ETV Bharat / bharat

పెళ్లిలోనే వరుడికి కార్డియాక్ అరెస్ట్.. ఏడడుగులు వేస్తూ కుప్పకూలిన వైద్యుడు

author img

By

Published : Feb 11, 2023, 12:13 PM IST

వివాహం జరుగుతుండగా ఓ వైద్యుడు కార్డియాక్ అరెస్టుతో కుప్పకూలాడు. ఏడడుగులు వేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది. మరోవైపు, యాంటీ ఫైలేరియా మందులు తీసుకున్న చిన్నారుల్లో 40 మంది అస్వస్థతకు గురయ్యారు.

groom-died-of-heart-attack-in-marriage-in-uttarakhand
Etv పెళ్లిలోనే వరుడికి కార్డియాక్ అరెస్ట్

ఉత్తరాఖండ్​లో విషాదం జరిగింది. వివాహం జరుగుతుండగానే ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఏడడుగులు వేస్తుండగానే అతడు కుప్పకూలాడు. పెళ్లికి వచ్చినవారు ఏమైందోనని గ్రహించేసరికే వరుడు ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే...
నందపుర్ కఠ్​గరియాకు చెందిన సమీర్ ఉపాధ్యాయ్(30) అనే వైద్యుడు.. స్థానిక మ్యాట్రిక్స్ ఆస్పత్రిలో డెంటిస్ట్​గా పనిచేస్తున్నాడు. రానీఖేత్​లోని ఓ యువతితో ఆయనకు వివాహం నిశ్చయమైంది. శుక్రవారం అతడి వివాహానికి ముందు హల్ద్వానీ నుంచి రానీఖేత్ వరకు ఊరేగింపు నిర్వహించారు. కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగితేలుతుండగా.. వివాహ తంతు మొదలుపెట్టారు పురోహితులు. అనంతరం వధూవరులతో ఏడడుగులు వేయించారు. ఈ సమయంలోనే సమీర్​కు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే సమీర్​ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పడికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఔషధాలతో 40 మంది చిన్నారులకు అస్వస్థత..
ఝార్ఖండ్​లోని సాహిబాగంజ్​లోని ఉధ్వా బ్లాక్​లో ఫైలేరియా (బోదవ్యాధి) ఔషధాలు తీసుకున్న 40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు పాఠశాల సిబ్బంది బలవంతంగా యాంటీ-ఫైలేరియా మందులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటిని తిన్న చిన్నారులకు అనారోగ్యం తలెత్తింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఏడు అంబులెన్సులు పిలిపించి.. చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది.

students Illness for medicine
ఔషధాలతో 40 మంది చిన్నారులకు అస్వస్థత..

బాబాటోలా ప్రైమరీ స్కూల్​లో ఈ ఘటన జరిగింది. ఔషధాలు తీసుకోకపోతే కొడతామని విద్యార్థులను పాఠశాల సిబ్బంది బెదిరించినట్లు తెలుస్తోంది. ఇవి తిన్న వెంటనే కొందరికి కడుపు నొప్పి సమస్య వచ్చింది. మరికొందరు వాంతులు చేసుకున్నారు. కొందరికి తలనొప్పి రాగా.. ఇంకొందరు స్పృహతప్పి పడిపోయారు. తొలుత స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు.

students Illness for medicine
ఔషధాలతో 40 మంది చిన్నారులకు అస్వస్థత..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.