ETV Bharat / state

విశాఖ డ్రగ్స్​ కేసులో వైసీపీ నేతల పాత్ర ఏంటి - కంటైనర్​ తెరవకుండా యత్నించారా? - YCP LEADERS IN VIZAG DRUGS CASE

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 12:23 PM IST

YCP Leaders Attempt not to Open Drugs Container: విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం విశాఖ పోర్టుకు కంటైనర్​ తెరిచేందుకు వచ్చిన సీబీఐ అధికారులను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కంటైనర్​ను తెరవకుండా వైసీపీ పెద్దలు ఒత్తిళ్లు తీసుకొచ్చారని సమాచారం.

YCP_Leaders_Vizag_Drugs_Container
YCP_Leaders_Vizag_Drugs_Container

YCP Leaders Attempt not to Open Drugs Container : విశాఖలో సీజ్ చేసిన డ్రగ్స్ కంటైనర్ ఆంధ్రప్రదేశ్​లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విశాఖ పోర్టుకు ఈ నెల 16వ తేదీన చైనా నౌక ద్వారా కంటైనర్‌ విశాఖ వచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అదే రోజున దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులైన ఉమేశ్‌, ఆకాష్‌ కుమార్‌ మీనా, గౌరవ్‌ మిట్టల్​ స్థానికంగా కస్టమ్స్‌ అధికారుల సాయంతో కంటైనర్​ను తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే సీబీఐ అధికారులకు ఆటంకాలు కలించడానికి వైసీపీ నేతలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. లక్షల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ దొరక్కుండా అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారని సమాచారం.

వైసీపీ పెద్దల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటైనర్​ను తెరవకుండా ప్రయత్నించినట్లు సమాచారం. కంటైనర్ తెరిచి నమూనాలు సేకరించి పరీక్షించే సమయంలోనూ సీబీఐకి సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించినట్లు తెలుస్తోంది.

ఈ కంటైనర్‌ సంధ్యా ఆక్వా పేరుతో బుక్‌ అయింది. దీంతో ఎన్‌డీపీఎస్‌ చట్టం (Narcotic Drugs and Psychotropic Substances Act) ప్రకారం సెక్షన్‌ 29 రెడ్‌విత్‌ 8, 23, 38 ప్రకారం సంధ్య ఆక్వా ఎక్స్‌ పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహా, గుర్తు తెలియని మరికొందరిపైనా కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోర్టు ఉద్యోగులు సంఘటనా స్థలం వద్ద గుమిగూడటంతో కేసు విచారణలో కొంత ఆలస్యం అయినట్లు సీబీఐ ఎఫ్​ఐఆర్​లో తెలిపింది. కంటైనర్ సీల్‌ తీసినప్పటి నుంచి నాట్కో పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు, తిరిగి సీల్‌ వేయడం వరకు అన్నీ వీడియోగ్రఫీ చేయించారు.

విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసు - కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు - Visakhapatnam Drugs Container Case

వీటన్నింటికీ జగన్‌ ప్రభుత్వమే కారణమా: మరోవైపు రెండు సంవత్సరాల క్రితం విజయవాడ చిరునామాతో అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో దొరకడం సంచలనమైంది. 2021 సెప్టెంబరులో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో 21 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. వాటిలో పెద్ద మొత్తంలో హెరాయిన్‌ బయటపడింది. అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన కంటైనర్లు విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్‌ సంస్థకి చెందినదిగా గుర్తించారు. టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో డ్రగ్స్‌ రవాణా చేసినట్లు తేలింది. అది రాష్ట్రంలోని ఓ వైఎస్సార్సీపీ నేత బినామీకి చెందిన కంపెనీగా ఆరోపణలొచ్చాయి. తాజాగా విశాఖలో పట్టుబడిన డ్రగ్స్‌ కంటైనర్ సంస్థ సంధ్య ఆక్వా కంపెనీ కొవిడ్‌ టైమ్​లో సీఎం సహాయనిధికి 50 లక్షల రూపాయలు ప్రకటించడం గమనార్హం.

తాజాగా విశాఖ పోర్టుల లక్షల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్​ని సీజ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ తమ కలల రాజధానిగా చెప్పుకుంటున్న విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్​ సీజ్ చేయడంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఎన్నికల తరుణంలో లక్షల కోట్ల రూపాయల విలువైన వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

రాష్ట్రంలో ఇప్పటికే నిత్యం ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయికి బానిసలుగా మారుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు డ్రగ్స్​ సైతం వ్యాప్తి చెందుతుండడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. వీటన్నింటికీ జగన్‌ ప్రభుత్వమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ పోర్టు చరిత్రలోనే ఇంత భారీస్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడడం పోర్టు వర్గాలను కుదిపేస్తోంది. నిషేధిత డ్రగ్స్‌ ఖరీదు గ్రాముల్లోనే వేలల్లో ఉంటుంది. అలాంటిది 25 వేల కిలోల విలువ ఎంత ఉంటుందో అనేది తేలాల్సి ఉంది.

విశాఖ తీరంలో భారీ డ్రగ్స్ పట్టివేతపై చంద్రబాబు, పవన్ స్పందన- జగన్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ - Chandrababu reacted on Drugs Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.