్నామన్నారు. 'బ్రిక్స్‌ వాణిజ్య వేదిక' సమావేశంలో మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.

narendra modi brics
narendra modi brics

Narendra Modi BRICS: భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. బుధవారం ఆయన 'బ్రిక్స్‌ వాణిజ్య వేదిక' సమావేశంలో వీడియో సమావేశం విధానంలో ప్రసంగించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు సైతం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విలువ 2025 కల్లా లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధాని.. నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ కింద లక్షన్నర కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రతిరంగంలోనూ నవకల్పనకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. "మేం ఈ ఏడాది 7.5 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. ఈ స్థాయి వృధ్ధి భారత్‌ను అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చేస్తుంది" అని అన్నారు.

ప్రపంచ ఆర్థిక సవాళ్లకు ఆంక్షలే కారణం: పాశ్చాత్య దేశాలు తమ దేశంపై విధించిన రాజకీయ ప్రేరేపిత ఆంక్షలు వ్యాపార కార్యకలాపాల తగ్గుదల, నిరుద్యోగం పెరిగిపోవడం, ముడి సరకుల కొరత, ప్రపంచ ఆహార భద్రతకు భరోసా కల్పించడంలో ఇబ్బందులు వంటి ప్రపంచ ఆర్థిక సవాళ్లకు కారణం అవుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. బ్రిక్స్‌లోని సభ్య దేశాలతో వాణిజ్యం, చమురు ఎగుమతులకు సంబంధించి కొత్త మార్గాలను అన్వేషించే ప్రక్రియలో రష్యా ఉందని చెప్పారు. బ్రిక్స్‌ దేశాల బ్యాంకులు అనుసంధానం అయ్యేందుకు రష్యా ఆర్థిక సమాచార వ్యవస్థ తెరిచి ఉందని వెల్లడించారు. "రష్యా వ్యూహం మారబోదని నేను స్పష్టం చేయదలచుకుంటున్నాను. అదే సమయంలో మా సాంకేతిక, శాస్త్రీయ, ఆర్థిక సంభావ్యతను బలోపేతం చేసుకుంటూనే ఉంటాం. పరస్పర ప్రయోజనాలను గౌరవించుకునే సూత్రాలపై అందరు సరైన భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని పుతిన్‌ స్పష్టంచేశారు.

ప్రపంచ ప్రజలకు హాని: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిందంటూ రష్యాపై అమెరికా, ఐరోపా సంఘం (ఈయూ) ఆంక్షలు విధించడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా విధిస్తున్న ఈ ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు హాని కలిగిస్తాయని చెప్పారు. క్వాడ్‌ (అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌), అకస్‌ (అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా) కూటముల పేర్లను నేరుగా ప్రస్తావించకున్నా వాటిపై విమర్శలు గుప్పించారు. "ఆధిపత్యం, ముఠా రాజకీయాలు, బృందాలుగా విడిపోయి ఘర్షణ పడడం వంటివాటితో శాంతి, స్థిరత్వం వంటివి సాధించలేమని చరిత్ర చెబుతోంది" అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం మానవత్వానికి సంబంధించి ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్నారు. అమెరికా, ఈయూలు రష్యాపై విధిస్తున్న ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడతాయని ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఆంక్షలు అనేవి రెండు వైపులా పదునున్న కత్తులు వంటివని, కచ్చితంగా బెడిసికొడతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గర్జించని పులి ఉద్ధవ్‌.. 'సాఫ్ట్‌' వైఖరే కొంపముంచిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.