ETV Bharat / state

ఆర్థిక సాయం పెంచుతున్నట్లు బిల్డప్​ - లబ్దిదారుల కుదింపు - ఇవే జగన్​ మార్క్​ ఐడియాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 2:01 PM IST

Updated : Jan 23, 2024, 3:30 PM IST

ysrcp_govt_stopped_kalyana_mitra
ysrcp_govt_stopped_kalyana_mitra

YSRCP Govt Stopped Kalyana Mitra: బటన్లు నొక్కుతున్నట్టు బిల్డప్‌ ఇవ్వాలి, ఆర్థిక సాయం పెంచినట్లు ప్రచారం చేసుకోవాలి. ఖర్చు మాత్రం కాగితాల్లోనే కనిపించాలి. అదెలా సాధ్యమని అనుమానం కలిగిందా. జగన్‌ మార్క్‌ సంక్షేమంలో ఇలాంటి ఐడియాలు కోకొల్లలు. పెళ్లి కానుక పథకం అమల్లోనూ ఇలాగే చేశారు. ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ఆశలు కల్పించి లబ్దిదారుల సంఖ్యను కుదించారు. జీతం పెంచుతామంటూ కల్యాణమిత్రలతో పాలాభిషేకాలు చేయించుకుని ప్రచార ఫలం దక్కాక వాళ్లను నిర్థాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు.

ఆర్థిక సాయం పెంచుతున్నట్లు బిల్డప్​ - లబ్దిదారుల కుదింపు - ఇవే జగన్​ మార్క్​ ఐడియాలు

YSRCP Govt Stopped Kalyana Mitra: మాట తప్పను మడమ తిప్పనంటూ ప్రతీసభలో సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటారు సీఎం జగన్‌. కానీ, కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల అమల్లో ఆయన మాట, మడమ అష్టవంకర్లూ తిప్పేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదింటి ఆడపిల్ల పెళ్లికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ప్రవేశపెట్టింది.

పెళ్లి ఖర్చులకు డబ్బు చాలదని, తాను అధికారంలోకి రాగానే, పెళ్లికానుక పెంచి అమలు చేస్తానని జగన్‌ పాదయాత్రలో ఊదరగొట్టారు. 2019 సెప్టెంబర్‌లో జరిగిన మంత్రివర్గ భేటీలో కల్యాణమిత్ర పథకానికి 750 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2020 ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తామని ఉత్తర్వులూ ఇప్పించారు.

ఇంతవరకూ కాగితం ఖర్చే కదా. ప్రక్రియ వేగంగా జరిగిపోయింది. ఆ తర్వాతే జగన్‌ ఉత్తచేతులు చూపించారు. 2019మార్చి నుంచి అక్టోబర్‌ వరకూ 70 వేల మంది కల్యాణమస్తు పథకానికి దరఖాస్తు చేసుకుంటే వైఎస్సార్​సీపీ సర్కార్‌ లబ్దిదారులకు పైసా ఇవ్వలేదు. ఆ తర్వాత కరోనా సాకుతో దరఖాస్తులు తీసుకోవడమే ఆపేశారు. మరి పథకం కోసం కేటాయించిన 750 కోట్ల రూపాయల బడ్జెట్‌ ఎటుపోయిందో జగనన్నకే తెలియాలి.

పోనీ కరోనా ముగిసిన తర్వాతైనా అమలు చేశారా అంటే అదీలేదు. మరో ఏడాదిన్నర పాటు కాలయాపన చేశారు. పెళ్లికానుక పథకం అమలు చేయాలంటూ కొందరు మైనార్టీలు కోర్టుకెక్కారు. అప్పుడుగానీ జగన్‌కు చేతులు రాలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో కల్యాణమస్తు పథకం అమలుకు సిద్ధమయ్యారు. అందులోనూ జిత్తులు ప్రదర్శించారు.

2019లో తన హయాంలోనే జీవో ఇచ్చామనే సంగతి మర్చిపోయి మళ్లీ కొత్తగా 2022 సెప్టెంబర్‌లో కల్యాణమస్తు , షాదీతోఫా పేరుతో జీవో జారీ చేశారు. అక్టోబర్‌ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. అంటే 2019 జూన్‌ నుంచి 2022 సెప్టెంబర్‌ వరకూ వివాహాలు చేసుకున్న వారికి పెళ్లికానుక ఎగ్గొట్టారు. సగటున ఏటా లక్ష దరఖాస్తులు లెక్కవేసినా 2022 సెప్టెంబర్‌ నాటికి రెండున్నర లక్షల మందికి దాదాపుగా 1800 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందకుండా చేశారు.

