ఓటు వేయడానికి వెళ్లాలంటే గుర్రాలే దిక్కు - పోలింగ్ బూత్ కోసం గిరిజనుల ఆందోళన - Tribal Protest for Polling Booth

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 1:53 PM IST

thumbnail

Tribal Protest for Polling Booth : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా స్వగ్రామంలో ఓటు వేయలేకపోతున్నామని అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో గిరిజనులు నిరసన చేపట్టారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక పోలింగ్‌బూత్‌ను ఏర్పాటు చేయాలని చీమలపాడు పంచాయతీ శివారు గ్రామాల గిరిజనులు ధర్నాకు దిగారు. ప్రతిసారీ ఎన్నికల్లో ఓటు వేయడానికి గుర్రాలపై కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

Lok Sabha Elections 2024 : జెడ్. జోగింపేటలో పోలింగ్​ కేంద్రం ఏర్పాటు, నేరేడుబందకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండు చేస్తూ గిరిజనులు నిరసన తెలిపారు. ఆజేయ పురం, జీలుగులోవ, నేరేడుబంద, రాయిపాడు, పెదగరువు, రొచ్చుపనుకు, కడగెడ్డ, బంగారుబందల, తాడిపర్తి గిరిజన గ్రామాల్లో 500 మంది వరకు ఓటర్లు ఉన్నారు. వీరంతా మైళ్ల దూరం కాలినడకన ములకలాపల్లి వెళ్లి ఓటేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు చెప్పారు. వీరందరికీ జెడ్. జోగిం పేట కూడలిగా ఉంటుందని, అక్కడ ప్రాథమిక పాఠశాల భవనం, తారు రోడ్డు, విద్యుత్తు, నెట్ సదుపాయం ఉందని, పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. పొట్టిదొర, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచిన నాయకులు గిరిజనుల భూములను తక్కువ ధరలకే కొని రియల్‌ఎస్టేట్‌ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. తమకు మాత్రం కనీస అవసరాలు కల్పించటం లేదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.