గుంతల రోడ్డుకు ప్రారంభోత్సవం - నవ్వుకుంటున్న జనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 7:21 PM IST

thumbnail

Potholed Road Inauguration in Mangalagiri: ఆరు నెలల కిందటే రోడ్లు వేశారు కానీ ఏమైందో తెలియదు ప్రారంభోత్సవం మాత్రం చేయలేదు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్నాయని హడావుడిగా ఆ రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్​ నెలకొంది. ఆ రోడ్డు ప్రారంభోత్సవాన్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే - గుంటూరు జిల్లా మంగళగిరిలో రెండేళ్ల క్రితం రహదారి విస్తరణ, ఆధునీకరణ పనులు మొదలు పెట్టారు. ఆరు నెలల కిందట పనులన్నీ పూర్తయ్యాయి. పూర్తయిన కొన్ని రోజులకే రోడ్డుపై గుంతలు పడ్డాయి. కోట్ల రూపాయలతో నిర్మించి గుంతలు పడ్డ రహదారిని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గురువారం ప్రారంభించారు. గుంతలు పూడ్చకుండానే రోడ్డును ప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కనీసం రోడ్డుపై పడిన గుంతలను పూడ్చకుండానే ప్రారంభం ఎలా చేస్తారని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీసం చూసుకోరా అని ప్రజలు నవ్వుకుంటున్నారు. 13 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన రహదారి కనీసం 13 నెలలైనా లేదని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే రోడ్డు గుంతల మయంగా మారిందని ప్రతిపక్షాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం ఇలా హడావుడిగా ప్రారంభోత్సవాలు చేసి ఓట్లు అడిగేందుకు సిద్ధమవుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.