ETV Bharat / bharat

తీగల వంతెన ప్రమాదంపై సిట్ దర్యాప్తు.. 9 మంది అరెస్ట్​

author img

By

Published : Oct 31, 2022, 7:35 PM IST

Morbi Bridge Collapse : గుజరాత్ మోర్బీలో తీగల వంతెన కూలి 134 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పరిశీలించనున్నట్లు గుజరాత్‌ సీఎంఓ వెల్లడించింది.

morbi bridge collapse
morbi bridge collapse

Morbi Bridge Collapse : గుజరాత్‌లో తీగల వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు రాజ్​కోట్ ఐజీ అశోక్​ యాదవ్. అరెస్ట్ చేసిన వారిలో వంతెన నిర్వహణ సంస్థ ఒరేవాకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టికెట్ క్లర్క్స్, ఇద్దరు కాంట్రాక్టర్లు, ముగ్గరు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెలికితీత చర్యల్లో పోలీసులు, స్థానికులు సహాయపడ్డారని వివరించారు.
ఆదివారం రాత్రి జరిగిన మోర్బీ దుర్ఘటనలో 134 మంది ప్రాణాలు కోల్పోగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా సాగుతున్నాయి.

ప్రధాని మోదీ భావోద్వేగం..
గుజరాత్‌లో తీగల వంతెన ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పరిశీలించనున్నట్లు గుజరాత్‌ సీఎంఓ వెల్లడించింది. మరోవైపు.. సర్దార్ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతిని పురస్కరించుకుని మాట్లాడిన ప్రధాని.. భావోద్వేగానికి లోనయ్యారు. తాను కేవడియాలోనే ఉన్నప్పటికీ తన మనసంతా మోర్బీ బాధితుల గురించే ఆలోచిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుండె నిండా భరించలేని బాధ ఉన్నా తప్పక విధులు నిర్వహించాల్సి వస్తోందని భావోద్వేగానికి గురయ్యారు.

గుజరాత్ దుర్ఘటనపై ప్రపంచ దేశాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ప్రార్థించారు. ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి కలిగించిందన్న సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

కారణం ఇదే..
దీపావళి సెలవులతో పాటు ఆదివారం భారీగా పర్యాటకులు రావడం వల్లే గుజరాత్‌ మోర్బీ నగరంలోని బ్రిటిష్ కాలం నాటి తీగల వంతెన కూలిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నారని తెలిపారు. తీగల వంతెన కూలడానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణాలుగా కన్పిస్తున్నాయి. బ్రిడ్జిపై కొందరు ఆకతాయిలు ఎగురుతున్న దృశ్యాలు బయటకు రాగా.. కూలడానికి, వారి అత్యుత్సాహమే కారణమని భావిస్తున్నారు.

వంతెన నిర్వహణ పనులు చేపట్టిన ఒరెవా గ్రూప్‌ నిర్లక్ష్యం కూడా దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది. నిర్మాణ రంగంలో ఎలాంటి అనుభవంలేని ఒరెవా గ్రూపు 1922 నాటి వేలాడే వంతెన పునరుద్ధరణ, నిర్వహణ పనులను మోర్బీ పురపాలక శాఖ నుంచి తీసుకుంది. మరమ్మతులకు కనీసం 8 నుంచి 12 నెలలు సమయం పడుతుందని.. ఒప్పంద పత్రంలో పేర్కొంది. కానీ చెప్పిన గడువు కంటే ముందే హడావుడిగా వంతెనను పునఃప్రారంభించింది. మోర్బీ పురపాలక సంస్థ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకముందే పెద్ద ఎత్తున పర్యటకులను వంతెనపైకి అనుమతించింది. ఆ బరువును మోయలేకే వంతెన కుప్పకూలి ఉంటుందని అనుమానిస్తున్నారు. వంతెనను తమకు తెలియకుండానే పునఃప్రారంభించినట్లు మోర్బీ పురపాలకశాఖ చీఫ్‌ సందీప్ ఝాలా తెలిపారు. అందువల్లే వంతెన భద్రతను తనిఖీ చేయలేకపోయినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి: కేబుల్ వంతెన ప్రమాదం కేసులో 9 మంది అరెస్టు

తీగల వంతెన విషాదం.. భాజపా ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.