ETV Bharat / bharat

రాష్ట్రపతి ఎన్నికలకు 115 నామినేషన్లు.. పోటీలో ఎంత మంది?

author img

By

Published : Jun 30, 2022, 8:40 AM IST

President election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్​ గడువు ముగిసింది. మొత్తం 115 నామినేషన్లు దాఖలు కాగా.. 28 తిరస్కరణకు గురయ్యాయి. మరికొన్నిటిని గురువారం పరిశీలిస్తారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా కేరళ నుంచి బుధవారం శ్రీకారం చుట్టారు. తమిళనాడుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నూర్​ మహమ్మద్​ మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇప్పటివరకు ఆయన 38 ఎన్నికల్లో బరిలో నిలిచారు.

tamilnadu
రాష్ట్రపతి ఎన్నికలు

President election 2022: వచ్చే నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి బుధవారం నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. మొత్తం 115 పత్రాలు దాఖలయ్యాయి. అందులో 28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి గురువారం పరిశీలిస్తారు. అందులో నిబంధనల ప్రకారం దాఖలు చేయని వాటిని తిరస్కరించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించడం, మరో 50 మంది బలపరచడం తప్పనిసరి. ఇంతమంది మద్దతు కూడగట్టడం సామాన్య అభ్యర్థులకు సాధ్యం కాదు కాబట్టి చివరికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మాత్రమే బరిలో మిగిలే అవకాశం ఉంది.

కేరళ నుంచి సిన్హా ప్రచారం
రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా కేరళ నుంచి బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో భాజపాకు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానం కూడా లేకపోవడంతో ఇక్కడి నుంచి తనకు ఎక్కువ ఓట్లు దక్కుతాయని ఆయన ఆశిస్తున్నారు. ఈమేరకు సిన్హా తిరువనంతపురంలో వివిధ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులను కలిసి మద్దతు కోరారు.

tamilnadu
నూర్​ మహమ్మద్​
tamilnadu
నూర్​ మహమ్మద్​ నామినేషన్​

తమిళనాడుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నూర్​ మహమ్మద్​ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కోయంబత్తూరు సుందరపురంకు చెందిన నూర్​.. స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ, పార్లమెంటరీ, స్థానిక సంస్థలు ఇలా వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పటివరకు 38 ఎన్నికల్లో నూర్​ బరిలో నిలిచారు. తాజాగా మంగళవారం దిల్లీలోని రిటర్నింగ్​ ఆఫీసర్​ కార్యాలయంలో రాష్ట్రపతి ఎన్నికలకు ఆయన నామినేషన్​ సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థులకు ప్రజలు అవకాశం ఇస్తారని తనకు నమ్మకం ఉందని.. అందుకే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు నూర్​ మహమ్మద్.

ఇదీ చూడండి : 'గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌.. ఇకనుంచి 'కుటుంబ సర్వనాశన ట్యాక్స్‌''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.