తెలుగుదేశం హయాంలో పెళ్లిరోజు 20శాతం, ఆ తర్వాత నెలకు మిగతా 80% ఆర్థిక సాయం అందించేవారు. ఇపుడు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం 3నెలలకోసారి సాయం విడుదల చేస్తోంది. కల్యాణమస్తు పథకం అమల్లోకి తెచ్చిందే ఆలస్యం, అందులోనూ అర్హులకు జగన్‌ మార్క్ కొర్రీలు వేసి, లబ్దిదారుల్ని తగ్గించుకున్నారు. ఆదాయ పరిమితి, వ్యవసాయభూమి, పట్టణాల్లో ఇంటి విస్తీర్ణం, విద్యుత్తు వినియోగం 300 యూనిట్లు ఇలా, 6 దశల నిబంధనలు తెచ్చారు.

ఈ నిబంధనల వల్ల లబ్దిదారుల సంఖ్య భారీగా తగ్గింది. 2018-19 మధ్య 83 వేల మందికి పెళ్లికానుక అందితే, 2022అక్టోబర్‌ నుంచి 2023 సెప్టెంబర్‌ మధ్య ఏడాది కాలంలో కల్యాణమస్తు పథకం కింద ఆర్థిక సాయం అందింది. కేవలం 46 వేల మందికే. అంటే టీడీపీ హయాంతో పోలిస్తే 55.4 శాతం మాత్రమే వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో సాయం అందింది.

ఇక వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న మరో నిబంధనతో ముస్లింలు తీవ్రంగా నష్టపోయారు. తెలుగుదేశం హయాంలో దాదాపు 50 వేల మంది ముస్లింలకు, 200 కోట్ల రూపాయల మేర షాదీ తోఫా కానుక అందింది. వైఎస్సార్​సీపీ హయాంలో ఇప్పటివరకూ 5వేల 114 మంది ముస్లింలకు మాత్రమే షాదీతోఫా అందింది. అంటే టీడీపీ హయాంతో పోలిస్తే, ఇప్పుడు సాయం అందిన ముస్లింల సంఖ్య 12.6 శాతమే.

"ఇంతా పెద్ద వాగ్దానం ఇచ్చి మీరు ఎందుకు అమలు చేయడం లేదని వ్యాజ్యం వేసినప్పుడు మా దగ్గర నిధులు లేవని చేతులేత్తేశారు. కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత అప్పటికప్పుడు జీవో కాపీలు తీసుకువచ్చి న్యాయస్థానంలో అందించారు. ముస్లింలను వెన్నుపోటు పొడిచి, పెద్ద పెద్ద అబద్దాలు చెప్తున్నారు." -షిబ్లీ, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేత

ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వంలో అమలైన పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చినప్పుడు బకాయిలూ చెల్లిస్తుంది. జగన్‌ మాత్రం పాతలబ్దిదారులకు పంగనామాలు పెట్టారు. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చేనాటికి 17వేల 709 మంది లబ్ధిదారులకు 68 కోట్లరూపాయల మేర పెళ్లికానుక ప్రోత్సాహకం పెండింగ్‌లో ఉంది. అది కూడా మంజూరు చేయలేదు. ఇక కల్యాణమిత్రలనూ జగన్‌ నమ్మించి మోసం చేశారు.

ఇలా హామీలిచ్చి ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయించుకున్న జగన్‌ ఆ తర్వాత వారిని విధుల నుంచి తొలగించారు. పెళ్లిళ్ల నమోదు కోసం 1800 మంది డ్వాక్రా మహిళల్ని కల్యాణ మిత్రలుగా గత ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి ఏడాది బకాయిలు అన్నీ కలిపి 1800 కోట్ల రూపాయల వరకూ ఇవ్వాల్సి ఉండగా, ఒక్క రూపాయీ ఇవ్వలేదు. పైగా కల్యాణమిత్రల్ని తొలగించి ఉపాధికి గండి కొట్టారు. తమను కొనసాగించాలని కల్యాణ మిత్రలు గొంతుచించుకున్నా జగన్‌ సర్కార్ మనసు కరగలేదు.

Last Updated :Jan 23, 2024, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.